- ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య
నస్పూర్, వెలుగు : హైకోర్టు తీర్పు ప్రకారం సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఈనెల 27వ తేదీన నిర్వహించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్ ఏరియా స్టోర్స్, ఆర్కే7 గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ.. ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, హెచ్ఎంఎస్ లాంటి సంఘాలు యాజమాన్యంతో చేతులు కలిపి ఎన్నికలు జరగకుండా ఆపాలని సంతకాలు చేశాయని ఆరోపించారు.
కార్మికుల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం పోరాడాల్సిన సంఘాలు యాజమాన్యం చెంతచేరి కుట్రలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసి కార్మికుల వ్యతిరేకతకు గురై అధికారం కోల్పోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి కార్మికులపై చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులు కాపాడాలంటే ఎన్నికల్లో ఏఐటీయూసీని గెలిపించాలని కోరారు. సమావేశంలో స్థానిక లీడర్లు వీరభద్రయ్య, అక్బర్ అలీ, ఎస్కే బాజీ సైదా, కిషన్ రావు, కొమురయ్య, రాచర్ల చంద్రమోహన్, సంపత్, వేణుమాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి
నస్పూర్ : ప్రజాస్వామ్య పద్ధతిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య కోరారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ3 గనిపై జరిగిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. కోల్ ఇండియా ఒప్పందాలను సింగరేణిలో అమలు చేసేందుకు కృషి చేస్తామని.. బొగ్గు గని కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందాలు, ప్రమోషన్ పాలసీలు, అలవెన్సులపై ఆదాయ పన్ను రియంబర్స్మెంట్ కల్పిస్తామని హామీ ఇస్తున్నట్లు చెప్పారు.
కార్మికుల సంక్షేమం కోసం మెరుగైన విద్య, కార్పొరేట్ వైద్యం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో నాతాడి శ్రీధర్ రెడ్డి, పాగిడి శ్రీకాంత్, మోతె ఓదెలు, గొళ్ల మహేందర్, బోంపల్లి రమేశ్, మద్దెల శ్రీనివాస్, నగేశ్ పవార్, బోయిన మల్లేశ్, అనుమాండ్ల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.