- అందుకే కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో తీర్మానం
- ప్లాన్ ప్రకారమే కేంద్ర మంత్రులతో రాష్ట్ర మంత్రుల ఫొటోలు
- ఆరు గ్యారంటీలపై ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్రంపై దుష్ప్రచారమని ఫైర్
కరీంనగర్, వెలుగు: కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే కేంద్ర మంత్రులను రాష్ట్ర మంత్రులు కలిసి ఫొటోలు దిగుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఆ కుట్రలో భాగంగానే కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో తీర్మానం చేశారని ఆయన మండిపడ్డారు. కరీంనగర్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ లో లక్షా 9 వేల కోట్ల నిధులు కేంద్రం నుంచి వచ్చేవేనని, మరి తెలంగాణకు పైసా ఇవ్వలేదని సిగ్గు లేకుండా ఎట్లా తీర్మానం చేస్తారని ఆయన ప్రశ్నించారు.
ఆరు గ్యారంటీల అమలు చేయలేక ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తూ తీర్మానం డ్రామాలాడారని ఆరోపించారు. ‘సహకరించడానికి మేం సిద్ధంగా ఉన్నం.. పోయినోళ్లు పోయినట్టు వినతిపత్రాలు ఇచ్చి ఫొటోలు దిగుతున్నరు. ఇదో పెద్ద ప్లాన్, పెద్ద కుట్ర. కేంద్రాన్ని బద్నాం చేసే కుట్రలో భాగంగానే కేంద్ర మంత్రులను రాష్ట్ర మంత్రులు కలుస్తున్నరు’ అని సంజయ్ఆరోపించారు.
వికసిత్ భారత్ ఎజెండాగా నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంటే ఎందుకు హాజరుకావట్లేదని ఆయన ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ ఇలాగే చేశారని, పచ్చి అబద్ధాలతో కేంద్రాన్ని బద్నాం చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసిన సీఎంకు ముఖం లేకనే నీతి ఆయోగ్ సమావేశానికి డుమ్మా కొట్టారని మండిపడ్డారు. ప్రజల్లో బీఆర్ఎస్ గురించి చర్చే లేదని, దాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదని ఎద్దేవా చేశారు.
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరదీసిందని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరపాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు అవకాశవాదులని, అసెంబ్లీలో రెండు పార్టీలు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా తీర్మానం చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనమవడం ఖాయం
అవకాశమొస్తే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనమవడం ఖాయమని సంజయ్అన్నారు. లోలోపల కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఆలింగనం చేసుకుంటున్నారని, బయటికొచ్చి తిట్టుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ఆలయ సంప్రదాయాలు పాటించకుండా బీఆర్ఎస్ నేతలు గర్భగుడిలోకి వెళ్లడం దుర్మార్గమని సంజయ్ మండిపడ్డారు. కేటీఆర్ నాస్తికుడని, హిందూ సనాతన ధర్మాన్ని అవమానించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ నేతలు తక్షణమే తెలంగాణ ప్రజలకు, భక్తులకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరించింది, రూ.1,350 కోట్లతో ఎయిమ్స్ ను, రూ.500 కోట్ల వ్యయంతో రైల్వే వ్యాగన్ ఓరాలింగ్ మ్యానుఫాక్చర్ యూనిట్ ను ఏర్పాటు చేసింది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. వరంగల్ లో మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేసినప్పుడు సిరిసిల్లలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని 10 ఏండ్లు పాలించిన కేటీఆర్ ఎందుకు ప్రతిపాదించలేదని ఆయన నిలదీశారు.