ప్రభుత్వం సర్కారు బడుల్లో కనీస సౌలత్లు కల్పించడంలో నిర్లక్ష వైఖరి ప్రదర్శిస్తోంది. స్కూళ్లు ప్రారంభమై రెండు నెలలు కావొస్తున్నా.. విద్యార్థులకు ఇంత వరకు బుక్స్రాలేదు. యూనిఫామ్స్ పూర్తి స్థాయిలో అందలేదు. తరగతి గదులు, టాయిలెట్స్ కొరత తీవ్రంగా ఉంది. టీచర్ల ఖాళీలను నింపలేదు. గవర్నమెంట్స్కూళ్ల డెవలప్మెంట్పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదు. విద్యా పరిరక్షణ కమిటీగా హైదరాబాద్ లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి, పరిశీలించినప్పుడు అనేక విషయాలు మా దృష్టికి వచ్చాయి. సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలను చూసినప్పుడు 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు మూడు గదుల రేకుల షెడ్ మాత్రమే ఉన్నది. వాళ్లందరికీ పాఠాలు బోధించేందుకు ఉన్నది ఇద్దరే ఉపాధ్యాయులు. వాళ్లు ఏదైనా కారణాలతో సెలవు పెడితే అంతే సంగతులు. ఉన్న మూడు గదులైన బాగున్నాయా అంటే అదీ లేదు. పైకప్పు అంత శిథిలావస్థలో ఉంది. ఇప్పుడొస్తున్న వర్షాలకు ఆ విద్యార్థులందరూ ఒక దగ్గర ముడుసుకోవడం తప్ప కూర్చునే ఛాన్స్ లేదు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. రాష్ట్ర రాజధాని నగరంలోనే ఈ దుస్థితి ఉంటే మారుమూల పల్లెల్లో పాఠశాలల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
మూతపడుతున్న స్కూళ్లు
విద్యార్థులు లేరనే సాకుతో రేషనలైజేషన్ పేరిట వందల బడులను మూసేస్తున్న ప్రభుత్వం విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో సరైన వసతులు కల్పించడంపై దృష్టి పెట్టడం లేదు. ప్రభుత్వానికి స్కూల్స్ మూసివేతపై ఉన్న శ్రద్ధ, వాటిని పరిరక్షించడంలో, అభివృద్ధి మార్గంలో నడిపించడంపై ఎంత మాత్రం లేదని స్పష్టమవుతున్నది. సర్కారు బడుల్లో సార్లు సరిగా లేరని, సౌలత్లు బాగా లేవని, ఫలితంగా నాణ్యమైన విద్య అందడం లేదని భావిస్తున్న తల్లిదండ్రులు తమ లాగే తమ పిల్లలు కష్టాలు పడొద్దనే కూలి, నాలి, అప్పులు చేసి మరీ వారి పిల్లలను ప్రైవేట్‌స్కూళ్లకు పంపుతున్నారు. దీంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. దీన్ని నిశితంగా గమనిస్తే ప్రభుత్వమే విద్యార్థులను ప్రైవేటు స్కూల్స్ కు నెట్టుతోందనే భావన కలుగుతోంది. సిద్దిపేటలో ఇందిరా నగర్ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల కోసం క్యూకట్టిన తీరు ఈ మధ్య వార్తల్లో నిలిచింది. ప్రభుత్వం అన్ని సౌలత్లు చేసి, టీచర్లను రిక్రూట్చేస్తే.. ప్రజలు వారి పిల్లలను ప్రభుత్వ బడులకు పంపుతారనడానికి ఆ స్కూల్ఒక ప్రత్యక్ష ఉదాహరణ. విద్యార్థులకు చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా ఉచిత నిర్బంధ విద్యనందించాల్సిన ప్రభుత్వం మెల్ల మెల్లగా తన బాధ్యతల నుంచి తప్పుకుంటోంది.
‘మన ఊరు – మన బడి’ కి నిధులు లేక..
బడులను బాగుచేసేందుకు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు– మన బడి’ పథకానికి నిధుల కేటాయింపు సరిగా లేక ఆశించిన మార్పు రావడం లేదు. ఈ స్కీమ్‌లో భాగంగా కొన్ని బడులనే ఎంపిక చేసినప్పటికీ.. వాటి మౌలిక స్వరూపం కూడా ఏం మారలేదు. బడుల్లో మధ్యాహ్న భోజనమూ అధ్వానంగా ఉంటోంది. నీళ్ల చారు, పురుగుల అన్నం తిని పలు జిల్లాల్లో స్టూడెంట్స్ అస్వస్థతకు గురవుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. మరోవైపు రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీకి అడ్డు లేకుండా పోయింది. నర్సరీ, ఎల్కేజీ నుంచే వేలకు వేలు ఫీజులు దండుకుంటున్నా.. ప్రభుత్వం వాటిని నియంత్రించడం లేదు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు అటు ప్రభుత్వ బడుల్లో చదివించలేక, ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన పాలకులు, ఇప్పుడు ఆ హామీని మరిచిపోయారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస మౌలిక వసతులు కల్పించకుండా, ప్రైవేట్, కార్పొరేట్ బడుల ఫీజుల దోపిడీని అరికట్టకుండా.. ప్రభుత్వం పాఠశాల విద్యను నిర్లక్ష్యం చేస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే.. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సర్కారు విద్యను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేటు, కార్పొరేటుకు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
- గడ్డం శ్యామ్,
రాష్ట్ర ఉపాధ్యక్షుడు,
పీడీఎస్ యూ