- ఆ పార్టీలో పనిచేసిన మాజీ లీడర్‌తో పాటు మరో ముగ్గురు అరెస్ట్
- నాలుగు పిస్టల్స్, 8 మ్యాగ్జిన్లు, 18 రౌండ్స్ బుల్లెట్లు స్వాధీనం
ఆదిలాబాద్ టౌన్, వెలుగు : ప్రభుత్వ నిషేధిత జనశక్తి దళ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్న వ్యక్తులను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పిస్టల్స్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నంద్యాల జిల్లా సున్నిపెంట గ్రామానికి చెందిన ఒట్టి వెంకట్‌రెడ్డి గతంలో జనశక్తి పార్టీలో పనిచేసి అరెస్ట్ అయి విడుదల అయ్యాడు.
తర్వాత సూర్యాపేట జిల్లాలో తన ఫ్రెండ్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఉమ్మడి కర్నూల్‌లో జనశక్తి పార్టీని తిరిగి స్థాపించేందుకు ప్లాన్ చేశాడు. ఇందుకోసం నల్గొండ జిల్లా నకిరేకల్ గ్రామానికి చెందిన నల్లగంటి ప్రసన్నరాజు ఆర్థికసాయం అందజేశాడు. వెంకట్‌రెడ్డి అనుచరుడైన నంద్యాల జిల్లాకు చెందిన ఆవులపాటి హిమకాంత్‌రెడ్డి, అదే జిల్లాకు చెందిన మైల దిలీప్ ఇటీవల కాశీకి వెళ్లారు. అక్కడి నుంచి బీహార్‌లోని మృంగార్ రైల్వేస్టేషన్‌కు చేరుకొని అక్కడ ఓ వ్యక్తి నుంచి పిస్టల్స్, బుల్లెట్స్ తీసుకున్నారు. అక్కడి నుంచి కారులో తిరిగి వస్తున్నారు.
గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని చాందా ‘టీ’ బైపాస్ వద్ద రూరల్ ఎస్సై ముజాహిద్, సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ టైంలో అటువైపు వచ్చిన కారును ఆపి తనిఖీ చేయగా అందులో ఆయుధాలు కనిపించాయి. దీంతో దిలీప్, హిమకాంత్‌రెడ్డిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నాలుగు 7.65 ఎంఎం పిస్టల్స్, 8 మ్యాగ్జిన్లు, 18 రౌండ్ల బుల్లెట్లు, 6 సెల్‌ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో వెంకట్‌రెడ్డిని, ప్రసన్నరాజును సైతం అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.
వెంకట్‌రెడ్డిపై మూడు హత్య, ఒక హత్యాయత్నం, జనశక్తికి సంబంధించి నాలుగు, రెండు టాడా కేసులు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. నిందితులను పట్టుకున్న పోలీసులను ఆయన అభినందించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ బి.సురేందర్‌రావు, డీఎస్‌పీ ఎల్.జీవన్‌రెడ్డి, సీఐలు కె.ఫణీధర్, కరుణాకర్, డి.సాయినాథ్, ఎస్సైలు ముజాహిద్ పాల్గొన్నారు.