
హనుమకొండ సిటీ, వెలుగు: తెలంగాణలో విద్యుత్ రంగాన్ని చీకట్లోకి నెట్టేసే కుట్ర జరుగుతోందని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్-1104 యూనియన్ పవర్‌మెన్2023 డైరీని బుధవారం హంటర్ రోడ్డులోని విష్ణుప్రియా గార్డెన్స్‌లో మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ గుజరాత్రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం నెలకొందన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశంలో నవరత్నాలుగా పిలిచే అన్ని కంపెనీలను ప్రైవేటుపరం చేస్తోందని ఆరోపించారు. అందులో భాగంగానే విద్యుత్ రంగంపైనా కుట్ర జరుగుతోందని, విద్యుత్ ఉద్యోగులు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ఇదివరకు రాష్ట్రంలో కరెంట్ సరిగా లేక హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల్లో ఇండస్ట్రీలు మూతపడ్డాయన్నారు. కానీ విద్యుత్ ఎంప్లాయీస్ సహకారంతో 24 గంటలు నాణ్యమైన కరెంట్అందిస్తున్నామని, దీంతో కంపెనీలు క్యూ కడుతున్నాయన్నారు. కానీ కొంతమంది అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, సీఎం కేసీఆర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి చొరవ చూపుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, యూనియన్ అధ్యక్షుడు వి.వెంకటేశ్వర్లు, ఎస్పీడీసీఎస్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
దేవాదుల వర్క్స్మేలోగా పూర్తి చేయాలె
హనుమకొండ: దేవాదుల ప్రాజెక్టు పనులు వచ్చే మే నెలలోగా కంప్లీట్ చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆఫీసర్లను ఆదేశించారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవాదుల పనుల పురోగతిపై హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం రివ్యూ చేశారు. ముందుగా పనుల పురోగతిని ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ ప్యాకేజీ మూడు, ఆరు కింద ఉమ్మడి జిల్లాలోని వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాలు ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టుల కింద ఉప్పుగల్లు, నష్కల్, పాలకుర్తి రిజర్వాయర్లున్నాయని, వాటి పనులు పూర్తి కాలేదని పేర్కొన్నారు. భూసేకరణ, రోడ్డు డైవర్షన్లు, మిషన్ భగీరథ పనులకు సంబంధించిన ఇబ్బందులన్నీ తొలగించామన్నారు. ఇదివరకు కాంట్రాక్టర్ పనులు చేయకపోతే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రీ టెండర్పెట్టించామని, అయినా పనులు అనుకున్నంతగా సాగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొడకండ్ల, పాలకుర్తి, రాయపర్తి, వర్ధన్నపేట తదితర మండలాలకు నీళ్లు రాలేదని చెప్పారు. గతంలో ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చారని, కానీ మూడేండ్లవుతున్నా పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొందర్లోనే సీఎం కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టుపై రివ్యూ చేస్తారని, ఆ లోగా పనులన్నీ కంప్లీట్ చేయాలని ఆదేశించారు. అంతకుముందు హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ బిల్డింగ్‌లో బ్యాంక్ 2023 డైరీని మంత్రి ఎర్రబెల్లి ఆవిష్కరించారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లా కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, డాక్టర్ బి.గోపి, శివలింగయ్య, చీఫ్ ఇంజినీర్ సుధాకర్ రెడ్డి, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.