కుట్రదారులను తేలుస్తం.. కఠిన చర్యలు తప్పవు: మంత్రి శ్రీధర్​బాబు

కుట్రదారులను తేలుస్తం.. కఠిన చర్యలు తప్పవు: మంత్రి శ్రీధర్​బాబు
  • ప్రజలను రెచ్చగొట్టి ఆఫీసర్లపై దాడికి పాల్పడ్డరు
  • ప్లాన్​ ప్రకారం కలెక్టర్​ని అక్కడికి రమ్మని చెప్పిందెవరో.. దాడి చేయించిందెవరో తేలుస్తం
  • అధికారం పోయిందనే ఈర్ష్యతో  ప్రభుత్వంపై బీఆర్​ఎస్​ కుట్రలు
  • రౌడీయిజం చేస్తామంటే ఊరుకోబోమని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: వికారాబాద్  జిల్లా లగచర్లలో ప్రజలను రెచ్చగొట్టి కలెక్టర్​పై, ఇతర అధికారులపై దాడికి పాల్పడ్డారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నదని తెలిపారు. ‘‘లగచర్లకు కలెక్టర్ ను పథకం ప్రకారం రమ్మని చెప్పింది ఎవరు? దాడి చేసింది ఎవరు? దీని వెనుక ఉన్న కుట్రదారులు ఎవరు.. అనేదానిపై ఖచ్చితంగా విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటం” అని ఆయన హెచ్చరించారు. ప్రజాభిప్రాయ సేకరణ వద్దకు కలెక్టర్ ను వెళ్లనివ్వకుండా, ఇతర ప్రాంతానికి పథకం ప్రకారం ఆయనను తీసుకెళ్లి కొంతమంది దాడికి పాల్పడ్డారని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డుతగిలితే  ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని హెచ్చరించారు.

‘‘ప్రజాస్వామ్య పద్ధతిలో అభిప్రాయాలను తెలపడానికి వేదిక ఉంటుంది.. మా ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తి తో పనిచేస్తున్నది. అందులో భాగంగానే ప్రజాస్వామ్యయుతంగా ప్రజాభిప్రాయ సేకరణ  జరపాలని కలెక్టర్  ఆలోచించారు. కాని కొందరు మాత్రం రైతులు, ప్రజల పేరుమీద రౌడీయిజం చేసి కలెక్టర్, ఇతర అధికారులపై దాడి చేశారు. ప్రభుత్వ అధికారులను ఎవరు బెదిరించినా ఏమాత్రం సహించేది లేదు” అని మంత్రి శ్రీధర్​బాబు అన్నారు. మంగళవారం అసెంబ్లీలోని  సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వ కార్యక్రమాలను,  సంక్షేమ పథకాలను కావాలని అడ్డుకుంటున్నదని, రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా కుట్రలు ఎవరు చేస్తున్నారోత్వరలోనే బయటపెడతామన్నారు. రౌడీయిజం, గూండాయిజం చేస్తామంటే ఊరుకునేది లేదని శ్రీధర్​బాబు హెచ్చరించారు.  రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి రాజకీయ లబ్ధి కోసం చేసే వారి కుట్రలను వెలికితీస్తామన్నారు. లగచర్ల ఘటనలో పోలీసు,  ఇంటెలిజెన్స్, ప్రభుత్వ అధికారుల్లో ఎవరి వైఫల్యం ఉందో విచారణ జరిపిస్తామని తెలిపారు. 

ఎవరి ప్రమేయం ఉన్నా వదలం

ప్రజాభిప్రాయం ప్రకారమే లగచర్లలో ఫార్మా కంపెనీ విషయంలో ముందుకు వెళ్తామని మంత్రి శ్రీధర్​బాబు అన్నారు. ఈ ఘటన వెనుక ఓ మాజీ ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతున్నదని మీడియా ప్రతినిధులు ఆయన దృష్టికి తేగా.. ఎవరి ప్రమేయం ఉన్నా వదిలేది లేదని హెచ్చరించారు. ‘‘కాంగ్రెస్  పార్టీ అధికారంలోకి రావడంతో ప్రజలకు ఎవరికి ఎలాంటి బాధ లేదు.అధికారం పోయిందనే బాధ బీఆర్ఎస్ లో మాత్రమే ఉంది. మేం వేసే  ప్రతి అడుగులో ఇబ్బంది పెట్టాలనే బీఆర్​ఎస్​ చూస్తున్నది” అని ఆయన తెలిపారు. కేటీఆర్​ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసని, ఆయనకున్న రాజకీయ ఇబ్బందులను అధిగమించడానికే ఢిల్లీకి వెళ్లారని అన్నారు. అమృత్ పథకంలో ఆరోపణలు అనేవి బీఆర్ఎస్ బట్ట కాల్చి మీద వేసే  ప్రయత్నం మాత్రమేనని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్​ అవగాహనతోనే పొద్దున ఒకరు, సాయం త్రం ఒకరు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని,  ఈ రెండు పార్టీలు ఒకటయ్యాయని ఆయన ఆరోపించారు.