కానిస్టేబుల్​పై కత్తులతో దాడి.. 30 గొర్రెల చోరీ.. హైదరాబాద్ శివారులో రెచ్చిపోయిన దొంగల ముఠా

కానిస్టేబుల్​పై కత్తులతో దాడి.. 30 గొర్రెల చోరీ.. హైదరాబాద్ శివారులో రెచ్చిపోయిన దొంగల ముఠా

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: సిటీ శివారులో పశువుల దొంగలు రెచ్చిపోయారు. గొర్రెల కాపరులపై కత్తులతో దాడి చేసి, 30 గొర్రెలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..  తుర్కయంజాల్‌‌‌‌ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడ గ్రామానికి చెందిన నవీన్‌‌‌‌ కుషాయిగూడ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో కానిస్టేబుల్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. 

తన తండ్రికి ఆరోగ్యం బాగలేకపోవడంతో గ్రామ శివారులోని తమ గొర్రెల మంద వద్ద కాపలా ఉండేందుకు తన సమీప బంధువుతో కలిసి ఆదివారం రాత్రి వెళ్లాడు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో 10 మంది దుండగులు బొలెరో వాహనంలో గొర్రెల మంద వద్దకు వచ్చి చోరీకి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన కానిస్టేబుల్​ నవీన్, అతని బంధువుపై కత్తులతో దాడి చేసి, దాదాపు 30 గొర్రెలు ఎత్తుకెళ్లారు. 

బాధితుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని హాస్పిటల్​కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కానిస్టేబుల్ నవీన్ తండ్రి ఒంటరిగా ఉండటం గమనించిన దొంగలు.. పక్కా ప్లాన్ ప్రకారమే దోపిడీ చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను త్వరలో పట్టుకొని, రిమాండ్ కు పంపిస్తామన్నారు.