కార్డియాక్ అరెస్ట్ వల్లే కానిస్టేబుల్ అభ్యర్థి రాజేందర్ మృతి

వరంగల్ జిల్లా : పోలీస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా రన్నింగ్ రేస్ లో పాల్గొన్న అనంతరం అస్వస్థతకు గురై చనిపోయిన కానిస్టేబుల్ అభ్యర్థి రాజేందర్ మృతిపై  పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. కార్డియాక్ అరెస్ట్ అవడం వల్లే కానిస్టేబుల్ అభ్యర్థి రాజేందర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని తేలిందని చెప్పారు. వెంటనే ఆస్పత్రికి తరలించి చకిత్స అందించినా ఫలితం దక్కలేదన్నారు. 

అనారోగ్యాలకు ముందుగా వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయని పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. మృతుడు రాజేందర్ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న జెనటికల్ ప్రాబ్లమ్ కూడా మరణానికి కారణమై ఉండవచ్చన్నారు. అభ్యర్థుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని రిక్రూట్మెంట్లో చాలా మార్పులు చేశారని తెలిపారు. ఫిట్​ నెస్​  పరీక్షలో నెగ్గిన రాజేందర్.. తన కోరిక తీరకుండానే మృతి చెందడం చాలా బాధాకరం అని  పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. 

17న 1600మీటర్ల పరుగు పందెంలో పాల్గొని అస్వస్థతకు గురైన రాజేందర్

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్ లో జరుగుతున్న కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టుల్లో రాజేందర్ పాల్గొన్నాడు. నెల 17వ తేదీన పోలీసు రిక్రూమెంట్ పరుగు పందెంలో 1600 మీటర్ల విభాగంలో పాల్గొని గుండెపోటుతో కుప్పకూలగా.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. గత నాలుగు రోజులుగా ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. ఇవాళ ఉదయం మృతి చెందాడు. రాజేందర్ స్వస్థలం ములుగు జిల్లా శివా తండా.  

రాజేందర్ ఘటనతో మొత్తం పోలీసు రిక్రూట్ మెంట్ విధానాన్ని మార్పు చేయాలనే డిమాండ్లు పెరిగాయి. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో డీజీపీ ఆఫీసు ముట్టడికి ప్రయత్నించగా..  మాజీ ఐపీఎస్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం స్పందించారు. దేశంలో ఎక్కడా లేనట్లు కఠినంగా వ్యవహరిస్తున్నారని.. లాంగ్ జంప్ డిస్టెన్స్ తగ్గించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. పోలీసు శాఖ ఉన్నతాధికారులు కూడా స్పందించి మార్పులు చేసినట్లు సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు.