ఎల్బీనగర్, వెలుగు: గ్రామీణ అభ్యర్థులకు తీవ్ర నష్టాన్ని కలిగించే జీఓ నం.46ను సవరించి సీడీ-1, సీడీ-2 ప్రకారం కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలను ప్రకటించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. వెంటనే పోస్టులు భర్తీ చేయాలని కోరారు. బుధవారం రాత్రి దిల్ సుఖ్ నగర్ లో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. వందలాది మంది ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. పలువురు కానిస్టేబుల్ అభ్యర్థులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇచ్చిన జీఓ 46ను సవరించి ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. .
జీఓపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయని, అడ్వకేట్ జనరల్ కోర్టుకు వచ్చి వాదనలు వినిపించడం లేదని మండిపడ్డారు. ఆగస్టు 7న కోర్టులో వాదనలు జరుగుతాయని, దీనికి ఏజీ హాజరుకావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. వందల మంది అభ్యర్థులు ఒక్కసారిగా రోడ్డెక్కడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.