జీవో నెంబర్ 46 రద్దు చేయండి.. ప్రభుత్వానికి కానిస్టేబుల్ అభ్యర్థుల డిమాండ్

జీవో నెంబర్ 46 రద్దు చేయండి.. ప్రభుత్వానికి కానిస్టేబుల్ అభ్యర్థుల డిమాండ్

హైదరాబాద్ : డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రికత్త నెలకొంది. డీజీపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన గ్రామీణ జిల్లాల నిరుద్యోగ జేఏసీకి చెందిన యువకులను అడ్డుకుని.. అరెస్ట్ చేశారు పోలీసులు. జీవో నెంబర్ 46 రద్దు చేయాలని డిమాండ్ చేశారు కానిస్టేబుల్ అభ్యర్థులు. 

అసెంబ్లీ ముందు నుంచి డీజీపీ కార్యాలయానికి పరుగులు తీసిన కానిస్టేబుల్ అభ్యర్థులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, అభ్యర్థులకు మధ్య వాగ్వివాదం జరిగింది. జీవో 46 కారణంగా గ్రామీణ ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జీవో 46 కారణంగా హైదరాబాద్ , సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 56 శాతం పోస్టులు భర్తీ చేస్తున్నారు. మిగిలిన జిల్లాలకు 44 శాతం మాత్రమే కేటాయిస్తున్నారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

జీవో  నెంబర్ 46 నుండి TSSP కానిస్టేబుల్ అభ్యర్థులకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2016, 2018 నియామకాల మాదిరిగానే 2022 ఉద్యోగ ప్రకటనను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత నోటిఫికేషన్లలో టీఎస్ఎస్పీ పోస్టులను రాష్ట్రవ్యాప్తంగా ఓపెన్ కేటగిరి కింద నియామకం జరిగేవని, ప్రస్తుతం దీనికి విరుద్ధంగా జీవో నెంబర్ 46 మారిందని, దీనివలన పెద్ద ఎత్తున మెరిట్ అభ్యర్థులు నష్టపోతున్నారని వాపోయారు. తెలంగాణ ప్రభుత్వం గత ఏప్రిల్ లో జీవో నెంబర్ 46ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 

ALSO READ:మళ్లీ పెంచేశారు.. రూ.300 దాటిన పెట్రోల్ , డీజిల్ ధరలు