- కానిస్టేబుల్ ఫిర్యాదుతో 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు
- 2 నెలలుగా చిన్నారులు, పేరెంట్స్ పై వేధింపులు
- వరంగల్‌లో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
వరంగల్, వెలుగు: తన కారుపై గీతలు గీశారని 8 మంది స్కూల్ పిల్లలపై ఓ కానిస్టేబుల్ కేసు పెట్టగా.. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదైన వారిలో 3వ తరగతి నుంచి పదో తరగతి చదువుకుంటున్న స్టూడెంట్లు ఉన్నారు. కారుపై గీతలు గీశారని చిన్న పిల్లలపై కేసు పెట్టినందుకు పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
హనుమకొండ రాంనగర్‌లోని రాంనగర్ టవర్స్ లో నివాసం ఉండే కె.రాజు సీఐడీ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. జులై 27న అదే అపార్టుమెంట్లో ఉండే కొందరు పిల్లలు అతని కారుపై గీతలు గీశారు. దాంతో రాజు చిన్నారులపై సుబేదారి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. 8 మంది పిల్లలు తన కూతురును తిడుతూ కారుపై రాతలు రాసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. కారు మీద గీతలు తొలగించేందుకు రూ.1.80 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపాడు.
రాజు ఫిర్యాదు ఆధారంగా ఆగస్ట్5న పోలీసులు 8 మంది చిన్నారులపై ఎఫ్ఐఆర్నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా.. స్కూళ్ల నుంచి రకరకాల సర్టిఫికెట్లు తేవాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. రాజు తమను నిత్యం బెదిరిస్తున్నాడని, తనకు హైదరాబాద్ స్థాయిలో ఉన్నతాధికారుల అండ ఉందని వేధింపులకు గురిచేస్తున్నాడని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు.