హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమి నగర్ లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కుంచపు రాజ్ కుమార్ అనే వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తన భార్య శోభను కత్తితో మెడ కోసి.. మొదటి అంతస్తు నుండి కింద పడేసి హతమార్చాడు.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై ఎల్బీ నగర్ డీసీపీ సాయి శ్రీ ఆరా తీస్తున్నారు. నిందితుడు రాజ్ కుమార్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడించారు. నిందితుడు రాజ్ కుమార్ హైకోర్ట్ లోని 4 వ గేట్ వద్ద కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
హత్యకు గురైన కానిస్టేబుల్ భార్య శోభ కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన దిగారు. దంపతుల మధ్య గొడవలు జరగ్గా.. గతంలో ఓ పోలీస్ ఉన్నతాధికారి నచ్చచెప్పితేనే కాపురానికి పంపించామని...ఇప్పుడు తమ కూతురిని పొట్టనబెట్టుకున్నారని మృతురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
కానిస్టేబుల్ రాజ్ కుమార్, శోభ దంపతులకు ఒక కుమారు ఉన్నాడు. తన తల్లిపై తండ్రి కత్తితో దాడి చేసి.. ఇంటిపై నుండి తోసేసి చంపాడని కుమారుడు తెలిపాడు. తన తండ్రి మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. దీంతో సంవత్సర కాలంగా ఇంట్లో గొడవలు జరుతున్నాయిని కొడుకు వెల్లడించాడు. అడ్డు వచ్చిన తనపై కూడా కత్తితో దాడి చేశాడని బాలుడు చెప్పాడు. హంతకుడైన తన తండ్రిని పట్టుకొని శిక్షించాలని బాలుడు పోలీసులను కోరాడు.