- పురుగులమందు తాగి చనిపోయిన భూక్యా సాగర్
- ఎస్ఐ, బీఆర్ఎస్ లీడర్ కలిసి గంజాయి వ్యాపారం చేశారంటూ సెల్ఫీ వీడియో
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్‌లో ఘటన
- సీఐ, ఇద్దరు ఎస్ఐలపై కేసు నమోదు
బూర్గంపహాడ్, వెలుగు: పోలీస్ స్టేషన్ నుంచి గంజాయి చోరీ అయిన కేసులో తనను బలిపశువును చేశారని ఆరోపిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న భూక్యా సాగర్ (36) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన అనంతరం అతడు పురుగులమందు తాగాడు. అతడిని ముందు స్థానిక ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఆదివారం పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఖమ్మం జిల్లా ఏన్కూరుకు చెందిన భూక్యా సాగర్ కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బూర్గంపహాడ్ మండలం సారపాకకు చెందిన ఇద్దరు వ్యక్తులు లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని తరలిస్తూ పట్టుబడగా.. అప్పటి లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ సంతోష్ విచారణ చేపట్టారు. విచారణలో బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ లో సీజ్ చేసిన గంజాయిని దొంగలించినట్లుగా తేలింది. స్టేషన్ లో గంజాయిని దొంగలించటానికి కానిస్టేబుల్ భూక్యా సాగర్ సహకరించినట్లుగా పట్టుబడ్డ నిందితులు చెప్పారు. దీంతో శాఖాపరమైన విచారణ చేపట్టిన జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు స్టేషన్ లో గంజాయి చోరీకి కానిస్టేబుల్ సాగర్ సహకరించాడని నిర్ధారించారు. కేసు నమోదు చేసి సస్పెండ్ చేశారు. అయితే, సస్పెన్షన్ ను మూడు రోజుల క్రితమే ఎత్తివేసి అతడికి పినపాక మండలంలో పోస్టింగ్ ఇచ్చారు.
ఎస్ఐ, బీఆర్ఎస్ లీడర్ పై ఆరోపణలు..
ఏన్కూరులో శనివారం పురుగులమందు తాగడానికి ముందు సాగర్ తన ఫోన్లో సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. గంజాయి చోరీ కేసులో తనను బలిపశువును చేశారని ఆరోపించాడు. చోరీ జరిగిన సమయంలో విధుల్లో ఉన్న ఎస్ఐ రాజ్ కుమార్ పై చర్యలు తీసుకోలేదని, గతంలో బూర్గంపహాడ్ ఎస్ఐగా విధులు నిర్వహించి, లక్ష్మీదేవిపల్లిలో తనపై కేసు నమోదు చేసిన ఎస్ఐ సంతోష్, బీఆర్ఎస్ నాయకుడు గోనెల నాని కలిసి గంజాయి వ్యాపారం చేశారని ఆరోపణలు చేశాడు. జిల్లాలో గంజాయి స్మగ్లింగ్‌లో పాత్ర ఉన్న ఎస్ఐలను వదిలేసి తనపై చర్యలు తీసుకోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు.
రేవంతన్నా.. నా ఫ్యామిలీకి న్యాయం చేయన్నా..
కానిస్టేబుల్ సాగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కూడా ఒక వీడియో రికార్డ్ చేశాడు. ‘‘రేవంతన్నా నీకు దండం పెడతా. నా భార్యకు, తల్లితండ్రులకు, తమ్ముడికి, కుటుంబానికి న్యాయం చేయండి. తమ కుటుంబసభ్యులంతా కాంగ్రెస్ కు మద్దతుదారులుగా ఉన్నారనే నాపై కేసు పెట్టారు. ఆ సమయంలో సీజ్ చేసిన సెల్ ఫోన్ చెక్ చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. దయచేసి నా ఫ్యామిలీకి న్యాయం చేయండి” అని సీఎం రేవంత్ రెడ్డిని సాగర్ వేడుకున్నాడు. కాగా, సాగర్ తండ్రి భూక్యా కిషన్ ఫిర్యాదు మేరకు సీఐ సత్యనారాయణ, ఎస్ఐలు సంతోష్, రాజ్ కుమార్ తో పాటు బీఆర్ఎస్ నాయకుడు గోనెల నానిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఏన్కూరు పోలీసులు తెలిపారు.