
- కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి అధికారుల ఆదేశం
- మా అమ్మను అవమానించినందుకే కొట్టిన
- తేల్చి చెప్పిన కుల్విందర్ కౌర్
- రైతు సంఘాల మద్దతు
- 9న మొహాలీలో ఆందోళనలు
న్యూఢిల్లీ: సినీనటి, మండి లోక్‌సభ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) కానిస్టేబుల్ కుల్విం దర్ కౌర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. రైతులను అవమానించినందుకే తాను చెంప దెబ్బ కొట్టానని కుల్విందర్ కౌర్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు రైతు సంఘాల నేతలు ఈ ఘటనపై స్పందించారు.
ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని యూనియన్లు కుల్విందర్ కు మద్దతుగా నిలిస్తే.. మరికొన్ని సంఘాలు విమర్శిస్తున్నాయి. కుల్విందర్ కౌర్‌ను విధుల నుంచి తొలగించి అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ యూనియన్ నేతలు ఈ నెల 9న మొహాలీలో నిరసనకు పిలుపునిచ్చారు. ‘ఇన్సాఫ్ మోర్చా’ పేరుతో కుల్విందర్‌కు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీలు చేపట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా(నాన్ పొలిటికల్) యూనియన్ సహా పలు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. కాగా, కంగనా రనౌత్ ఢిల్లీకి వెళ్లేందుకు గురువారం చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. ఈ క్రమంలో చెకింగ్ కౌంటర్ వద్ద విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్.. కంగనాను చెంప దెబ్బ కొట్టింది.
ఉద్యోగం కంటే నా తల్లి గౌరవమే ఎక్కువ..
‘2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సమీపంలోని షషీన్ బాగ్‌లో వందలాది మహిళలు 100 రోజుల పాటు నిరసన తెలిపారు. ఆ ఉద్యమాన్ని షషీన్ బాగ్ దాదీగా పేరొందిన 82 ఏండ్ల బిల్కిస్ ముందుండి నడిపించారు. తర్వాత రైతు చట్టాలకు వ్యతిరేకంగా చేసిన నిరసనల్లోనూ ఆమె పాల్గొన్నారు. ఈ ఆందోళనలను విమర్శిస్తూ.. రోజుకు వంద రూపాయలు తీసుకుని రైతులు ధర్నాల్లో కూర్చుంటున్నారంటూ ఓ ట్విట్టర్ యూజర్ కామెంట్ చేస్తే.. దాన్ని కంగనా సమర్థించింది. హేళన చేస్తూ పోస్టులు పెట్టింది.
ఆ టైమ్‌లో మా అమ్మ కూడా అక్కడే ఉన్నది’’ అని కుల్విందర్ తన స్టేట్మెంట్లో తెలిపింది. మా అమ్మను అవమానించినందుకే కంగనాను కొట్టానని చెప్పింది. ‘నాకు జాబ్ గురించి ఆందోళన లేదు. ఉద్యోగం కంటే మా అమ్మ గౌరవం నాకు ముఖ్యం. గౌరవం కాపాడుకోవడానికి ఇలాంటి వెయ్యి ఉద్యోగాలైనా త్యాగం చేస్తాను’ అని ట్విట్టర్లో కౌర్ పోస్టు పెట్టింది.
పారదర్శకంగా విచారించాలి: రైతు సంఘాలు
ఎంపీ కంగనాను కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టిన ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపించాలని పలు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కుల్విందర్కే మద్దతిస్తున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా నేతలు ప్రకటించారు.