గుడ్‌‌విల్‌పేరిట..పోలీసులకు రూ.25 కోట్లకు కుచ్చుటోపీ

గుడ్‌‌విల్‌పేరిట..పోలీసులకు రూ.25 కోట్లకు కుచ్చుటోపీ
  • రియల్‌‌ఎస్టేట్‌‌లో పెట్టుబడి కోసమంటూ రూ.25 కోట్లు వసూలు
  • ఈఎంఐ కట్టడంతో పాటు గుడ్‌‌విల్‌‌ ఇస్తానంటూ నమ్మించి మోసం
  • ప్రైవేట్‌‌ వడ్డీ వ్యాపారుల వద్ద మరో రూ.20 కోట్లు అప్పు
  • వారం రోజులుగా కనిపించకుండా పోయిన కానిస్టేబుల్‌‌ 

వనపర్తి, వెలుగు: మీ పేరు మీద లోన్‌‌తీసుకొని నాకు అప్పుగా ఇస్తే ఈఎంఐ నేనే కడుతా..లోన్‌‌ మొత్తాన్ని బట్టి గుడ్‌‌విల్‌‌కింద రూ.5 లక్షల వరకు ఇస్తా అని నమ్మించిన ఓ కానిస్టేబుల్‌‌ తోటి సిబ్బంది నుంచి కోట్లాది రూపాయలు తీసుకొని కనిపించకుండా పోయాడు. గణేశ్‌‌ నిమజ్జన బందోబస్తుకు హైదరాబాద్‌‌ వెళ్లిన సదరు కానిస్టేబుల్‌‌ ఇప్పటివరకు తిరిగి రాకపోవడంతో డబ్బులు ఇచ్చిన వారిలో ఆందోళన నెలకొంది. పోలీసుల నుంచే కాకుండా ప్రైవేట్‌‌ వడ్డీ వ్యాపారుల నుంచి కూడా భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు బయటపడడం పోలీస్‌‌శాఖలో కలకలం రేపుతోంది.

తోటి కానిస్టేబుల్‌‌ కనిపించకుండా పోవడంతో..

పాన్‌‌గల్‌‌ పోలీస్‌‌స్టేషన్‌‌లో పనిచేసే రామకృష్ణ అనే కానిస్టేబుల్‌‌ తాను ఆర్థిక ఇబ్బందుల కారణంగా డ్యూటీ చేయలేకపోతున్నానని ఈ నెల 25న భార్యకు మెసేజ్‌‌ పెట్టి బయటకు వెళ్లిపోయాడు. ఇంతవరకూ ఇంటికి రాలేదు. దీంతో రామకృష్ణకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఏమిటి ? అసలు అప్పులు ఎందుకు చేశాడు ? అనే కోణంలో ఆరా తీయగా మరో కానిస్టేబుల్‌‌ చేసిన మోసం వెలుగు చూసింది. అతడి కారణంగానే రామకృష్ణ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారని తేలింది.

బిల్డర్‌‌గా అవతారం ఎత్తిన కానిస్టేబుల్‌‌

వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపూర్‌‌ పోలీస్‌‌ స్టేషన్‌‌లో పనిచేసే ఓ కానిస్టేబుల్‌‌ బిల్డర్‌‌ కమ్‌‌ రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారిగా అవతారం ఎత్తాడు. కొన్నేండ్లుగా ఇండ్లు నిర్మిస్తూ, వెంచర్లు చేయడంతో పాటు వైన్స్‌‌ బిజినెస్ సైతం చేస్తున్నాడు. సర్కార్‌‌ ఉద్యోగులకు లోన్లు ఈజీగా వచ్చే అవకాశం ఉండడంతో తాను చేస్తున్న బిజినెస్‌‌కు అవసరమైన డబ్బులను తోటి కానిస్టేబుళ్ల నుంచి తీసుకునేందుకు ప్లాన్‌‌ చేశాడు. 

ఇందులో భాగంగా తమ పేరు మీద ఎంత లోన్‌‌ వస్తే అంత తీసి ఇస్తే ఈఎంఐ కట్టడంతో పాటు గుడ్‌‌విల్‌‌ కింద లోన్‌‌ మొత్తాన్ని బట్టి రూ. 5 లక్షల వరకు ఇస్తానని తోటి సిబ్బందిని నమ్మించాడు. 

ఇలా కొందరికి ఇవ్వడంతో మిగతా వారు సైతం అతడిని నమ్మారు. కానిస్టేబుళ్ల నుంచి తీసుకున్న డబ్బులనే రొటేషన్‌‌ చేస్తూ తన బిజినెస్‌‌ నడిపించాడు. తోటి ఉద్యోగే కావడంతో మోసం చేయడులే అన్న ధీమాతో పోలీసులు తమ పేర్ల మీద లోన్లు తీసుకొని అతడికి ఇచ్చారు. 

ఇలా సుమారు 30 మంది కానిస్టేబుళ్లు రూ. 25 కోట్ల వరకు ఇచ్చినట్లు సమాచారం. దీంతో పాటు ప్రైవేట్‌‌ వడ్డీ వ్యాపారుల వద్ద మరో రూ. 20 కోట్లు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సదరు కానిస్టేబుల్‌‌ ఇటీవల గణేశ్‌‌ నిమజ్జన బందోబస్త్‌‌కు హైదరాబాద్‌‌కు వెళ్లి ఇప్పటివరకు తిరిగి రాలేదు. దీంతో డబ్బులు ఇచ్చిన వారిలో ఆందోళన మొదలైంది. లోన్లు తమ పేరున ఉండడంతో ఈఎంఐలు తామే కట్టాల్సి వస్తుందని బాధిత కానిస్టేబుళ్లు వాపోతున్నారు. 

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం 

కనిపించకుండా పోయిన పాన్‌‌గల్‌‌ కానిస్టేబుల్‌‌ రామకృష్ణ ఆచూకీ ఇంకా తెలియలేదు. శ్రీరంగాపూర్‌‌ కానిస్టేబుల్‌‌ కూడా అప్పులు చేసి మోసం చేశాడని అంటున్నారు తప్ప ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి వాస్తవాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటాం. నాగభూషణరావు, సీఐ, వనపర్తి .

Also Read:-వానాకాలంలోనూ.. కరెంట్ వాడకం పెరిగింది