ఫ్లై ఓవర్​పై చైనా మాంజా తొలగింపుకు కానిస్టేబుల్స్​ కాపలా!

మెహిదీపట్నం, వెలుగు:  చైనా మాంజాతో ప్రాణాలు పోతుండడంతో లంగర్ హౌస్ పోలీసులు స్థానిక ఫ్లైఓవర్ పై ఇద్దరు పోలీసులను కాపలా పెట్టాల్సి వచ్చింది. వీరు రెండు రోజులుగా ఫ్లై ఓవర్​పై డ్యూటీ చేస్తూ చైనా మాంజా చుట్టుకుంటే తొలగిస్తున్నారు. గత ఏడాది ఓ రాత్రి వేళ ఓ ఆర్మీ జవాన్​  టూ వీలర్ ​నడుపుకుంటూ ఈ ఫ్లై ఓవర్​పై నుంచి వస్తూ చైనా మాంజా గొంతు కోయడంతో చనిపోయాడు. 

ఈసారి అలా జరగకుండ పోలీసులు ముందస్తుగా ఫ్లై ఓవర్​పై ఇద్దరు పోలీసులను కాపలా పెట్టారు. వీరు రెండు రోజుల నుంచి బ్రిడ్జి పై చిక్కుకుంటున్న చైనా మాంజాను తొలగిస్తున్నారు. మాంజా పడినప్పుడాల్లా పలుమార్లు వాహనాలను నిలిపివేసి 
తొలగిస్తున్నారు. మంగళవారం నారాయణగూడలో ఓ ట్రాఫిక్ ​కానిస్టేబుల్, బుధవారం ఆసిఫ్ నగర్ లో మరో ట్రాఫిక్ కానిస్టేబుల్ చైనా మాంజా తగిలి గాయపడ్డారని సౌత్ అండ్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ తెలిపారు.