- హెడ్‌కానిస్టేబుల్ అయ్యే టైంలో కొంపముంచిన 317 జీఓ
- జిల్లా యూనిట్‌గా ప్రమోషన్లు ఇయ్యకపోవడంతో 1999 బ్యాచ్‌కు నష్టం
- ఇక కానిస్టేబుళ్లగానే రిటైర్ కావాల్సిన పరిస్థితి
వెలుగు, నిజామాబాద్ : 317 జీఓ ప్రకారం పోలీస్‌శాఖలో ఇటీవల చేపట్టిన ప్రమోషన్లలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన 1999 బ్యాచ్ కానిస్టేబుళ్లకు తీవ్ర అన్యాయం జరిగింది. గతంలో కోర్టు తీర్పు వల్ల జిల్లాలో ఆగిపోయిన ప్రమోషన్లు ఇచ్చాక.. చేయాల్సిన ట్రాన్స్ఫర్లను , జోనల్ యూనిట్‌గా చేయడంతో సమస్య వచ్చింది. ఏమాత్రం ముందుచూపు, శాస్త్రీయత లేకుండా చేసిన ఈ ట్రాన్స్ఫర్ల వల్ల తాము ఇక కానిస్టేబుళ్లుగానే రిటైర్ కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని1999 బ్యాచ్ కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమోషన్లు వస్తాయనుకునే టైంలో..
పోలీస్‌శాఖలో కానిస్టేబుల్ జిల్లా క్యాడర్ పోస్టు కాగా, హెడ్ కానిస్టేబుల్ పోస్టులను జోనల్ క్యాడర్ కిందికి తెచ్చారు. ప్రస్తుతం జోన్ 2 ( బాసర) పరిధిలో నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలున్నాయి. నిజానికి జిల్లాల్లోని కానిస్టేబుళ్లకు గతంలో ఆగిపోయిన ప్రమోషన్లు ఇచ్చాక జోన్ పరిధిలో ట్రాన్స్ఫర్లు చేయాలి. అలాకాకుండా జోన్ యూనిట్‌గా తీసుకొని నాలుగు జిల్లాల్లోని కానిస్టేబుళ్లను సీనియారిటీ ఆధారంగా ప్రమోషన్లు ఇస్తూ ట్రాన్స్ఫర్ చేయడంతో ఉమ్మడి నిజామాబాద్‌జిల్లాకు చెందిన సీనియర్లు నష్టపోయారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 86 ఖాళీలుండగా, వీటిలో 68 హెడ్‌కానిస్టేబుల్ పోస్టులను అదిలాబాద్ , నిర్మల్, జగిత్యాల జిల్లాకు చెందిన వాళ్లతో నింపేశారు. నిజానికి 1999 బ్యాచ్‌లోని 116 మందిలో ఆరుగురికి 2018లోనే ప్రమోషన్లు వచ్చాయి. తర్వాత తమను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఏఆర్టూ సివిల్ కానిస్టేబుళ్లు కోర్టుకు వెళ్లడంతో ఆగిపోయాయి. ఎట్టకేలకు ప్రమోషన్లకు 2022లో క్లియరెన్స్ వచ్చింది. ఈక్రమంలో తమకు ప్రమోషన్లు వస్తాయని 1999 బ్యాచ్ సీనియర్లు ఆశిస్తున్న టైంలో 317 జీఓ రూపంలో మరో పిడుగు వచ్చి పడింది.
ఎవరికీ ప్రయోజనం లేకుండా..
తాజా ప్రమోషన్ల వల్ల నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ కానిస్టేబుళ్లు ఎలాగైతే నష్టపోయారో, ఆయా జిల్లాల నుంచి నిజామాబాద్ వచ్చిన 68 మంది కానిస్టేబుళ్లూ అలాగే నష్టపోయారు. ఆదిలాబాద్ , నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో రిటైర్మెంట్కు దగ్గరైన వాళ్లను ప్రమోషన్‌పై నిజామాబాద్ పంపడం వల్ల వారికి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. సొంత జిల్లాల్లో రిటైరయ్యే వాళ్లను నిజామాబాద్ జిల్లాకు తేవడంతో భార్యాపిల్లలు, ఇండ్లు ఓ చోట, వాళ్లో చోట తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో ఇటీవల1999 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుళ్లు అడిషనల్ డీజీపీ పర్సనల్ శివధర్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఐదేండ్లుగా తాము హెడ్‌కానిస్టేబుల్ అయినట్లే అని చెప్పుకుంటూ తిరిగామని, తీరా తలెత్తుకొని తిరగలేని పరిస్థితి వచ్చిందని, మానసికంగా కుంగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి శాస్త్రీయత లేకుండా నిర్వహించిన ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లను రద్దుచేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 200 నుంచి 300 వరకు ఉన్న 1999 బ్యాచ్ సీనియర్ కానిస్టేబుళ్లందరికీ ఒకే నోషనల్ ప్రమోషన్ ఇవ్వడం ద్వారా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.