ఇండియన్ పాలిటీ.. భారత రాజ్యాంగ కమిటీలు

భారత రాజ్యాంగ రచనా క్రమంలో ఎన్నో కమిటీలను ఏర్పాటు చేశారు. వీటిని మేజర్​, మైనార్టీ కమిటీలుగా విడదీశారు. ఈ కమిటీలకు పలువురు ప్రముఖులు సారథ్యం వహించి రాజ్యాంగ రచనా క్రమాన్ని పూర్తి చేయడానికి దోహదపడ్డారు.

ముఖ్యంగా బి.ఆర్.అంబేద్కర్​ సారథ్యంలో ఏర్పాటైన ముసాయిదా కమిటీ అత్యంత కీలకంగా వ్యవహరించింది. సర్ధార్​ వల్లభాయ్​ పటేల్​ నేతృత్వంలో ఏర్పాటైన ప్రాథమిక హక్కులు, మైనార్టీలు, గిరిజనుల సలహా కమిటీ చెప్పుకోదగింది. పోటీ పరీక్షల దృష్ట్యా ఈ కీలకమైన కమిటీల గురించి తెలుసుకుందాం.

రాజ్యాంగ సభకు 1946, జులై, ఆగస్టు మధ్యకాలంలో బ్రిటీష్​ ఇండియాకు కేటాయించిన 296 సీట్లకు ఎన్నికలు జరిగాయి. అయితే, దేశ విభజనతో రాజ్యాంగ పరిషత్​లో సభ్యుల సంఖ్య 229కు తగ్గిపోయింది. 299 మంది సభ్యుల్లో బ్రిటీష్​ ఇండియా నుంచి ఎన్నికైన వారు 229 మంది ఉండగా, స్వదేశీ సంస్థానాల నుంచి 70 మంది ఉన్నారు. 

ముఖ్యమైన వ్యక్తులు 

అంబేద్కర్: తూర్పుబెంగాల్​లోని జెసోర్​ ఖుల్నా నియోజకవర్గం నుంచి నామినేట్​ అయిన జోగేంద్రనాథ్​ మండల్​ తన స్థానాన్ని అంబేద్కర్​ కోసం వదులకోగా అక్కడి నుంచి షెడ్యూల్డ్​ క్యాస్ట్​ ఫెడరేషన్​ తరఫున ఎన్నికయ్యారు. 1947లో దేశం విడిపోయిన తర్వాత జెసోర్​ ఖుల్నా  స్థానం పాకిస్థాన్​లోకి వెళ్లడంతో అంబేద్కర్​ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎం.ఆర్​.జయకర్​ రాజీనామాతో ఖాళీ అయిన స్థానం (బాంబే రాష్ట్రం) నుంచి కాంగ్రెస్​ టికెట్​పై బి.ఆర్​.అంబేద్కర్​ రాజ్యాంగ పరిషత్​కు ఎన్నికయ్యారు. 

సభ్యత్వం లేని వ్యక్తులు :  రాజ్యాంగ పరిషత్​లో ప్రముఖ జాతీయోద్యమ నాయకులైన మహాత్మా గాంధీ, మహమ్మద్ అలీ జిన్నాలకు సభ్యత్వం లేదు. 

నామినేట్​ అయిన ముఖ్యులు :  రాజ్యాంగ పరిషత్​ ఎన్నికల్లో పోటీ చేయకుండా అసాధారణ వ్యక్తులుగా రాజ్యాంగ పరిషత్​లో 15 మంది నామినేట్​ అయ్యారు. వారిలో ముఖ్యులు సర్వేపల్లి రాధాకృష్ణన్​, గోపాలస్వామి అయ్యంగార్​, కె.టి.షా.

సోమ్​నాథ్​​ లాహిరి :  దేశ విభజన కారణంగా రాజ్యాంగ పరిషత్ లో సభ్యత్వాన్ని కోల్పోయిన ఒకే ఒక కమ్యూనిస్టు సభ్యుడు. 
శ్యామప్రసాద్ ముఖర్జీ: రాజ్యాంగ పరిషత్​ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయి, ఆ తర్వాత నామినేట్​ అయిన వ్యక్తి. 

మహిళలు :  రాజ్యాంగ పరిషత్​లోని 389 మంది సభ్యుల్లో కేవలం 15 మంది మహిళా సభ్యులు ఉండేవారు. వీరిలో దుర్గాభాయ్​ దేశ్​ముఖ్​, సరోజిని నాయుడు, అమ్ము స్వామినాథన్​, దాక్షాయణి వేలాయుధన్​, బేగం ఎయిజాబ్​ రసూల్​, హంసా మెహతా, కమలా చౌదరి, లీలారాయ్​, మాలతి చౌదరి, పూర్ణిమా బెనర్జీ, రాజ్​కుమారి అమృత్​కౌర్, రేణుకారే, సుచేత కృపలాని, విజయలక్ష్మీ పండిట్​, అనీ ముస్కరీన్​. 

తొలి సమావేశం :  రాజ్యాంగ పరిషత్​ మొదటి సమావేశం 1946, డిసెంబర్​ 9న ఢిల్లీలోని పార్లమెంట్​ సెంట్రల్​ హాల్​లో జరిగింది. ఈ మొదటి సమావేశానికి 211 మంది సభ్యులు హాజరయ్యారు. ఇందులో 9 మంది మహిళలు ఉన్నారు. అయితే, వీరిలో 207 మంది సభ్యులు మాత్రమే రిజిస్టర్​లో సంతకాలు చేశారు. ఈ సమావేశానికి ముస్లింలీగ్​, స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు హాజరుకాలేదు.

ఇదే రోజున ఫ్రెంచ్​ సంప్రదాయం ప్రకారం జె.బి.కృపలాని ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకొని అందరి కంటే వయసులో పెద్దవాడైన సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా, ఫ్రాంక్​ అంథోనిని ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 11న రాజేంద్రప్రసాద్​ను రాజ్యాంగ పరిషత్​ శాశ్వత అధ్యక్షుడిగా జె.బి.కృపలాని ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే పట్టాభి సీతారామయ్య రాజ్యాంగ పరిషత్​ ఉపాధ్యక్షునిగా హెచ్​.సి.ముఖర్జీని ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరో ఉపాధ్యక్షునిగా వి.టి.కృష్ణమాచారిని ఎన్నుకున్నారు. 

కమిటీలు :  రాజ్యాంగ పరిషత్​లో వివిధ అంశాల పరిశీలనకు అనేక కమిటీలు వేశారు. ఈ కమిటీలను మేజర్, మైనర్​ కమిటీలుగా విభిజించవచ్చు. 

మేజర్​ కమిటీలు: 

కేంద్ర రాజ్యాంగ కమిటీ: జహవర్​లాల్​ నెహ్రూ
కేంద్ర అధికారాల కమిటీ: జవహర్​లాల్​ నెహ్రూ
రాష్ట్రాలతో సంప్రదింపుల కమిటీ: జవహర్​లాల్​ నెహ్రూ
రూల్స్​ ఆఫ్​ ప్రొసీజర్​ కమిటీ: రాజేంద్రప్రసాద్​ 
సారథ్య కమిటీ: రాజేంద్రప్రసాద్​ 
రాష్ట్రాల రాజ్యాంగాల కమిటీ :  సర్ధార్​ వల్లభాయి పటేల్​ 
ప్రాథమిక హక్కులు, మైనారిటీ, గిరిజనులపై సలహా కమిటీ: సర్ధార్​ వల్లభాయ్​ పటేల్​. ఈ కమిటీలో అంతర్భాగంగా ఐదు ఉప కమిటీలను వేశారు. 
ఎ. ప్రాథమిక హక్కుల కమిటీ: జె.బి.కృపలాని
బి. మైనార్టీల సబ్​ కమిటీ: హెచ్​.సి.ముఖర్జీ
సి.ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు గిరిజన ప్రాంతాలపై అస్సాంలో వేరు చేసిన ప్రాంతాలపై కమిటీ: గోపీనాథ్​ బాల్డోలాయ్​ 
డి. అస్సాం మినహా ఇతర వేరు చేసిన ప్రాంతాలపై సబ్​ కమిటీ: ఎ.వి.ధక్కర్​
ఇ. నార్త్​ వెస్ట్​ ఫ్రాంటియర్​ ట్రైబల్​ ఏరియాస్​ సబ్​ కమిటీ

ముసాయిదా కమిటీ :  ఈ కమిటీని ఒక చైర్మన్​, ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేశారు. 
చైర్మన్​: బి.ఆర్​.అంబేద్కర్​
సభ్యులు :  గోపాలస్వామి అయ్యంగార్​, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్​, కె.ఎం.మున్షీ, సయ్యద్​ మహ్మద్​ సాదుల్లా, ఎన్​. మాధవరావు (బి.ఎల్​.మిట్టర్​ అనారోగ్యంతో రాజీనామా చేయడంతో), టి.టి.కృష్ణమాచారి(డి.పి.ఖైతాన్​ మరణించడం వల్ల ఆయన స్థానంలో) .

ఈ ముసాయిదా కమిటీ రెండు డ్రాఫ్టులను తయారు చేసింది. ఎనిమిది షెడ్యూల్స్​, 315 అధికరణలు గల మొదటి డ్రాఫ్టును 1948, ఫిబ్రవరి 21 ప్రచురించింది. మొదటి డ్రాఫ్టుకు చేసిన సవరణల అనంతరం రెండో డ్రాఫ్టును 1948, అక్టోబర్ లో ప్రచురించింది. 

మైనర్​, ఇతర కమిటీలు 

    హౌస్​ కమిటీ: పట్టాభి సీతారామయ్య
    చీఫ్​ కమిషనర్ల ప్రావిన్సుల కమిటీ: పట్టాభి సీతారామయ్య
    రాజ్యాంగ ముసాయిదా ప్రత్యేక కమిటీ: అల్లాడి కృష్ణస్వామి అయ్యర్​ 
    క్రిడెన్షియల్​ కమిటీ: అల్లాడి కృష్ణస్వామి అయ్యర్​
    ఫైనాన్స్​ అండ్​ స్టాఫ్​ కమిటీ: రాజేంద్రప్రసాద్​
    జాతీయ పతాక తాత్కాలిక కమిటీ: రాజేంద్ర ప్రసాద్​
    రాజ్యాంగ పరిషత్​ విధుల కమిటీ: జీ.వి. మౌలాంకర్​
    సభా వ్యవహారాల కమిటీ: కె.ఎం.మున్షి
    భాషా కమిటీ: మోటూరి సత్యనారాయణ
    సుప్రీంకోర్టుపై తాత్కాలిక కమిటీ: ఎస్​.వరదాచారియర్​
    భాషా ప్రావిన్సులపై కమిషన్​: ఎస్​కే ధర్​
    ఆర్థిక అంశాలపై ఎక్స్​పర్ట్​ కమిటీ: నళిని రంజన్​ సర్కార్​
    చీఫ్​ కమిషనర్​ ప్రావిన్సుల కమిటీ: పట్టాభి సీతారామయ్య
    రాజ్యాంగ ముసాయిదా పరీక్ష ప్రత్యేక కమిటీ: జవహర్​లాల్​ నెహ్రూ
    ప్రెస్​ గ్యాలరీ కమిటీ: ఉషానాథ్​ సేన్​
    పౌరసత్వంపై తాత్కాలిక కమిటీ: ఎస్​.వరదచారియర్

రాజ్యాంగ రచనకు అనుసరించిన పద్ధతి: రాజ్యాంగ రచనా క్రమంలో భాగంగా రాజ్యాంగ పరిషత్తు ఏ అంశాన్ని ఓటింగ్​ ద్వారా ఆమోదించలేదు. ప్రతి సమస్యలను, ప్రతిపాదనను సర్దుబాటు ఏకాభిప్రాయ సాధన లేదా సమన్వయం ద్వారా పరిష్కరించిందని గ్రాన్​విల్ ఆస్టిన్​ పేర్కొన్నాడు. ముఖ్యంగా సమ్మతి, సమన్వయ పద్ధతుల  ద్వారా రాజ్యాంగ రచన చేశారు. 

సమ్మతి పద్ధతి: ఒక సమస్య వచ్చినప్పుడు చర్చల ద్వారా ఇంచుమించు అందరు సభ్యులు అంగీకరించేలా చేసే పద్ధతిని సమ్మతి పద్ధతి అంటారు. 

సమన్వయ పద్ధతి  :  ఏదైనా సమస్యపై మధ్యే మార్గాన్ని అనుసరించడం. 

రాజ్యాంగం ఆమోదం : 1948, నవంబర్​ 4న బి.ఆర్​.అంబేద్కర్​ రాజ్యాంగ నిర్మాణ సభలో చివరి ముసాయిదా ప్రవేశ పెట్టారు. మొదటి రీడింగ్​పైన నంబర్​ 9 వరకు సాధారణ చర్చించింది. రెండో రీడింగ్​ 1948, నవంబర్​ 15న ప్రారంభమై, అక్టోబర్​ 17న ముగిసింది. ఇందులో భాగంగా మొత్తం 7635 సవరణ ప్రతిపాదించగా, 2473 ప్రతిపాదనలు చర్చించబడ్డాయి.

ముసాయిదా మూడో రీడింగ్​ 1949, నవంబర్​ 14న ప్రారంభం కాగా, ఆ సందర్భంలోనే అంబేద్కర్​ తీర్మానాన్ని  ప్రవేశపెట్టాడు. ఈ ముసాయిదా తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్​ 1949, నవంబర్ 26న ఆమోదించారు. మొత్తం 299 సభ్యులు గల పరిషత్​లో ఆ రోజు 284 మంది హాజరై సంతకాలు చేశారు. భారత దేశ ప్రజలు రాజ్యాంగాన్ని అంగీకరించి దానిని తమకు  తాము సమర్పించుకున్న తేదీ ఇదేనని రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్నారు.

రాజ్యాంగ రచనలో వ్యక్తుల పాత్ర

ప్రేమ్​ బిహారి నారాయణ్​ రైజాద: మౌలిక రాజ్యాంగాన్ని ఇటాలిక్​ స్టైల్​లో రాశారు. కాలిగ్రాఫర్​గా పనిచేశారు. బియోహార్​ రామ్​ మనోహర్​ సిన్హా: ప్రేమ్​ బిహారి కాలిగ్రఫీ చేసిన వాస్తవిక ప్రవేశికకు అలంకరణలు, నగిషీ, మెరుగులు దిద్దారు. 

నందలాల్​ బోస్​: వాస్తవిక లేదా మౌలిక రాజ్యాంగానికి బియోహర్​ రామ్​ మనోహర్​ సిన్హాతో కలసి అలంకరణలు, నగిషీ, మెరుగులు దిద్దాడు. ఇతను హిందీ రాజ్యాంగ వర్షన్ ను కూడా మెరుగులు దిద్దాడు. 

వసంత్​ కృష్ణన్​ వైద్య: వాస్తవిక రాజ్యాంగం హిందీ వర్షన్​కు కాలిగ్రఫీ రాశారు. 
 

దీనానాత్​ భార్గవ: ఈయన అంతర్జాతీయ చిత్రకారుడు, శాంతినికేతన్​లో నందలాల్​ బోస్​కు శిష్యుడు. ఇతను మౌలిక రాజ్యాంగ ప్రతిలో జాతీయ చిహ్నాన్ని చిత్రించాడు.

కాంగ్రెస్​    208
ముస్లింలీగ్​    73
స్వతంత్ర అభ్యర్థులు    8
షెడ్యూల్డ్​ క్యాస్ట్ ఫెడరేషన్    1
యూనియనిస్టు షెడ్యూల్డ్​ క్యాస్ట్​    1
యూనియనిస్టు ముస్లిం    1
యూనియనిస్టు పార్టీ    1
కృషిక్​ ప్రజా పార్టీ    1
సిక్కు (నాన్​ కాంగ్రెస్​)    1
కమ్యూనిస్టులు    1