రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి

రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి

భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నతమైన సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం. ‘రాజ్యాంగం ఎంత గొప్పదైనా, ఉత్తమమైనదైనా దానిని అమలుచేసే పాలకులు ఉత్తములు కాకపోతే రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరవు’ అని అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డా.బీ.ఆర్.అంబేద్కర్. 

రాజ్యాంగ పీఠికలో పొందుపర్చిన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం దేశ ప్రజలందరికీ కుల, మత, లింగ వివక్ష లేకుండా అమలు జరిగితేనే అన్ని వర్గాల ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమన్యాయం దక్కుతుందని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా భారత రాజ్యాంగాన్ని అవలోకనం చేసుకోవాలి.

భారత రాష్ట్రపతి అధికారాలు నామమాత్రంగా, ప్రభుత్వ అధినేత ప్రధానమంత్రి అధికారాలు అత్యుత్తమమైనవిగా రాజ్యాంగ నిపుణులు ప్రతిపాదించారు. దేశ ప్రజల ఆశయాలు, ఆలోచనలు, ఆకాంక్షలు, దేశ ఐక్యతకు భంగం కలగకుండా సమైక్య వ్యవస్థను రూపొందించారు. 

దేశంలోని ప్రతి పౌరునికీ రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులే మన దేశ పార్లమెంటరీ విధానాన్ని, ప్రజాస్వామ్య సౌధాన్ని కాపాడుతున్నాయి. అధికారమే ధ్యేయంగా సాగుతున్న ప్రస్తుత రాజకీయాల కారణంగా రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటుంది. 

దేశం అన్నిరంగాల్లో ఎంతగానో అభివృద్ధి చెందుతున్నదని ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ, గణతంత్ర దినోత్సవ వేళ  కొన్ని కఠిన వాస్తవాలను  చర్చించుకోవాలి. 

దిగజారుతున్న రాజ్యాంగ విలువలు 

పార్లమెంటరీ విధులను సమర్థవంతంగా నిర్వహించడంలో, రాజ్యాంగ విలువలు, పార్లమెంటరీ వ్యవస్థ పరిరక్షణలో పాలకులు వైఫల్యం చెందుతున్నారు.  రాజకీయ పార్టీల జెండా, అజెండాలకు పాలకులు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. 

ఎన్నికల్లో ఓట్ల కోసం కుల, మత, ధన ప్రభావాలను రాజకీయ  నాయకులు పెంచి పోషిస్తున్నారు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్య, నైతిక విలువల కంటే రాజకీయ పార్టీల సిద్ధాంతాలు, పార్టీ అధినేతల మనోభావాలకే నాయకులు పెద్దపీట వేస్తున్నారు. 

పేదరికం పోలేదని పాలకులే అంటున్నారు

దేశ ప్రధాని మోదీ ఇటీవల దేశంలో దాదాపు 82 కోట్ల మంది పేదలకు రేషన్ కార్డుల ద్వారా నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ప్రధాని వ్యాఖ్యలను బట్టి దేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉందో అంచనా వేయవచ్చు. ఒకవైపు దేశంలో కోట్లాదిమంది పేదలు నేటికీ ప్రాథమిక అవసరాలైన కూడు, గూడు, గుడ్డ పొందలేకపోతున్నారు. ఉచిత విద్య, వైద్యం అందక ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడుతూ బతుకుతున్నారు. 

రాజకీయ చట్రంలో రాజ్యాంగబద్ధ సంస్థలు

రాజ్యాంగం శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలకు విడివిడిగా అధికారాలు ఇచ్చింది. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలంటే స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలు జరగడం తప్పనిసరి. ఒకప్పుడు ప్రభుత్వ ఒత్తిడికి లొంగకుండా న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించేవి. వీటి పనితీరు ప్రపంచ దేశాల ప్రశంసలు పొందాయి. 

కానీ, ఇప్పుడు ఆ సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాజ్యాంగబద్ద సంస్థలపై  కేంద్ర ప్రభుత్వం జోక్యం మితిమీరుతోందని విమర్శలు తలెత్తు తున్నాయి. 

దేశంలో అగ్రశ్రేణి దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ తన విశ్వసనీయతను కోల్పోయే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ హెచ్చరించారంటే దేశంలో పరిస్థితి ఏస్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. 

వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయా?

రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగే అన్నింటినీ చట్టబద్ధంగా ప్రశ్నిస్తూ శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన న్యాయ వ్యవస్థ మౌనం వహించడం రాజ్యాంగ స్ఫూర్తికి అత్యంత ప్రమాదకరం. 

న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించాలే తప్ప, పాలకులకు విధేయులుగా ఉండరాదు. 1975లో విధించిన ఎమర్జెన్సీ సమయంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీకి న్యాయ వ్యవస్థ పూర్తిగా విధేయత చూపడంవల్లే, ప్రజల హక్కులకు భంగం వాటిల్లింది. 

అందుకే రాజ్యాంగబద్ద సంస్థలు కేంద్ర ప్రభుత్వం జోక్యం లేకుండా స్వతంత్రంగా తమ విధులు, బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. 

జమిలి ఎన్నికల ఆమోదనీయత ఎంత?

ఒకే దేశం,- ఒకే ఎన్నికల పేరుతో 2029 నాటికి జమిలి ఎన్నికలు నిర్వహించాలని మోదీ ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ అధ్యక్షతన నియమించిన కమిటీ ఇటీవల 18,636 పేజీల నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. 

ఈ కమిటీ రాజ్యాంగంలోని కీలకమైన ఐదు ఆర్టికల్స్ 82 (ఎ), 83, 172, 324 (ఎ), 325 లను సవరించి, జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చని కమిటీ నివేదించింది. దేశవ్యాప్తంగా 47 రాజకీయ పార్టీలలో 32 పార్టీలు జమిలి ఎన్నికలకు అనుకూలంగా ఉన్నాయని  సిఫార్సు చేసింది. 

జమిలి ఎన్నికల ప్రతిపాదన లోక్​సభ ఎన్నికలు, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయడం ద్వారా  పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిథ్యం తగ్గవచ్చు. ప్రస్తుతం లోక్​సభలో 23.74 శాతం సీట్లకు దక్షిణాది రాష్ట్రాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జనాభా తక్కువగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో లోక్​సభ స్థానాలు 18.97 శాతానికి తగ్గే ప్రమాదం ఉంది.

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో వరుసగా మూడుసార్లు అధికారం చేపట్టడంతో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని దేశవ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామికవాదులు ఆందోళన చెందుతున్నారు. 

కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు యత్నిస్తోందని పార్లమెంట్ వేదికగా లోక్​సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతులను చేతిలో పట్టుకుని, రాజ్యాంగాన్ని కాపాడాలంటూ నినాదాలు చేయడం మనం చూశాం.

కాంగ్రెస్ హయాంలో ఇందిరాగాంధీ  విధించిన ఎమర్జెన్సీతో  ప్రాథమిక హక్కులు, స్వేచ్చ కాలరాస్తే ప్రధాని మోదీ ఎమర్జెన్సీ విధించకుండానే వందలసార్లు ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ప్రతిపక్ష నేతలు, విపక్ష రాష్ట్రాల సీఎంలు ఆందోళన చెందుతున్నారు. 

దేశంలో అసమానతలు, అంటరానితనం, ఆకలి చావులు, అన్యాయం, అక్రమాలకు అడ్డుకట్ట వేసిన నాడే రాజ్యాంగ స్ఫూర్తి  పరిఢవిల్లుతుంది. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారం చేపట్టినా   ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలి. 

ఫెడరల్ వ్యవస్థపై కొనసాగుతున్న దాడి

భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశంలో ఫెడరల్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తేనే జాతీయ సమైక్యత కొనసాగుతుంది. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఫెడరల్ వ్యవస్థపై దాడులకు పాల్పడుతోంది. 

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించటం, విపక్ష పాలిత రాష్ట్రాల్లో తమకు నచ్చని పార్టీలు అధికారంలో ఉన్నచోట ఆ పార్టీలను చీల్చడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయత్నించడం, అలాంటి రాష్ట్ర ప్రభుత్వాలపై గవర్నర్లను వినియోగించడం, ఫెడరల్ వ్యవస్థపై దాడులుగానే భావించాలి. 

రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్లు కేంద్ర, రాష్ట్రాల మధ్య సంధానకర్తలుగా వ్యవహరిస్తారని రాజ్యాంగ రూపకర్తలు భావించారు. కానీ, ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం  మంచిది కాదు.

- డా.చెట్టుపల్లి మల్లికార్జున్, పొలిటికల్ ఎనలిస్ట్