
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు లేదా ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయవచ్చు. ప్రధాన న్యాయమూర్తి మాత్రం కచ్చితంగా రాష్ట్రపతి సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికే ఇవ్వాలి.
తొలగింపు విధానం
అసమర్థత, దుష్ప్రవర్తన అనే కారణాలపై న్యాయమూర్తులను రాష్ట్రపతి పదవి నుంచి తొలగించవచ్చు. రాష్ట్రపతిని తొలగించిన పద్ధతిలోనే అంటే పార్లమెంట్ 2/3వ వంతు మెజార్టీతో తీర్మానం ఆమోదంతో పదవి నుంచి తొలగిస్తారు. న్యాయమూర్తులను పదవి నుంచి తొలగించే అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్ లోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు.
న్యాయమూర్తులను పదవి నుంచి తొలగించే అభిశంసన తీర్మాన నోటీస్ పై లోక్సభలో అయితే 100 మంది సభ్యులు, రాజ్యసభలో అయితే 50 మంది సభ్యులు సంతకాలు చేయాలి. తీర్మానం ప్రవేశపెట్టే సభాపతికి 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సభాపతికి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తుంది.
కమిటీలోని సభ్యులు
1. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా వారితో నియమించిన ఇతర సీనియర్ న్యాయమూర్తి.
2. ఏదైనా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
3. రాష్ట్రపతి నియమించిన న్యాయకోవిదులు.
కమిటీ విచారణ అనంతరం ఇచ్చే రిపోర్టుపై ఆ సభ చర్చించి 2/3వ వంతు మెజార్టీతో ఆ తీర్మానాన్ని ఆమోదించాలి. ఒక సభ ఆమోదించిన తీర్మానాన్ని రెండో సభ కూడా 2/3వ వంతు మెజార్టీతో ఆమోదిస్తే రాష్ట్రపతి వారిని తొలగిస్తారు. విచారణ కమిటీ ఒకవేళ న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని నివేదిక ఇస్తే ఆ తీర్మానంపై ఎలాంటి చర్చ చేయడానికి అవకాశం లేదు. అంటే ముందుకెళ్లడానికి అవకాశం లేదు.
తీర్మానం ప్రవేశపెట్టిన సభ తిరస్కరిస్తే రెండో సభకు పంపాల్సిన అవసరం లేదు. ఒకసభ ఆమోదించి పంపిన తీర్మానాన్ని రెండో సభ కూడా తప్పనిసరిగా ఆమోదించాలి. ఒకవేళ రెండో సభ తీర్మానాన్ని ఆమోదించకపోతే తీర్మానం వీగిపోయినట్లుగానే భావిస్తారు. అంటే రెండు సభల మధ్యన భిన్నాభిప్రాయాలు తలెత్తినప్పుడు ఉభయసభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. భారత్లో ఇప్పటి వరకూ ఏ న్యాయమూర్తిపైనా అభిశంసన తీర్మానం ఆమోదించలేదు.
తొలగింపు ప్రక్రియ
భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు గురించి మాత్రమే పేర్కొన్నారు. తొలగింపు ప్రక్రియలో ఇమిడి ఉన్న అంశాలను వివరించలేదు. 1968 జడ్జెస్ ఎంక్వెయిరీ యాక్ట్ లో న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియ గురించి వివరణాత్మకంగా పేర్కొన్నారు. పార్లమెంట్సభ్యులు ఆయా సభల్లో అభిశంసన తీర్మాన నోటీసును సభాపతులకు అందజేసినప్పుడు సభాపతులు దానిని తిరస్కరించవచ్చు. న్యాయమూర్తులను తొలగించే ఈ పద్ధతిని అమెరికా నుంచి గ్రహించాము.
హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు
218 అధికరణ ప్రకారం సుప్రీంకోర్టుకు వర్తించే అంశాలు కొన్ని హైకోర్టులకు కూడా వర్తిస్తాయి. హైకోర్టు న్యాయమూర్తులను తొలగించడంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే పద్ధతినే అనుసరిస్తారు. అసమర్థత, దుష్ప్రవర్తన పార్లమెంట్లోని ఉభయసభలు వేర్వేరుగా 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో ఆమోదించిన సందర్భంలో రాష్ట్రపతి వీరిని తొలగిస్తారు.
భారత్లో ఇప్పటి వరకూ ఏ న్యాయమూర్తిపైనా అభిశంసన తీర్మానం ఆమోదించలేదు. 1991లో తమిళనాడుకు చెందిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ వి.రామస్వామిపై ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఓటింగ్లో పాల్గొనకపోవడం వల్ల 1993లో తగిన మెజార్టీ లేకపోవడం వల్ల ఈ తీర్మానం వీగిపోయింది.
కానీ తర్వాత రామస్వామి తన పదవికి రాజీనామా చేశారు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా రాజ్యసభలో అభిశంసన తీర్మానం కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్రా సేన్ పై ఆమోదించారు. ఈ తీర్మానం లోక్సభలో ప్రవేశపెట్టక ముందే సేన్ తన పదవికి రాజీనామా చేశారు.