కుల నిర్మూలనకు రాజ్యాంగ సవరణే మార్గం

ఎడ్మండ్ బర్క్ అనే ఐరిష్ తత్వవేత్త ‘‘నిజమైన మతమే సమాజానికి, మానవీయ ప్రభుత్వానికి పునాది’’ అని పేర్కొన్నారు. ఉదాహరణకు చైనాలో కమ్యూనిజం విజయం సాధించడానికి బుద్ధిస్ట్, సోషలిస్టు సిద్ధాంతాలని చెప్పవచ్చు. హిందూ దేశంగా ప్రసిద్ధిగాంచిన భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏండ్లు గడిచిపోయాయి. అయినప్పటికీ కుల అసమానతలు తొలగిపోకుండా సామాజిక సంబంధాల్లో మార్పు లేకుండా ఉండటంలో హిందూ ఆధ్యాత్మిక వ్యవస్థ ప్రభావం ఎంతగానో ఉంది. ఎందుకంటే కులాలు జన్మించినవే హిందూ ధర్మ శాస్త్రాల నుంచి కాబట్టి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పౌరులకు రాజ్యాంగబద్ధంగా సమస్త హక్కులను కల్పించి కుల నిర్మూలన, సమ సమాజ స్థాపన కోసం కృషి చేశారు.

మతాల నిర్వచనం మార్చిన కులం

ఋగ్వేదాన్ని పది మండలాలుగా విభజించి 1028 శ్లోకాలుగా పొందుపరిచారు. పదో మండలంలోని 90వ సూక్తం16 మంత్రాల్లోని 12వ మంత్రంలో చతుర్వర్ణ విభజన ద్వారా సుమారు ఆరు వేలకు పైగా కులాలు ఏర్పడ్డాయి. హిందూధర్మశాస్త్రాలు రెండు రకాలు ఒకటి శృతులు, రెండు స్మృతులు. అందులో వేదాలు శృతుల కిందకు వస్తాయి. మహాభారతం, రామాయణం, మనుస్మృతి వంటివి స్మృతుల కిందకు వస్తాయి. వర్ణ వ్యవస్థ అనే విభజనవాదాన్ని మనువు అనే చట్టం ద్వారా వేల సంవత్సరాల నుంచి సంస్థాగతంగా బలపడింది. విభజన వాదంతో సమాజమంతా కులాలుగా విడిపోయింది. 8వ శతాబ్దంలోముస్లిం సామ్రాజ్యవాదుల ద్వారా భారతదేశంలోకి ఇస్లాం ప్రవేశించింది. హిందువులు బలవంతంగా కొందరు, కుల సంకెళ్ల విముక్తి కోసం కొందరు ఇస్లాం మతాన్ని స్వీకరించారు. మధ్యయుగ కాలంలో అల్ బెరూని అనే మహమ్మదీయ పండితుడు మతంతో కాకుండా కులాలతో పరిగణిస్తున్న వారందరినీ హిందువులుగా నామకరణం చేశాడు. బ్రిటీష్ వారితో క్రైస్తవ మతం దేశంలోకి ప్రవేశించింది. దీంతో హిందువులు కుల సంకెళ్ళ విముక్తి కోసం కొందరు, క్రైస్తవ మిషనరీల సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై మరికొందరు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. కానీ, మతాలు మారినంత మాత్రాన వారిని కుల వివక్షత వీడలేదు. దేవుడు అందరినీ సమానంగా సృష్టించాడని ఇస్లాం, క్రైస్తవ మత గ్రంథాలు చెబుతున్నప్పటికీ మన దేశంలోని కుల వ్యవస్థ ఈ మతాల నిర్వచనాన్ని మార్చి కుల పెత్తనం వర్ధిల్లేలా చేస్తోంది.

ఇతర దేశాల్లో..

ప్రపంచంలోని పాశ్చాత్య దేశాల్లో క్రైస్తవుల జనాభా ఎక్కువ, అమెరికా, దక్షిణ ఆఫ్రికా దేశాలు రెండు కూడా క్రైస్తవ దేశాలే. అక్కడి సమస్య తెలుపు, నలుపు వారి మధ్య జాతి వివక్షత. దక్షిణాఫ్రికాలో 1948లో అక్కడి నేషనల్ పార్టీ వారు జాతి వివక్షతను చట్టబద్ధమైనదిగా మార్చారు. అయితే ఆ సమయంలో ప్రభుత్వం అమలు చేసిన విధానానికి మద్దతు పలుకుతూ కొంతమంది క్రైస్తవులు బైబిల్ ను ఉపయోగించి దుర్వినియోగించారు. దేవుడు అందరినీ సమానంగా సృష్టించాడు అని బైబిలు చెప్పినప్పటికీ కొందరు శ్వేత జాతి మత పెద్దలు వారి ఆధిపత్యాన్ని కొనసాగించుకోడానికి పాత నిబంధనల బైబిల్లోని అంశాన్ని వాడుకున్నారు. అమెరికాలో 1865లో 13వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతి ఆధారిత బానిసత్వాన్ని తొలగించి అందరూ సమానులే అని నిర్ధారించి తదనంతరం అనేక సవరణల ద్వారా సమ సమాజాన్ని స్థాపించారు. ఆయా దేశాల్లో నల్ల జాతి వారిపై ఇప్పటికీ దాడులు జరిగితే తెలుపు, నలుపు జాతుల వారు కలిసి న్యాయం పోరాటం చేస్తున్నారు. కానీ మనదేశంలో దళిత బహుజనులపై దాడులు జరుగుతున్నప్పటికీ అన్ని కులాలవారు కలిసి న్యాయం కోసం పోరాటం చేయడంలేదు. కుల వ్యవస్థ అందుకు అడ్డుపడుతోంది. 

రాజ్యాంగ మార్పుతోనే..

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏండ్లు గడిచినా, కులాంతర వివాహం చేసుకున్న దంపతులను హత్య చేస్తున్నారు. ఇలాంటి హత్యలు దేశంలో మానవ జాతికే కళంకం తెస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగ పీఠిక, అధికరణల మేరకు సుప్రీం కోర్టు 2011లో కె.కె భాస్కరన్ వర్సెస్  స్టేట్ ఆఫ్ తమిళనాడు, నందిని సుందర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్​గఢ్ కేసుల తీర్పుల ప్రకారం దేశంలో పౌరుల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం రావాలంటే, రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్17ఏ ను చేర్చి కుల వ్యవస్థను నిషేధించాలి. దాంతో పాటుగా హిందువుల్లో కులాంతర, మతాంతర వివాహాల స్వేచ్ఛను కల్పించే చట్టం తేవాలి. కులాంతర వివాహాల పరిరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసి పక్కాగా అమలు చేయాలి. దేశాన్ని పీడిస్తున్న కుల సమస్యను నిర్మూలించాలి.

సామాజిక సంస్కరణలతో..

నూతన ఆర్థిక, విద్య, వ్యవసాయ మొదలగు సంస్కరణల వల్ల సమాజంలో పూర్తి స్థాయిలో మార్పు తేలేం. కానీ, సామాజిక సంస్కరణలు చేపడితే సమాజంలో మార్పు వస్తుంది. మన దేశ సామాజిక సమస్యలను తొలగించడానికి రెండు రకాల సామాజిక సంస్కరణలు ఉపయోగపడుతాయి. ఒకటి మతంతో సంబంధం లేని సామాజిక సంస్కరణలు, రెండు మతంతో ముడిపడిన సంస్కరణలు. మతంతో సంబంధం లేని సామాజిక సంస్కరణలు తేవడం వల్ల సమాజంలో కొంత మార్పును మాత్రమే తేగలం. అదే మతంతో ముడిపడి ఉన్న సమస్యలను తొలగించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి మత సంస్కరణలు, మత సంస్కరణలు చేయలేని సందర్భంలో మతంతో ముడిపడి ఉన్న సమస్యలను రాజ్యాంగ సవరణల ద్వారా అధిరోహించవచ్చు. ఫలితంగా సామాజిక క్రమం మార్చేందుకు కృషి చేయొచ్చు.

- కోడెపాక కుమార స్వామి
సోషల్​ ఎనలిస్ట్