మూసిలో తెచ్చిపోసిన మట్టి తొలగింపు.. హైడ్రా ఆదేశాలతో దిగొచ్చిన నిర్మాణ సంస్థలు

హైదరాబాద్​సిటీ, వెలుగు: గుట్టుచప్పుడు కాకుండా గండిపేట వద్ద మూసీ నదిలో తెచ్చిపోసిన మట్టిని అవే నిర్మాణ సంస్థలు తొలగించాయి. స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతో హైడ్రా కమిషనర్​రంగనాథ్​రెండు వారాల కింద క్షేత్రస్థాయిలో పర్యటించి మూసీ ప్రాంతాన్ని పరిశీలించారు. నార్సింగి ఏరియాలోని మూసీలో రాజపుష్ప అనే నిర్మాణ సంస్థ తెచ్చిపోసినట్లు గుర్తించారు. వెంటనే తొలగించాలని సదరు సంస్థను ఆదేశించడంతో గురువారం తొలగించింది.

ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఆఫీసర్లతో కలిసి వెంటనే హద్దులు నిర్ధారించాలని రంగనాథ్ సూచించారు. కాగా రాజపుష్ప సంస్థ మూసీలో 40 అడుగుల లోపలికి, 30 అడుగుల ఎత్తులో మట్టిని తెచ్చి పోసింది. గురువారం మట్టి తొలగింపును రంగనాథ్​పరిశీలించారు.

అలాగే నెక్నంపూర్ చెరువులో వేసిన షెడ్డులను పూజ హోమ్స్ అనే సంస్థ తొలగించింది. తెచ్చిపోసిన మట్టిని కూడా వెంటనే తొలగించాలని కమిషనర్ ఆదేశించారు. శంషాబాద్ మున్సిపాలిటీ  పరిధిలోని గొల్లవారి కుంటపై వాకబు చేశారు. 18 ఎకరాల చెరువులో లేఅవుట్​వేయడంపై సీరియస్​అయ్యారు. వెంటనే పూర్తి వివరాలు సమర్పించాలని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.