గుండెపోటు మరణాలకు చెక్ పెట్టేలా..సింగరేణి క్యాథ్ ల్యాబ్

గుండెపోటు మరణాలకు చెక్ పెట్టేలా..సింగరేణి క్యాథ్ ల్యాబ్
  • గోదావరిఖనిలో రూ. 13 కోట్లతో తొలిసారి ఏర్పాటు 
  • కార్మికులు, కుటుంబ సభ్యులకు సకాలంలో ట్రీట్ మెంట్ 
  • త్వరలోనే వైద్య సేవలు అందుబాటులోకి తేనున్న అధికారులు

గోదావరిఖని, వెలుగు :  సింగరేణి కార్మికులు, కుటుంబ సభ్యులు గుండెపోటుకు గురైనప్పుడు గోల్డెన్​అవర్​లో ప్రాణాలను కాపాడేందుకు గోదావరిఖనిలో రూ.13 కోట్లతో కార్డియాక్​ క్యాథ్​ల్యాబ్​నిర్మాణాన్ని చేపట్టింది.  కార్మికులు గనుల్లో, ఓపెన్​ కాస్ట్​ప్రాజెక్ట్​ల్లోని పని పరిస్థితుల కారణంగా ఒత్తిడికి గురై గుండెపోటు బారిన పడుతుంటారు. దీంతో మరణాలు కూడా ఎక్కువగా ఉంటుంటాయి. ఎవరైనా కార్మికుడికి హార్ట్ స్ట్రోక్ వస్తే సింగరేణి ఏరియా ఆస్పత్రుల్లో ప్రాథమిక వైద్యసేవలు అందించి హైదరాబాద్,​ కరీంనగర్, మంచిర్యాల, వరంగల్​వంటి జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులకు రెఫరల్ చేస్తుంటారు.   ఇందుకు గోదావరిఖని నుంచి నాలుగు గంటలు, కరీంనగర్​కు గంటన్నర సమయం పట్టేది. ఇలా గంటల సమయం తీసుకోవడంతో  పేషెంట్ల ప్రాణాలకు ముప్పుగా మారేది.

 సకాలంలో చికిత్స అందక చనిపోతున్న ఘటనలు ఉంటున్నాయి. దీంతో సింగరేణిలోనే తొలిసారిగా గోదావరిఖనిలోని కంపెనీ ఏరియా ఆస్పత్రిలో క్యాథ్​ల్యాబ్​ను నిర్మిస్తున్నారు. ఇందులో అవసరమైన గదులు నిర్మించగా ఫినిషింగ్​ వర్క్స్ నడుస్తోంది.  ఇక్కడ నిర్మించే క్యాథ్​ల్యాబ్​పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి జిల్లాల పరిధిలోని సుమారు 65 శాతం కార్మికులు, కుటుంబ సభ్యులకు ఎంతో ఉపయోగంగా మారనుంది. ల్యాబ్ లో ఇద్దరు కార్డియాలజిస్ట్​లు, టెక్నీషియన్లు, విలువైన మెషీన్లను త్వరలోనే అందుబాటులో తెచ్చి ప్రారంభిస్తారు. 

పీపీపీ పద్ధతిలో  వైద్య సేవలు అందించేలా.. 

క్యాథ్​ల్యాబ్​లో సింగరేణి కార్మికులు, కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు. మరోవైపు ప్రైవేటు వ్యక్తులకు కూడా  వైద్యాన్ని పబ్లిక్​ ప్రైవేటు పార్ట్ నర్ షిప్ (పీపీపీ) పద్ధతిలో  అందించేందుకు  సింగరేణి ఆలోచన చేస్తోంది. గుండెపోటుకు గురైన,  లక్షణాలు కలిగిన పేషెంట్ల వద్ద కొంత డబ్బు తీసుకుని సేవలు అందించేందుకు వీలుగా మేనేజ్​మెంట్​విధివిధానాలు ఖరారు చేసే చాన్స్ ఉంది. 

నాలుగు జిల్లాల కార్మికులకు అందుబాటులోకి.. 

గోదావరిఖనిలో నిర్మించే కార్డియాక్​ క్యాథ్​ల్యాబ్​తో సింగరేణి విస్తరించిన పెద్దపల్లి జిల్లా పరిధి గోదావరిఖని (ఆర్జీ –1 ఏరియా), యైటింక్లయిన్​కాలనీ (ఆర్జీ –2 ఏరియా), సెంటినరీ కాలనీ (ఆర్జీ –3 ఏరియా), అడ్రియాల ప్రాజెక్ట్​ఏరియా (ఏపీఏ), మంచిర్యాల జిల్లా పరిధి శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, ఆసిఫాబాద్​జిల్లా పరిధి గోలేటి, భూపాలపల్లి జిల్లా పరిధి భూపాలపల్లి ప్రాంతాల సంస్థ కార్మికులు, కుటుంబ సభ్యులకు అందుబాటులోకి రానుంది. బొగ్గు గనుల ప్రాంతాల నుంచి గంట వ్యవధిలోనే గోదావరిఖని ఆస్పత్రికి చేరుకోవచ్చు. గోల్డెన్​అవర్ లోనే పేషెంట్ల ప్రాణాలను కాపాడే వీలుంటుంది. 

కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా సేవలు

 కార్పొరేట్​ఆస్పత్రులకు దీటుగా సేవలు అందించేలా సింగరేణిలో తొలిసారిగా గోదావరిఖనిలోని ఆస్పత్రిలో కార్డియాక్​క్యాథ్​ల్యాబ్​ను నిర్మించాం. ల్యాబ్​లో అవసరమైన మెషీన్ల అమర్చే పని నడుస్తోంది. త్వరలోనే అందుబాటులోకి తెస్తాం.  సింగరేణి కార్మికులతో పాటు ప్రైవేటు వ్యక్తులకు కూడా క్యాథ్​ల్యాబ్​లో సేవలు అందించేలా ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం. 

డాక్టర్​ కిరణ్​రాజ్​ కుమార్, చీఫ్‌ మెడికల్ ​ఆఫీసర్, సింగరేణి