
- అసెంబ్లీ ఎదుట గన్‌పార్కులో, సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు
- స్తూపాల నిర్మాణాన్ని అడుగడుగునా అడ్డుకున్న అప్పటి ప్రభుత్వం
- పోరాడి సాధించుకున్న ఆనాటి మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ తొలి దశ ఉద్యమ అమరుల స్మారకార్థం అసెంబ్లీ ఎదుట గన్‌పార్కులో, సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద స్తూపాలు నిర్మించాలని అప్పటి హైదరాబాద్ నగర పాలక సంస్థ నిర్ణయించింది. 1969 నాటి ఉద్యమ అమరుల యాదిలో.. 1970 ఫిబ్రవరి 23న అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కులో తెలంగాణ అమరవీరుల స్మారకస్తూపం ఏర్పాటుకు అప్పటి నగర పాలక సంస్థ మేయర్ లక్ష్మినారాయణ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నారెడ్డి సహా పలువురు తెలంగాణవాదులు పాల్గొన్నారు. శంకుస్థాపనకు ఒకరోజు ముందు.. అమరుల పుస్తకాలు, వారు వాడిన ఇతర వస్తువులను స్తూపం నిర్మించే ప్లేసులో అడుగు భాగంలో భద్రపరిచారు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు. ఇప్పటికీ ఆ వస్తువులు స్తూపం కిందే ఉన్నాయి. 1975లో ఆ స్తూపం నిర్మాణం పూర్తయింది. 1970, ఫిబ్రవరి 25న సికింద్రాబాద్‌లోని క్లాక్ టవర్ పార్కులో అప్పటి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ మ్యాడం రామచంద్రయ్య ఆధ్వర్యంలో మరో అమరవీరుల స్మారక స్తూపానికి శంకుస్థాపన చేశారు. అయితే, ఈ స్తూపాల నిర్మాణాన్ని అడ్డుకునేందుకు అప్పటి ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ.. హైదరాబాద్ నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, ఈ ప్రాంత ఎమ్మెల్యేలు పోరాడి స్తూపాలు ఏర్పాటు చేయించారు.
స్తూపాల ప్రత్యేకలు ఇవే..
ఈ రెండు స్తూపాలను జేఎన్‌టీయూ ప్రొఫెసర్ ఎక్కా యాదగిరిరావు రూపొందించారు. అడుగుభాగంలో నల్లరాయి, నాలుగు వైపులా శిలాఫలకాలతో వాటిని ఏర్పాటు చేశారు. ప్రతివైపూ తొమ్మిది చొప్పున చిన్నచిన్న రంధ్రాలు ఏర్పాటు చేశారు. ఆ తొమ్మిది రంధ్రాలు అమరవీరుల శరీరంలోకి దూసుకుపోయిన బుల్లెట్ గుర్తులుగా, అప్పటి తొమ్మిది తెలంగాణ జిల్లాలకు సంకేతంగా చెప్తారు. ఎరుపు రంగు త్యాగానికి, సాహసానికి చిహ్నం కనుక స్తూపం మొత్తం ఎర్రరంగు రాయితో నిర్మించారు. ఒక మకరతోరణం కూడా ఏర్పాటు చేశారు. ఈ తోరణం నిర్మాణ పద్ధతిని మన దేశంలో మొదటి స్తూపమైన సాంచీ నుంచి స్వీకరించారు. స్తూపం మధ్యభాగంలో ఒక స్తంభం ఉంటుంది. ఏ వైపు నుంచి చూసినా దానిపైన తొమ్మిది గీతలు కనబడుతాయి. తొమ్మిది జిల్లాల తెలంగాణకు సంకేతంగా ఆ తొమ్మిది గీతలను మలిచారు. స్తూపం పైభాగంలో అశోకుడి ధర్మచక్రం ఉంటుంది. అది ధర్మం, శాంతి, సహనాలకే కాకుండా.. అమరవీరులు ధర్మ సంస్థాపన కోసం తమ ప్రాణాలు బలిపెట్టారన్న సంకేతాన్నీ సూచిస్తుంది. శీర్షభాగంలో తెలుపు రంగులో తొమ్మిది రేకులు కలిగిన మల్లెపువ్వు ఉంటుంది. ఆ మల్లెపువ్వు తెలుపు స్వచ్ఛతకు సంకేతం. ఉద్యమంలో ప్రాణాలు వదిలిన అమరవీరుల త్యాగం, నిజాయతీ, సాహసానికి అది ఒక సంకేతం, సందేశంగా చెప్తారు.