- మామునూరు భూములపై పీటముడి
- ఉన్నఫళంగా పాత జైలును కూల్చిన బీఆర్ఎస్ సర్కార్
- ఏడాదిలో కొత్త సెంట్రల్ జైలు కడ్తామని హామీ
- మూడున్నరేండ్లు కావస్తున్నా పనులు షురూ కాలే
- ఇవే భూములను అడుగుతున్న ఎయిర్పోర్ట్ బాధిత రైతులు
- చెట్టుకొకరు..పుట్టకొకరుగా ఖైదీలు..
వరంగల్, వెలుగు: వరంగల్‌లో కొత్త సెంట్రల్ జైలు నిర్మాణం అడుగు ముందుకుపడడం లేదు. మూడున్నరేండ్ల కింద సూపర్ స్పెషాలిటీ హస్పిటల్ కోసమంటూ అప్పటి సీఎం కేసీఆర్.. ఎంతో చరిత్ర కలిగిన వరంగల్ సెంట్రల్ జైలును కూల్చివేయించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ఏడాదిలోగా కొత్త సెంట్రల్ జైలు నిర్మాణం పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. తీరాచూస్తే.. రెండున్నరేండ్ల తర్వాత వారి ప్రభుత్వం దిగిపోయే నాటికి సైతం పనులకు కనీసం కొబ్బరికాయ కూడా కొట్టలేదు.
దీంతో ఉమ్మడి ఓరుగల్లుతో పాటు చుట్టూ ఉన్న జిల్లాల ఖైదీలు చెట్టుకొకరు పుట్టకొకరు వెళ్లారు. దీంతో కోర్ట్ కేసులు, ములాఖత్ కోసం ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు పడరాని పాట్లు పడుతున్నారు. దీనికితోడు సెంట్రల్ జైలు కోసం ముమునూర్లో కేటాయించిన భూములను ఎయిర్పోర్ట్ బాధిత రైతులు కూడా అడుగుతుండడంతో నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
రాత్రికి రాత్రే బుల్డోజర్లతో నేలమట్టం
ప్రస్తుత వరంగల్ భద్రకాళి ఆలయం, ఎంజీఎం హస్పిటల్ జంక్షన్లో 138 ఏండ్ల కింద 54.5 ఎకరాల విస్తీర్ణంలో వరంగల్ సెంట్రల్ జైల్ నిర్మించారు. 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ హయాంలో నిర్మించిన ఈ జైల్ సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి ఓపెన్ ఎయిర్ జైల్ కావడం విశేషం. 2021 మే 21న వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఎంజీఎం కోవిడ్ హస్పిటల్ పరిశీలనకు వెళ్లిన అప్పటి సీఎం కేసీఆర్ పనిలోపనిగా పక్కనే ఉన్న సెంట్రల్ జైలుకు వెళ్లారు.
లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా జైలును ఖాళీ చేసి భూములను హెల్త్ డిపార్టుమెంట్‌కు అప్పగించాలని ఆర్డర్ వేశాడు. తెల్లారి నుంచే ఖైదీలతో పాటు లారీల కొద్ది ఉండే వస్తుసామగ్రి తరలించడం మొదలుపెట్టారు. మొత్తంగా జూన్ 11న జైల్ శాఖ అధికారులు స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అప్పగించి చెట్టుకొకరు..పుట్టకొకరు అన్నట్లు ఖైదీలతో వివిధ జైళ్లకు తరలివెళ్లారు. అదేరాత్రి పెద్దపెద్ద బుల్డోజర్లను దింపిన అధికారులు 54.5 ఎకరాల్లో ఉన్న జైల్ బ్యారక్‌లు, అందులోని స్కూళ్లు, హస్పిటల్స్, స్మాల్ ఇండస్ట్రీస్.. ఇలా ఏ ఒక్కటి లేకుండా నాలుగు రోజుల్లో నేలమట్టం చేశారు.
నిర్మాణంపై నీలినీడలు..
మామూనూర్ ఎయిర్పోర్ట్ ప్రారంభించడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తక్కువలో తక్కువ 253 ఎకరాలు అడిగింది. ఈ క్రమంలో అధికారులు ప్రస్తుత ఎయిర్పోర్ట్ చుట్టూరా ఉన్న గుంటూరపల్లి, నక్కలపల్లి గ్రామ శివారులోని రైతుల భూములను అధికారులు సర్వే చేసి పెట్టారు. కాగా, రైతులు మాత్రం తాము కోల్పోతున్న భూములకు పరిహారంగా జైలుకు కేటాయించిన భూములనే అడుగుతున్నారు. దీంతో ఇప్పుడు వరంగల్ కొత్త సెంట్రల్ జైల్ నిర్మాణం సందిగ్ధంలో పడినట్లయింది. దీనిపై అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఓరుగల్లువాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పైసా కేటాయించలే..
జైల్ కూల్చివేతకు ముందు సీఎం కేసీఆర్మాట్లాడుతూ.. సెంట్రల్ జైల్ కోసం వరంగల్ సిటీకి సుమారు 7 కిలోమీటర్ల దూరంలోని మామూనూర్ 4వ పోలీస్ బెటాలియన్ ప్రాంతంలో 101 ఎకరాలు కేటాయించనున్నట్లు ప్రకటించారు. నిర్మాణం కోసం అవసరమైన రూ.254 కోట్లకు పరిపాలన అనుమతులను వెంటనే జారీ చేస్తున్నట్లు చెప్పారు. 2021 జూన్ నెలలో ఈ హామీలు ఇవ్వగా, 2023 నవంబర్‌లో జనరల్ ఎలక్షన్లు జరిగే వరకు పనులకు కొబ్బరికాయ కొట్టలేదు.
చెప్పిన రూ.254 కోట్లలో పైసా నిధులు ఇవ్వలేదు. జైల్ కూల్చే సమయంలో ఉమ్మడి వరంగల్‌తో పాటు చుట్టూరా జిల్లాలకు చెందిన వందలాది మంది ఖైదీలను శిక్షల ఆధారంగా హైదరాబాద్, ఖమ్మం తరలించారు. వీరేగాక ప్రస్తుతం వివిధ కేసుల్లో జైలుశిక్షలు పడేవారు సైతం జిల్లాలుదాటి వెళ్లాల్సి వస్తోంది. ఇది నిందితులు, వారిని చూడటానికి వెళ్లే కుటుంబ సభ్యులతో పాటు డ్యూటీలు చేయాల్సిన పోలీసులకు తలనొప్పిగా మారింది.