- తాడ్వాయి ఫారెస్ట్‌లో బ్లాక్ బెర్రీ ఐలాండ్ నిర్మాణం
- బీచ్ వాలీబాల్, షటిల్ వంటి ఆటలు, కోరుకున్న భోజనం కోసం రెస్టారెంట్
- ఫ్యామిలీతో సరదాగా గడిపేలా ఏర్పాట్లు
- త్వరలోనే ప్రారంభం కానున్న ఐలాండ్
జయశంకర్ భూపాలపల్లి/తాడ్వాయి, వెలుగు : చుట్టూ దట్టమైన అడవి, పక్కనే సెలయేరు, కనుచూపుమేరంతా ఇసుక తిన్నెలు, బీచ్ వాలీబాల్ సదుపాయం, కలర్ ఫుల్ లైట్స్, క్యాంప్ ఫైర్, కోరుకున్న భోజనం.. ఎక్కడో విదేశాల్లో కనిపించే ఇలాంటి అనుభూతిని మన రాష్ట్రంలోనూ కల్పించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. విదేశాలకు వెళ్లలేని మధ్యతరగతి ప్రజల కోసం ములుగు జిల్లాలో ‘బ్లాక్ బెర్రీ’ పేరిట ఓ ఐలాండ్‌ను తీర్చిదిద్దుతోంది. కుటుంబంతో సహా ఒక రోజంతా అడవిలో విడిది చేసే ఏర్పాట్లు చేస్తోంది. ఈ పనులు త్వరలోనే పూర్తికానున్నాయి.
తాడ్వాయి ఫారెస్ట్‌లో ఐదు ఎకరాల స్థలంలో..
రోజువారీ పని ఒత్తిడితో ఇబ్బందిపడేవారు కాస్త రిఫ్రెష్ అయ్యేందుకు కుటుంబంతో సహా ఎక్కడికైనా వెళ్లి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇందుకోసం ఆర్థికంగా ఉన్న వారైతే విదేశాలకో, పక్క రాష్ట్రాలకో వెళ్తుంటారు. కానీ మధ్యతరగతి ప్రజలు తమ సమీప ప్రాంతాల్లో పర్యటించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వారికోసమే రాష్ట్ర పర్యాటక శాఖ ములుగు జిల్లా తాడ్వాయి మండలం మొండెలతోగు దగ్గర ‘బ్లాక్ బెర్రీ ఐలాండ్’ను తీర్చిదిద్దుతోంది. టూరిస్ట్‌లకు అన్ని రకాల వసతులు కల్పించేందుకు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించారు.
కుటుంబంతో కలిసి ఓ రోజంతా విడిది చేయడానికి తగిన ఏర్పాట్లు చేశారు. రాత్రి పూట పడుకోవడానికి ఇసుక తిన్నెల్లో అత్యాధునిక గుడారాలను నిర్మించి, సౌకర్యవంతంగా ఉండేందుకు బెడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఇద్దరు ఉండడానికి వీలుగా 25, ముగ్గురి కోసం 20, నలుగురు కుటుంబ సభ్యులు ఉండేందుకు 5 చొప్పున మొత్తం 50 గుడారాలను నిర్మించారు. దీంతో పాటు ఉదయం అడవి అందాలను చూసేందుకు వీలుగా మంచెలను కూడా సిద్ధం చేశారు. ఐలాండ్ మొత్తం కలర్‌ఫుల్ లైట్లు ఏర్పాటు చేయడమే కాకుండా చుట్టారా కర్రలతో రక్షణ గోడ నిర్మించారు. రాత్రి వేళ అడవి జంతువులు లోపలికి రాకుండా ఏర్పాట్లు చేశారు. ఐలాండ్ పనులు పూర్తి కావడంతో త్వరలోనే ప్రారంభిస్తామని ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు.
బీచ్ వాలీబాల్, షటిల్ వంటి క్రీడా సదుపాయాలు
బ్లాక్ బెర్రీ ఐలాండ్‌లో స్టే చేసేందుకు వచ్చే వారు ఆడుకోవడానికి వీలుగా వాలీబాల్, షటిల్ కోర్టులను నిర్మించారు. విదేశాల్లో సముద్రం పక్కన బీచ్ వాలీబాల్ ఆడే అనుభూతి పొందేలా.. స్థానికంగా వాగు పక్కన ఇసుకపై కోర్టులు ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా కబడ్డీ, ఖోఖో వంటి ఆటల కోసం సైతం కోర్టులను సిద్ధం చేశారు. అలాగే రాత్రి టైంలో చలికాచుకోవడానికి వీలుగా క్యాంప్ ఫైర్‌ను ఏర్పాటు చేశారు. సెల్ఫీల కోసం ప్రత్యేకంగా జోన్లు సిద్ధం చేశారు.
హై ఫై రెస్టారెంట్
ఐలాండ్‌లో అధునాతనమైన టెక్నాలజీ, నూతన హంగులతో హైఫై రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ రెస్టారెంట్‌లో ఆంధ్ర, తెలంగాణ వంటకాలతో పాటు పర్యాటకులు కోరుకునే ప్రతీ వంటకాన్ని రెడీ చేసేందుకు ప్రత్యేకంగా చెఫ్‌లను నియమించారు. రాత్రి వేళ డిమ్ లైట్ల మధ్య భోజనం చేసేలా ఏర్పాట్లు చేశారు. ఒకేసారి వంద మందికిపైగా డిన్నర్ చేసేలా టేబుల్స్ వేశారు.
ప్రత్యేక వెబ్‌సైట్, యాప్
బ్లాక్ బెర్రీ ఐలాండ్‌లో బస చేయాలని ఆసక్తి చూపే వారి కోసం ఒక ప్రత్యేక వెబ్‌సైట్, యాప్ రిలీప్ చేస్తామని పర్యాటక శాఖ ఆఫీసర్లు చెబుతున్నారు. ఐలాండ్ ప్రారంభం అయిన తర్వాత ఈ యాప్ రిలీజ్ కానుంది. ఐలాండ్‌లో స్టే చేసేందుకు ధరల వివరాలను ఆఫీసర్లు ఇంకా నిర్ణయించలేదు. అయితే ఒక్కరికి ఒక రోజుకు రూ. 1,500 నుంచి రూ. 2 వేలకు ఉండొచ్చని తెలుస్తోంది. పిల్లలకు టికెట్ రేటులో రాయితీ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఐలాండ్‌ను త్వరలోనే ప్రారంభిస్తం
పర్యాటకులను ఆకర్షించాలన్న ఉద్దేశంతో ఐలాండ్‌ను సిద్ధం చేస్తున్నాం. ములుగు జిల్లాలో ఇప్పటికే లక్నవరం, రామప్ప, బొగత జలపాతం, మేడారం జాతర వంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ములుగు జిల్లాను టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. బ్లాక్‌బెర్రీ ఐలాండ్‌ను చూస్తే అమెజాన్ అడవుల్లో తిరిగిన అనుభూతి కలుగుతుంది. ఈ ఐలాండ్‌ను త్వరలోనే ప్రారంభిస్తం.
– సీతక్క, మంత్రి-
ఎలా చేరుకోవాలి ?
హైదరాబాద్ నుంచి వచ్చే వారు హైదరాబాద్ -– భూపాలపట్నం నేషనల్ హైవే 163 మీదుగా ప్రయాణిస్తూ ఐలాండ్‌ను చేరుకోవచ్చు. ములుగు జిల్లా కేంద్రం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో హైవేను ఆనుకునే ఈ ఐలాండ్ ఉంటుంది. మెయిన్‌రోడ్డు నుంచి దిగి అడవిలో కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. పస్రా దాటాక కేవలం 5 కిలోమీటర్ల దూరమే. ట్రైన్‌లో వచ్చేవాళ్లు వరంగల్ లేదా కాజీపేటలో దిగి ఆర్టీసీ బస్సుల్లో ఐలాండ్‌కు చేరుకోవచ్చు. వరంగల్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏపీ నుంచి వచ్చే వాళ్లు భద్రాచలం, ఏటూరునాగారం, తాడ్వాయి మీదుగా చేరుకోవచ్చు.