- నిధులు మంజూరై నాలుగు నెలలు పూర్తి
- నేటికీ పనులు మొదలుకాలే..
- వచ్చే నెలలో ప్రారంభిస్తామంటున్న ఆఫీసర్లు
- చాలాచోట్ల పాఠశాలలే దిక్కు
- మరికొన్ని చోట్ల అద్దె భవనాల్లోనే ఆఫీసులు
ఖమ్మం, వెలుగు: జిల్లాలో గ్రామ పంచాయతీల ఏర్పాటు తర్వాత వాటి ఆఫీసుల నిర్మాణానికి అడుగు ముందుకు పడడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనా, బిల్డింగుల నిర్మాణాలకు మాత్రం కాలయాపన చేస్తున్నారు. కొత్త జీపీలతోపాటు పాత జీపీల భవనాలు కొన్ని శిథిలావస్థకు చేరాయి. వాన పడితే ఊరిసే పరిస్థితి నెలకొంది. కొన్నింటిలో ఒకట్రెండు గదులతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల భవనాలను జీపీలకు వాడుతున్నారు. ఇంకొన్ని అద్దె భవనాల్లో సాగిస్తున్నారు. గతేడాది డిసెంబర్ మూడో వారంలో కొత్తగా ఏర్పాటైన జీపీల బిల్డింగుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. అయితే నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పనుల్లో పురోగతి లేదు. అందుకు కొన్ని ఉదాహరణలు..
- వైరా మండలంలో స్టేజి పినపాక, గోవిందపురం, కొష్టాలను కొత్త జీపీలను ఏర్పాటు చేశారు. వీటికి భవనాలు నిర్మించలేదు. కోష్టాలలో స్కూల్లో ఓ గదిని జీపీ ఆఫీస్‌గా వాడుకుంటున్నారు.
- పెనుబల్లి మండలంలో 11, వేంసూరు మండలంలో 9 జీపీలకు సొంత భవనాలు లేక ఖాళీగా ఉన్న స్కూల్భవనాల్లోనే జీపీ ఆఫీసులు సాగుతున్నాయి.
- కల్లూరు మండలంలో పడమటి లోకవరం జీపీలో ప్రైమరీ స్కూల్ఆవరణలోనే ఆఫీస్ ను నిర్వహిస్తున్నారు.
- కామేపల్లి మండలంలో కొత్తగా ఏర్పడిన ఏడు జీపీలకు సొంత బిల్డింగులు లేవు. జగన్నాథ తండా జీపీ ఆఫీస్ప్రైవేట్ బిల్డింగ్ లో నిర్వహిస్తున్నారు. టేకుల తండా, బర్లగూడెం జీపీలను అంగన్వాడీ భవనాలల్లో నిర్వహిస్తున్నారు. రుక్కి తండా, లాల్య తండా, ఆర్కే పురం, జోగుగూడెం జీపీలు గవర్నమెంట్ స్కూల్లో నిర్వహిస్తున్నారు.
అన్నింటికీ ఒకే డిజైన్...
జిల్లాలో మొత్తం 584 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో 427 జీపీలు పాతవి కాగా, 2018 లో 157 జీపీలు కొత్తగా ఏర్పాటయ్యాయి. వీటిలో ఎక్కువగా తండాలే జీపీలుగా మారాయి. ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 292 జీపీలకు ఒక్కోదానికి రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.58.4 కోట్లు మంజూరయ్యాయి. ఈజీఎస్ నిధులతో పంచాయతీరాజ్డిపార్ట్ మెంట్ పర్యవేక్షణలో వీటిని నిర్మించనున్నారు. కొత్త జీపీలకు ఒక్కోదానికి1000 గజాల చొప్పున రెవెన్యూ అధికారులు స్థలాన్ని కేటాయిస్తున్నారు. వాటిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక డిజైన్ ను విడుదల చేశారు. దాని ప్రకారమే అన్ని చోట్ల బిల్డింగ్ లు నిర్మించాలని ప్లాన్చేశారు. అయితే ఇంత వరకు ఒక్క జీపీ బిల్డింగ్ పనులు మొదలుకాలేదు.
మొదట సీసీ రోడ్లపైనే దృష్టి...
ఉపాధిహామీ పథకం కింద మంజూరైన నిధుల్లో సీసీ రోడ్ల కోసం వచ్చిన ఫండ్స్‌లో మార్చి నెలాఖరుకు పనులు కంప్లీట్ చేయాల్సి ఉంది. గ్రామ పంచాయతీల్లో మెజారిటీ చోట్ల సర్పంచ్ లే ఇలాంటి నిర్మాణ పనులను చేపడుతున్నారు. ఇక అధికారులు కూడా మార్చి నెలాఖరులోగా పనులు కంప్లీట్ చేయకపోతే ఫండ్స్ రిటర్న్ అయ్యే పరిస్థితి నెలకొనడంతో పనులపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. మార్చిలోగా సీసీ రోడ్ల నిర్మాణాలను కంప్లీట్ చేసుకొని, ఆ తర్వాత జీపీ బిల్డింగుల పని మొదలుపెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
నియోజకవర్గాల వారీగా మంజూరైన జీపీ బిల్డింగులు
ఖమ్మం 10
పాలేరు 36
వైరా 3
మధిర 12
సత్తుపల్లి 38
కొత్తగూడెం 40
అశ్వారావుపేట 29
పినపాక 33
ఇల్లందు 29
భద్రాచలం 35