ఖాళీ ప్లాస్టిక్‌ బాటిళ్లతో బస్‌ షెల్టర్‌ నిర్మాణం

కమలాపూర్, వెలుగు: హన్మకొండ జిల్లా కమలాపూర్​ మండలం ఉప్పులపల్లిలో ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లతో నిర్మించిన బస్ షెల్టర్​అందరినీ ఆకట్టుకుంటోంది. వ్యర్ధాలను అర్ధవంతంగా వాడుకోవాలని ఎంపీడీఓ ఇచ్చిన సలహాతో బస్​ షెల్టర్​ నిర్మాణానికి గ్రామ సర్పంచ్ ​ఉమ శ్రీకారం చుట్టారు. ఉప్పులపల్లిలో రోజూ సేకరించిన వ్యర్ధాలను పంచాయతీ సిబ్బంది సెగ్రిగేషన్ షెడ్​కు  తరలిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిళ్లను ఓ మూలన కుప్పపోశారు.

ఇటీవల  విలేజ్​ను విజిట్​ చేసిన  ఎంపీడీవో పల్లవి  బాటిళ్లతో బస్​షెల్టర్​ ఏర్పాటు చేయాలని  సర్పంచ్ ఉమకు సూచించారు. దీంతో  సర్పంచ్​ జీపీ సిబ్బందితో కలిసి  సుమారు  1200 ఖాళీ ప్లాస్టిక్​బాటిళ్లతో నాలుగైదు రోజుల్లోనే  ప్లాస్టిక్ హబ్ పేరిట కొత్తగా షెల్టర్​ను నిర్మించారు. షెల్టర్​చుట్టూ ఖాళీ బాటిళ్లలో  గడ్డి పూల మొక్కలు పెంచి  అందంగా అలంకరించారు. ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దే దిశగా చేసిన ప్రయోగానికి మంచి గుర్తింపు వచ్చింది. బస్​ షెల్టర్​ వద్ద  ప్రయాణికులు, స్థానికులు సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.