శ్రీశైలం వద్ద రూ.వెయ్యి కోట్లతో ఐకానిక్‌ బ్రిడ్జి

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం వద్ద తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతున్నది. శ్రీశైలం సమీపంలోని తెలంగాణ బార్డర్ ఈగలపెంట కొండ నుంచి అటు ఆంధ్రా బార్డర్ కుడిగట్టు విద్యుత్ కేంద్రం వరకు ఐకానిక్  బ్రిడ్జ్ నిర్మాణం చేసేందుకు కేంద్రం ఇప్పటికే సర్వేలు చేసింది. శ్రీశైలానికి భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో  ఘాట్ రోడ్డును తగ్గించాలని సర్కారు భావిస్తున్నది. 

అందులో భాగంగా దీనికి సంబంధించిన ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ వంతెన నిర్మాణానికి సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే.. ఘాట్ రోడ్డులోని పెద్దపెద్ద మలుపులు చాలా వరకు తగ్గుతాయి. భక్తుల  రాకపోకలు సులభతరమవుతాయి. రోడ్డు ప్రమాదాలు కూడా చాలా వరకు తగ్గుతాయి.