నత్తనడకన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, పంపిణీ

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, పంపిణీ నత్తనడకన సాగుతోంది. 10 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం పంపిణీ చేయడం లేదు. ఇళ్ల కోసం దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో రావడం, నిర్మించిన ఇళ్ల సంఖ్య తక్కువగా ఉండడంతో ఎవరికి ఇవ్వాలో తెలియక ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వం సొంత జాగలో ఇళ్లు కట్టుకునేవాళ్లకు రూ.3 లక్షల సాయం అందిస్తామని 'గృహలక్ష్మి' స్కీమ్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ అందుబాటులోకి రాగానే డబుల్ రూమ్ ఇళ్లు, ఫ్లాట్ల పంపిణీతోపాటు ఇళ్లురాని వారికి ఆర్థిక సాయం అందించాలనే యోచనలో ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. 

పంపిణీ చేసింది 1520 ఇళ్లే.. 

  • ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 25,815 ఇండ్లు మంజూరైతే 10,092 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా కేవలం 1,520 ఇండ్లు మాత్రమే పంపిణీ చేశారు. పంపిణీ చేసిన చోట కూడా అనర్హుల పేర్లు జాబితాలో చేర్చి డ్రా తీశారనే విమర్శలు వెల్లువెత్తాయి. మరో 7,513 ఇళ్ల కన్ స్ట్రక్షన్ ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు. నిర్మాణ పనులు జరుగుతున్న ఇళ్లలో చాలా వరకు పిల్లర్లు, స్లాబ్ దశలోనే ఉన్నాయి. 
  •  కరీంనగర్ జిల్లాకు 6,564 ఇళ్లు మంజూరైతే ఇందులో 789 ఇళ్లు/ఫ్లాట్ల నిర్మాణం పూర్తయింది. మరో 4,118 ఇళ్లు నిర్మాణంలోఉన్నాయి. ఇప్పటి వరకు ఈ జిల్లాలో 388 ఇళ్లను మాత్రమే పేదలకు పంపిణీ చేశారు. ఈ జిల్లాలో ఇంకా 1657 ఇళ్లకు ఇప్పటి వరకు పునాది తీయలేదు. 
  •  జగిత్యాల జిల్లాకు ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా 8,770 ఇళ్లు మంజూరైతే ఇప్పటి వరకు 1133 ఇళ్లు పూర్తి కాగా మరో 4,838 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఈ జిల్లాలో 593 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేశారు. జిల్లాలో 2,799 ఇళ్ల నిర్మాణానికి ఇప్పటి వరకు ముగ్గు కూడా పోయలేదు. 
  • పెద్దపల్లి జిల్లాకు అత్యంత తక్కువగా 3,352 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయి. ఇందులోనూ కేవలం 262 ఇళ్ల నిర్మాణమే పూర్తయ్యింది. మ రో 2,535 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ జిల్లా లో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా పంపిణీ చేయలేదు. సాంక్షన్ అయిన మరో 555 ఇళ్ల నిర్మాణాన్ని ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు. 
  • రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్నసిరిసిల్ల జిల్లాకు 7129 ఇళ్లు మంజూరైతే 3333 ఇళ్లు నిర్మాణం పూర్తయ్యింది. మరో 1294 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఈ జిల్లాలో 539 ఇళ్లు మాత్రమే పంపిణీ అయ్యాయి. 2502 ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోయలేదు. 

ఇళ్ల కోసం ఆందోళనలు.. 

ఇళ్ల నిర్మాణం కొన్ని చోట్ల పూర్తయినా.. పంపిణీ చేయకపోవడంతో దరఖాస్తుదారులు తరుచూ ఆందోళనలకు దిగుతున్నారు. గత నెలలో కరీంనగర్ సిటీ శివారులోని చింతకుంటలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ల ఆక్రమణకు పలుమార్లు యత్నించారు. కొందరైతే ఏకంగా ఫ్లాట్ల డోర్లకు తమ పేర్లు రాసుకున్నారు. దీంతో చట్టపరమైన చర్యలు తప్పవంటూ పోలీసులు ఓ ఫ్లెక్సీని ఏర్పా టు చేయాల్సి వచ్చింది. ఆ ఫ్లెక్సీకి కౌంటర్ గా డబుల్ బెడ్ రూమ్ బాధితుల సంఘం పేరిట మరో రెండు ఫ్లెక్సీ లు కట్టడం అప్పట్లో కలకలం రేపింది. ఇలాంటి నిరసనలతోపాటు కలెక్టరేట్ లో నిర్వహించే గ్రీవెన్స్ సెల్ లోనూ ఇళ్ల దరఖాస్తులే ఎక్కువగా వస్తున్నాయి. 

ఇళ్లు తక్కువ.. అప్లికేషన్లు ఎక్కువ.. 

సాంక్షన్ అయిన ఇళ్లకు సంఖ్యకు నాలుగైదు రెట్ల సంఖ్యలో అప్లికేషన్లు రావడంతో ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు, అధికార పార్టీ లీడర్లు తలలు పట్టుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంతోపాటు మరో తొమ్మిది గ్రామాల వారికి  చొప్పదండి పట్టణంలో 169 ఇండ్లను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని ఇళ్లు  పిల్లర్ల దశలో ఉండగా మరికొన్ని స్లాబ్ వేసి గోడలు నిర్మించారు. ఈ ఇళ్ల కోసం 1100 అప్లికేషన్లు వచ్చాయి. ఇల్లందకుంట మండలంలోని బూజునూరు గ్రామంలో 52 డబుల్ బెడ్ రూం నిర్మాణాలు కరెంట్, వాటర్ సప్లై, డ్రైనేజీ  మినహా దాదాపుగా పూర్తయ్యాయి. వీటి కోసం 185 మంది ఎదురుచూస్తున్నారు. హుజురాబాద్ పట్టణ శివారులో 550  డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించగా.. వీటి కోసం హుజురాబాద్ మండల పరిధిలో సుమారు 1500 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.