సీకులకు తుప్పు.. బేస్మెంట్లకు పగుళ్లు

సీకులకు తుప్పు.. బేస్మెంట్లకు పగుళ్లు
  • పాలమూరు జిల్లాలో డబుల్​ బెడ్రూమ్​ ఇండ్ల పనులు ఏడియాడనే

మహబూబ్​నగర్​, వెలుగు : డబుల్​ బెడ్రూమ్​ ఇండ్ల నిర్మాణాలు ముందు పడట్లేదు. కొన్ని మండలాల్లో శంకుస్థాపన చేసి మూడేండ్లు కావస్తున్నా, పిల్లర్ల దశ దాటలేదు. దీనికితోడు పిల్లర్ల కోసం ఏర్పాటు చేసిన సీకులు వర్షానికి తడిసి, ఎండకు ఎండి తుప్పుపట్టాయి. కొన్ని చోట్ల భూమికి, బేస్​మెంట్​కు మధ్య గ్యాప్​ రావడంతో, వీటిని కంప్లీట్​ చేసినా పనికిరావని అంటున్నారు.

ఏండ్లుగా పెండింగ్..

జిల్లాలోని పాలమూరు, దేవరదక్ర, జడ్చర్ల నియోజకవర్గాల్లో 8,768 డబుల్​ బెడ్రూమ్​ ఇండ్ల నిర్మాణానికి అనుమతి వచ్చింది. ఐదేండ్లు కావస్తున్నా సగం ఇండ్లు కూడా కంప్లీట్​ కాలేదు. ఇప్పటి వరకు 4,321 ఇండ్లు పూర్తి కాగా, 2,125 వివిధ దశల్లో ఉండగా, 2,322 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. ప్రధానంగా హన్వాడ మండల కేంద్రంతో పాటు యారోనిపల్లి, బుద్దారం, గుడిమల్కాపూర్​ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. పిల్లర్లు, బేస్​మెంట్​ వరకు పనులు చేసి వదిలేశారు.గుడిమాల్కాపూర్​లో కొద్ది రోజుల కింద పనులు ఆగిపోగా, ఇటీవల పనులు ప్రారంభమయ్యాయి. మహబూబ్​నగర్​ రూరల్​ మండలం మాచన్​పల్లి, చౌదర్​పల్లి, ఓబులాయిపల్లి గ్రామాల్లో 32 ఇండ్ల చొప్పున, అడవి వెంకటపూర్​లో 64, కోడూరులో 45 ఇండ్లను కడుతున్నారు. 

వీటిలో కొన్ని పూర్తయినా, అర్హులకు అందజేయలేదు. కోడూరులో ప్లాస్టరింగ్​, టైల్స్​ పనులు జరుగుతున్నాయి. మాచన్​పల్లి, ఓబులాయపల్లి, వెంకటపూర్​లో డోర్ల ఫిట్టింగ్​, టైల్స్​ పనులు కొనసాగుతున్నాయి. జడ్చర్ల  నియోజకవర్గానికి 2,700 ఇండ్లు మంజూరు చేస్తే, 540 ఇండ్లను పంపిణీ చేశారు. నవాబుపేట మండల కేంద్రంలో 100 ఇండ్లకు స్లాబ్  వేసి వదిలేశారు. యన్మన్​గండ్లలో 48 , రుద్రారంలో 24 ఇండ్లను పూర్తి చేసినా లబ్ధిదారులకు ఇవ్వలేదు. బాలానగర్​ మండలంలోని గౌతపూర్​లో 64, పెద్దయ్యపల్లిలో 40 ఇండ్లు కట్టించి పంపిణీ చేయలేదు. మిడ్జిల్ మండలకేంద్రంలో ఇండ్ల కోసం స్థలాన్ని కేటాయించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. హైటెన్షన్ వైర్లు ఉన్నాయనే కారణంతో పనులు ప్రారంభించలేదు. వేరే ప్రాంతంలో స్థల సేకరణ చేయాల్సి ఉన్నా, ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. గండీడ్​, మహమ్మదాబాద్​, కోయిల్​కొండ మండలాల్లో ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు. 

ఉన్నవే కట్టలే..

జిల్లా వ్యాప్తంగా ఇంకా 4,447 ఇండ్లు కంప్లీట్​ చేయాల్సి ఉంది. అయితే డిసెంబరు 4న పాలమూరులో పర్యటించిన సీఎం కేసీఆర్​ నియోజకవర్గానికి వెయ్యి ఇండ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. 15 రోజుల్లో కార్యాచరణ కూడా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇంత వరకు సీఎం చెప్పినట్లు అదనపు ఇండ్లు మంజూరు కాలేదు. ప్రస్తుతం ఐరన్, సాండ్, సిమెంట్​ 
తదితర మెటీరియల్​ ధరలు పెరిగాయి. దీంతో కాంట్రాక్టర్లు పనులను కంప్లీట్​ చేయడానికి ముందుకు రావడం లేదని అంటున్నారు.

ఇండ్లు ఎప్పుడిస్తరో?

నవాబ్​పేటలో డబుల్ బెడ్రూమ్​ ఇండ్ల పనులు స్టార్ట్​ చేసిన మూడేండ్లు అవుతోంది. సగం పనులు కూడా కంప్లీట్​ చేయలేదు. ఈ ఇండ్లను ఎప్పుడు కడ్తరో? మాకు ఎప్పుడిస్తరో?  అర్థం కావడం లేదు. 

- కొట్ల రాజు, నవాబుపేట