భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: అభివృద్ధి పనులకు సంబంధించి ఎస్టిమేషన్లు వేయడమంటే గాల్లో లెక్కలు వేయడం కాదని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో అభివృద్ధి పనులపై బుధవారం వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. పినపాక నియోజకవర్గంలో చేపట్టిన పనుల్లో అంచనాలకు మించి నిధులు అవసరమవుతున్నాయని పీఆర్ డీఈ సమాధానం చెప్పడంతో కలెక్టర్ మండిపడ్డారు. ఎస్టిమేషన్లు ఇష్టమున్నట్లు వేస్తే ఎలా పబ్లిక్ మనీ, నీది, నాది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంచనాలు ఎందుకు పెరిగాయనే విషయంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇల్లందు బస్ డిపో నిర్మాణ పనులు స్లోగా జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఈ, డీఈలకు షోకాజ్ నోటీస్లివ్వాలని ఆదేశించారు. భద్రాచలం నియోజకవర్గంలో 170 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను నవంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇల్లందు నియోజకవర్గంలో డీఎంఎఫ్టీ నిధులతో చేపట్టిన పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతుందని ప్రశ్నించారు. రూ. కోట్లలో నిధులు మంజూరు చేస్తే పనులు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెంచకపోతే వచ్చే నిధులతో పాటు గతంలో ఖర్చు చేసిన నిధులను రికవరీ చేస్తామని హెచ్చరించారు. పనుల్లో జాప్యం చేసే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టేందుకు ప్రపోజల్స్ రెడీ చేయాలని ఇల్లందు మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. డీఆర్డీవో మధుసూదనరాజు, డీపీవో రమాకాంత్, ఐసీడీఎస్ పీడీ వరలక్ష్మి, డీఈవో సోమశేఖరశర్మ పాల్గొన్నారు.
మనబడి పనులపై కలెక్టర్ సీరియస్
కారేపల్లి: మండలంలోని స్కూళ్లలో చేపట్టిన ‘మన ఊరు–మన బడి’ పనులు స్లోగా జరగడంపై కలెక్టర్ వీపీ గౌతమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలోని మోకాళ్లరామయ్యగుంపు ప్రైమరీ స్కూల్నుసందర్శించి పనులు పూర్తి స్థాయిలో జరగకపోవడంతో విద్యా శాఖ అధికారులపై మండిపడ్డారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి అక్కడే భోజనం చేశారు. అనంతరం జమాళ్లపల్లిలో పోడు సర్వేను పరిశీలించారు. పోడు రైతులు సాగు చేస్తున్న భూమి వేర్వేరు చోట్ల ఉంటే అన్నింటిని కలిపి ఆన్లైన్ చేయాలని సూచించారు. డీఎఫ్‌వో సిద్ధార్థ్విక్రమ్సింగ్, డీఈవో యాదయ్య, ఎంపీపీ శకుంతల, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, పేరుపల్లి సర్పంచ్ అజ్మీరా నాగేశ్వరరావు, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఎన్నిసార్లు చెప్పినా మారరా?
కామేపల్లి: ఎన్నిసార్లు చెప్పినా మారక పోతే ఎలాగని ఆఫీసర్లపై కలెక్టర్ ఫైర్ అయ్యారు. కొమ్మినేపల్లి పశువుల సంతను పరిశీలించి వ్యాపారులతో మాట్లాడారు. వ్యాపారులు తమ ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కనీసం తాగడానికి నీళ్లు లేవని, మరుగుదొడ్ల తాళాలు వేస్తున్నారని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస మౌలిక వసతులు కల్పించాలని పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ లను ఆదేశించారు. సర్పంచ్ దుర్గా జ్యోతి, జడ్పీ సీఈవో ఇంజం అప్పారావు, డీపీవో జె హరిప్రసాద్, డీఎల్పీవో పుల్లారావు, పీఆర్ డీఈ వెంకటరెడ్డి, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీవో సిలార్ సాహెబ్ పాల్గొన్నారు.
కొనుగోలు సెంటర్లు ఏర్పాట్లు చేయాలి
ఖమ్మం టౌన్: ధాన్యం, పత్తి కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో ధాన్యం, పత్తి కొనుగోళ్ల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. దిగుబడి అంచనాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 6,66,768 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందనే అంచనాతో గన్నీ బ్యాగులు, తేమ, తూకం యంత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. 1,66,307 మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందనే అంచనాతో ఏర్పాటు చేయాలన్నారు. జిన్నింగ్ మిల్లులను తనిఖీ చేసి ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, అగ్నిమాపక యంత్రాల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ ఎన్ మధుసూదన్, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, డీఏవో విజయనిర్మల, డీటీవో కిషన్ రావు, మార్కెటింగ్ ఆఫీసర్ నాగరాజు, అడిషనల్ డీసీపీ ఏసీ బోస్, ఏసీపీలు ఆంజనేయులు, ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.