
- ఇటీవల భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు
- రంగంపేట, పవర్‌హౌస్‌కాలనీకి పెరగనున్న కనెక్టివిటీ
- హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాళ్లవాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ముందగుడు పడింది. బైపాస్ రోడ్డులోని తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర ఇప్పుడున్న లో లెవల్ కాజ్వే స్థానంలోనే బ్రిడ్జి నిర్మించనున్నారు. టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.13.50 కోట్ల ఫండ్స్ కేటాయించారు. 20 ఏండ్ల కిందట లో లెవల్ కాజ్వే.. రాళ్లవాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మించాలని వాగు ఆవల ఉన్న రంగంపేట, పవర్‌హౌస్‌కాలనీ, అండాలమ్మ కాలనీవాసులు దశాబ్దాల కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. కానీ, గత ప్రభుత్వాలు ప్రజల గోడును ఏనాడూ పట్టించుకోలేదు.
బైపాస్ రోడ్డు నిర్మాణం తర్వాత వాగు చుట్టుపక్కల కాలనీలు విస్తరించాయి. దీంతో 2005లో రాళ్లవాగుపై సుమారు రూ.80 లక్షలతో లో లెవల్ కాజ్వే నిర్మించారు. అప్పటి నుంచి రంగంపేట, పవర్‌హౌస్‌కాలనీ, అండాలమ్మ కాలనీవాసులు కాజ్వే మీదుగా మంచిర్యాలకు రాకపోకలు సాగిస్తున్నారు. అంతకుముందు అండాలమ్మ కాలనీ, ఏసీసీ మీదుగా ఐదారు కిలోమీటర్లు ప్రయాణించేవారు. కాజ్వే నిర్మాణంతో కేవలం అర కిలోమీటర్ దూరంలోనే మంచిర్యాలకు చేరుకుంటున్నారు. ఈ కాలనీల ప్రజలు నిత్యం పాలు, కూరగాయలు అమ్ముకోవడానికి, ఇతర అవసరాలకు టౌన్‌కు వస్తుంటారు. విద్యార్థులు, ఉద్యోగులు బైక్‌లు, ఆటోలు, ఇతర వహనాల ద్వారా కాజ్వే మీదుగా సులువుగా రాకపోకలు సాగిస్తున్నారు.
రాళ్లవాగుపై నిర్మించిన కాజ్వే 2019లో కురిసిన భారీ వర్షాలకు కూలిపోయింది. దీంతో కాజ్వే మీదుగా రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఐదేండ్లుగా వర్షాకాలంలో వరదలకు మట్టి కొట్టుకుపోవడం, అధికారులు తాత్కాలిక రిపేర్లు చేసి చేతులు దులుపుకోవడం తంతుగా మారింది. అంతేకాకుండా రాళ్లవాగుకు వరదలు వచ్చినప్పుడు కాజ్వే పూర్తిగా నీటి మునిగి రాకపోకలు స్తంభించిపోతున్నాయి. దీంతో మళ్లీ అండాలమ్మ కాలనీవాసులకు రోడ్డే దిక్కవుతోంది. ఇటీవల రంగంపేటలో కొత్త కాలనీలు విస్తరించాయి. రాళ్లవాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలన్న డిమాండ్లు తెరపైకి వచ్చాయి.
ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ప్రత్యేక చొరవతో రాళ్లవాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి టీయూఎఫ్‌డీసీ ద్వారా రూ.13.50 కోట్లు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఇటీవల అమరవీరుల స్తూపం దగ్గర భూమిపూజ చేశారు. ఈ పనులను పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్కు అప్పగించారు. త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ వార్తతో వాగు అవతలి భూములకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఎట్టకేలకు దశాబ్దాల కల సాకారం కానుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.