
- సంగారెడ్డి జిల్లా వాసులకు తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
- రూ.130.65 కోట్లతో 1.65 కిలోమీటర్ల పొడవున ఫ్లై ఓవర్
సంగారెడ్డి, వెలుగు: లింగంపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కావడంతో సంగారెడ్డి జిల్లా ప్రజల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడినట్లయింది. ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో బీహెచ్ఈఎల్ జంక్షన్ వద్ద రూ.130.65 కోట్లతో 1.65 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. 2022లో ఫ్లై ఓవర్ పనులు ప్రారంభించగా, 2024 అక్టోబర్ లోగా పనులు పూర్తి చేయాల్సి ఉండగా పనుల్లో జాప్యం కారణంగా నాలుగు నెలలు ఆలస్యంగా పూర్తి చేశారు. స్వల్ప పనులు మినహా బ్రిడ్జి నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఇప్పటికే తాత్కాలికంగా వాహనాలకు ఎంట్రీ ఇచ్చారు. త్వరలో బ్రిడ్జిని అధికారికంగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ట్రాఫిక్ సమస్యకు చెక్
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, జోగిపేట, నారాయణఖేడ్ వాసులు పటాన్ చెరు నుంచి బీరంగూడ మీదుగా లింగంపల్లి ఫ్లై ఓవర్ ఎక్కి ట్రాఫిక్ సమస్య లేకుండా హైదరాబాద్ చేరుకోగలుగుతారు. అంతకుముందు పటాన్ చెరు, పాశమైలారం, అమీన్పూర్, బీరంగూడ వాసులు సంగారెడ్డి, జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాకు వెళ్లే వాహనాలు అశోక్ నగర్, బీహెచ్ఈఎల్ సర్కిల్ మీదుగా ప్రయాణించడంతో ఈ రహదారి నిత్యం బిజీగా ఉండేది. ఎప్పుడు ట్రాఫిక్ జామ్ కావడం, ఒక్కోసారి కిలోమీటర్ ప్రయాణం కూడా గంటల తరబడి సాగుతుండేది. ఇలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం లింగంపల్లి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టింది. దీనికి తోడు మదీనాగూడ నుంచి సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు రూ.790 కోట్లతో నాలుగు లైన్లుగా ఉన్న 65వ నేషనల్ హైవేను ఆరు లైన్లుగా చేస్తూ రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ పనులు కూడా పూర్తి అయితే దాదాపు 55 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
తాత్కాలిక ఎంట్రీతో..
ప్రస్తుతం లింగంపల్లి ఫ్లై ఓవర్ పై నుంచి వాహనాలకు తాత్కాలికంగా ఎంట్రీ ఇచ్చారు. దీంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బెల్ జంక్షన్ వద్ద మూడు రోడ్లు కలవడంతో ఇక్కడ నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉండడంవల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం పొందినట్టు ప్రయాణికులు చెబుతున్నారు. వాహనదారులను ఫ్లైఓవర్ పై నుంచి వెళ్లేందుకు అనుమతి ఇచ్చి కింద జంక్షన్ వద్ద మరికొన్ని అభివృద్ధి పనులు వేగంగా చేసేందుకు అధికారులు ప్లాన్ చేశారు. ఫ్లైఓవర్ పై ఉన్న చిన్న చిన్న పనులు పూర్తి చేసి త్వరలో అధికారికంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వారం రోజుల్లో అందుబాటులోకి
లింగంపల్లి ఫ్లై ఓవర్ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. చిన్న చిన్న మైనర్ పనులు జరుగుతున్నాయి. ఫ్లై ఓవర్ కు సంబంధించి నాణ్యత పనులు పూర్తయిన తర్వాతే వాహనదారులకు ఈ బ్రిడ్జిపై నుంచి వెళ్లేందుకు అనుమతి ఇచ్చాం. మరో వారం రోజుల్లో ఫ్లై ఓవర్ పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తాం.రామకృష్ణ, డీఈఈ, నేషనల్ హైవే అథారిటీ