కోల్బెల్ట్: సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు కోసం కృషి చేస్తానని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా లోని ఎస్సార్పీ-3 ఇంక్లైన్, ఆర్కే 6, ఆర్కే5 బొగ్గు గనులపై సింగరేణి కార్మికులతో నిర్వహించిన గేట్ మీటింగ్ లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికులు లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదన్నారు.
సంస్థలో కొత్తబావులను నెలకొల్పుతామన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులను తీసుకొచ్చి కంపెనీలను నెలకొల్పి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కార్మికుల సొంతింటి కలను సొంతం చేస్తామన్నారు. బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. పెద్దపల్లి ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పడానికి కృషి చేస్తానన్నారు.
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ మెడికల్ అన్ ఫిట్ పేరుతో కార్మికుల కష్టాన్ని బీఆర్ఎస్ సర్కార్ దోచుకుందన్నారు. పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణ ను గెలిపించాలని కార్మికులను కోరారు. సింగరేణిని బీజేపీ సర్కార్ ప్రవేట్ పరం చేసేందుకు కుట్రలు చేస్తుందని ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ మండిపడ్డారు. గడ్డం వంశీకి ఏఐయుటీసి, సీపీఐ కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి.