హైదరాబాద్ నడిబొడ్డున కార్పొరేట్‎కు ధీటుగా ఉస్మానియా కొత్త హాస్పిటల్

హైదరాబాద్ నడిబొడ్డున కార్పొరేట్‎కు ధీటుగా ఉస్మానియా కొత్త హాస్పిటల్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: హైదరాబాద్ నడిబొడ్డున ఉస్మానియా హాస్పిటల్​కొత్త భవనాన్ని సకాల సదుపాయాలతో కార్పొరేట్ ధీటుగా తీర్చిదిద్దుతామని హైదరాబాద్​కలెక్టర్ అనుదీప్ వెల్లడించారు. గోషామహల్  పోలీస్ స్టేడియాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. గోషామహల్  పోలీస్ అకాడమీ స్టేడియంలోని 31.39 ఎకరాల స్థలంతోపాటు గూగుల్ మ్యాప్‎ను పరిశీలించారు. అనుభవజ్ఞులైన ఆర్కిటెక్స్ట్‎తో బిల్డింగ్ డిజైన్ల తయారీ చేయిస్తామన్నారు. హాస్పిటల్ చుట్టూ గ్రీనరీ, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తామని చెప్పారు. పోలీస్​ గ్రౌండ్స్‎లో ఉన్న పోలీస్ అకాడమీ, అనుబంధ శాఖలను బహాదూర్ పురా మండలం పేట్లబురుజు పోలీస్ ట్రాన్స్‎పోర్ట్ ఆర్గనైజేషన్‎లోకి మార్చడం జరుగుతుందని తెలిపారు. అక్కడ కూడా పోలీస్ శాఖకు అన్ని హంగులతో ఆఫీస్​ భవనాల నిర్మాణాలు చేపడుతామని వివరించారు.  

బైక్​పై తిరిగిన కలెక్టర్

గోషామహల్ చుట్టూ ఉన్న అప్రోచ్ రోడ్లు, నాలాలు, స్టేడియంతో పాటు పలు ప్రాంతాలను కలెక్టర్ బైక్ పై వెళ్లి పరిశీలించారు. ఆస్పత్రికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రయాణికులు వస్తుంటారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు.