
- ‘ఖని’లో రూ.18 కోట్లతో ర్యాపిడ్గ్రావిటీ ఫిల్టర్ ప్లాంట్ల నిర్మాణం
- 20 ఎంఎల్డీ, 15 ఎంఎల్‌డీల కెపాసిటీతో రెండు ప్లాంట్లు
- ఇక వేసవి, వానకాలాల్లో తాగునీటి కష్టాలు దూరం
గోదావరిఖని, వెలుగు : గోదావరిఖని కోల్‌బెల్ట్ వాసులకు తాగునీటి కష్టాలకు చెక్‌పడనుంది. కార్మిక కాలనీలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు మేనేజ్మెంట్చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రూ.18 కోట్లతో గోదావరిఖనిలోని క్వార్టర్ల కోసం 20 ఎంఎల్డీ, యైటింక్లయిన్ కాలనీలోని క్వార్టర్ల కోసం 15 ఎంఎల్‌డీల సామర్థ్యంతో రెండు ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టింది. దీంతో వేసవిలో తాగునీటి ఎద్దడి, వానాకాలంలో కలుషిత నీటి సప్లై నుంచి ‘ఖని’వాసులకు ఊరట కలగనుంది.
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
సింగరేణి రామగుండం రీజియన్‌లోని గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీల్లోని క్వార్టర్స్‌లో సుమారు 15 వేల కనెక్షన్లు, సాధారణ ప్రజలకు చెందిన మరో 10 వేల వరకు నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వీటికి గోదావరి ఒడ్డునున్న ఇంటేక్‌వెల్ నుంచి రా వాటర్‌ను గంగానగర్‌లోని ఫిల్టర్ బెడ్‌కు చేర్చి అక్కడ క్లోరినేషన్ చేస్తారు. అక్కడినుంచి కాలనీలకు సప్లై చేస్తారు. ప్రతీ వానాకాలంలో ఇంటేక్‌వెల్ వద్ద నదిలో చాంబర్పైనున్న మూతలు కొట్టుకుపోవడంతో బురదతో కూడిన నీరు కాలనీలకు సప్లై అవుతుండేది. బురద నీటి సమస్యను పరిష్కరించాలని కార్మికులు, సంఘాల లీడర్లు చాలాసార్లు ఆందోళనలు చేపట్టాయి.
మరోవైపు వానాకాలంలో కార్మిక కుటుంబాలు మున్సిపాలిటీ వాటర్ ట్యాంకుల నుంచి నీటిని తెచ్చుకునేవారు. ఈ ఇబ్బందులను గమనించిన సింగరేణి మేనేజ్‌మెంట్ పలు కాలనీల్లో ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ ప్లాంట్ల నుంచే కార్మిక కుటుంబాలు తాగునీటిని తెచ్చుకుంటున్నాయి. అయితే ప్రతిసారీ కార్మిక కుటుంబాలు క్యాన్ల ద్వారా ఆర్వో ప్లాంట్లకు వెళ్లి తెచ్చుకోవాల్సి రావడం సమస్యగా ఉందని కార్మిక లీడర్లు చెబుతున్నారు. కొత్తగా నిర్మించనున్న ప్లాంట్ల నిర్మాణంతో డైరెక్ట్‌గా ఇంటికే శుద్ధి చేసిన నీరు సప్లై అవుతుంది.
నిర్మాణ పనులు మొదలు
సింగరేణి రామగుండం రీజియన్ పరిధిలోని గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీ ఏరియాల్లో నివసించే కార్మిక కుటుంబాలకు తాగునీటి ఇబ్బందులను శాశ్వతంగా తొలగించేందుకు ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ప్లాంట్లు నిర్మించాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ఈ క్రమంలో రూ.18 కోట్లతో గోదావరిఖని ప్రాంతానికి 20 ఎంఎల్డీ, యైటింక్లయిన్ కాలనీ ప్రాంతానికి 15 ఎంఎల్డీ సామర్థ్యం గల రెండు ఫిల్టర్ ప్లాంట్ల నిర్మాణానికి జీడీకే 1వ గని సమీపంలోని ఖాళీ ప్రదేశంలో శ్రీకారం చుట్టింది. గోదావరి నుంచి నేరుగా వచ్చే రా వాటర్‌ను వివిధ దశల్లో శుద్ధి చేసి గంగానగర్, యైటింక్లయిన్ ఏరియాల్లోని ట్యాంకుల్లోకి పంపించేందుకు నిర్మాణ పనులు మొదలు పెట్టారు.
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
సింగరేణి కార్మికులు సంక్షేమానికి మేనేజ్‌మెంట్ కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా రూ.18 కోట్లతో తాగునీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపేందుకు గోదావరిఖనిలో ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ల నిర్మాణం చేపడుతున్నాం. ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులను స్పీడప్ చేశాం. -
చింతల శ్రీనివాస్, జనరల్ మేనేజర్