- పదేండ్లుగా ప్రపోజల్స్కే పరిమితం
- ఏండ్లు గడుస్తున్నా పూర్తికాని మినీ స్టేడియాలు
- బీఆర్ఎస్ సర్కారు నిధులివ్వక గల్లంతైన ఆశలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌నిర్మాణం పదేండ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. అప్పటి ప్రభుత్వం కాంప్లెక్స్ నిర్మాణాన్ని ఎస్టిమేషన్ల దశలోనే ఆపేయడం, పైసా ఫండ్స్ ఇవ్వకపోవడం, సింగరేణి ఇచ్చిన స్థలాన్ని పోలీసుశాఖ తీసుకోవడంతో స్పోర్ట్ కాంప్లెక్స్ ఆశలు గల్లతయినట్టేనని జిల్లాకు చెందిన క్రీడాకారులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలోని ఐదు నియోజవర్గాల్లో మినీ స్టేడియాల నిర్మాణాలకు కూడా అడుగు ముందుకు పడడంలేదు.
ఎస్టిమేషన్‌తో సరి పెట్టారు
జిల్లా నుంచి ఎంతమందో నేషనల్, స్టేట్ లెవల్క్రీడాపోటీల్లో ప్రతిభ చూపారు. వారు ప్రాక్టీస్ చేసుకోవడానికి, పోటీలు నిర్వహించేందుకు వీలుగా కొత్తగూడెంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని పదేండ్ల కిందట అప్పటి ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ ప్రతిపాదించారు. కాంప్లెక్స్ కోసం అవసరమైన 20 ఎకరాల ల్యాండ్‌ను స్థానిక హేమచంద్రాపురం సమీపంలో గుర్తించారు.
సింగరేణి ఆధీనంలో ఉన్న ఈ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని ఆఫీసర్లు కోరడంతో సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించింది. సింగరేణి స్థలాన్ని అప్పగించడంతో సాయ్ అధికారులు కూడా వచ్చి ల్యాండ్‌ను పరిశీలించారు. అథ్లెటిక్స్‌తో పాటు పలు క్రీడలకు సంబంధించి కోర్టులు, సౌకర్యాలు కల్పించేందుకు సాయ్ అధికారులు పూర్తి వివరాలతో ఎస్టిమేషన్ సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ఆ తర్వాత దీని గురించి ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం ఫండ్స్ మంజూరు చేయలేదు. ఫలితంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కథ మళ్లీ మొదటికొచ్చింది.
స్థలం పోలీసులకు..
కాంప్లెక్స్ పనులు మొదలు కాకపోవడంతో ఖాళీగా ఉన్న 20 ఎకరాలను పోలీసు శాఖ తీసేసుకుంది. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్పక్కనే ఈ 20 ఎకరాల స్థలం ఉండడంతో తమ భవిష్యత్ అవసరాలకు అవసరమని పోలీసులు చెప్తున్నారు.
ఏడాది కిందట సింగరేణి ప్రభుత్వానికి అప్పగించిన 20 ఎకరాల స్థలం చుట్టు పోలీసులు కాంపౌండ్‌వాల్ కూడా కట్టుకున్నారు. దీంతో క్రీడాకారుల ఆశలు నిరాశే అయ్యాయి. స్పోర్ట్స్‌కాంప్లెక్స్ నిర్మాణానికి మరోచోట ల్యాండ్ సేకరించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్తున్నారు.
పదేండ్లైనా పనులు కాలే
గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గానికో మినీ స్టేడియం నిర్మించాలని నిర్ణయించింది. అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో మినీ స్టేడియాల నిర్మాణాలకు ఇల్లెందులో శంకుస్థాపన చేశారు. ఒక్కో స్టేడియానికి రూ. 2.50కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే కొంతకాలానికే అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం మినీ స్టేడియాలకు ల్యాండ్స్ చూడాలని ఆఫీసర్లను ఆదేశించింది.
పాల్వంచ, ఇల్లెందు, మణుగూరులో ల్యాండ్స్ఫైనల్ చేశారు. అశ్వారావుపేటలో ల్యాండ్ చూసినప్పటికీ నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఆ ల్యాండ్‌ను అధికారులు పట్టణ ప్రగతిలో భాగంగా తీసుకున్నారు. తిరిగి రెండు వారాల కిందటే స్టేడియం కోసం ల్యాండ్ కేటాయించారు. భద్రాచలం నియోజకవర్గంలో మాత్రం ఏండ్లు గడుస్తున్నా స్థల సేకరణ పూర్తి కాలేదు.
పాల్వంచలో రూ. 70లక్షలతో, పినపాకలో రూ. 1.18 కోట్లతో, ఇల్లెందులో రూ. 65లక్షల అంచనాలతో పనులు ప్రారంభించారు. అరకొర నిధులు మాత్రమే ఇవ్వడంతో మూడు చోట్లా పనులు అంతంమాత్రంగానే జరిగాయి. ఇటీవలి కాలంలో పాల్వంచ మినీ స్టేడియం నిర్మాణ పనులను ఆఫీసర్లు స్పీడప్ చేశారు. మరో రెండు మూడు నెలల్లో ఇక్కడ పూర్తి అవుతాయని అధికారులు చెప్తున్నారు. జిల్లాలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌తో పాటు మినీ స్టేడియాలను త్వరిత గతిన పూర్తి చేసేందుకు అవసరమైన ఫండ్స్ కోసం జిల్లాలోని ప్రజాప్రతినిధులు కృషి చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు.