నత్తనడకన ఆర్వోబీ పనులు

 నత్తనడకన ఆర్వోబీ పనులు
  • పెద్దపల్లి, కునారం రోడ్డులో ప్రయాణికుల అవస్థలు 
  • రెండేళ్లు పూర్తవుతున్నా సగం కూడా పూర్తి కాని పనులు

పెద్దపల్లి, వెలుగు:  పెద్దపల్లి, కునారం రోడ్‌‌లో చేపట్టిన ఆర్వోబీ నిర్మాణం నత్తనడకన సాగుతోంది. 2022 డిసెంబర్‌‌‌‌లో  రూ. 119 కోట్లతో పనులు ప్రారంభం కాగా..   ఇప్పటి వరకు సగం పనులు కూడా పూర్తి కాలేదు.  డీపీఆర్​ప్రకారం కాంట్రాక్టర్​ బ్రిడ్జి నిర్మాణాన్ని రెండేండ్లలో పూర్తి చేయాలి.  ప్రస్తుతం సాగుతున్న పనులు చూస్తుంటే మరో మూడు సంవత్సరాలైనా పూర్తయ్యేలా కనిపించడం లేదు. 

​ 2009–14 మధ్య  డాక్టర్ గడ్డం వివేక్​ వెంకటస్వామి ఎంపీగా ఉన్న  టైంలోనే పెద్దపల్లి, కునారం ఆర్వోబీని నిర్మాణం కోసం ప్రపోజల్స్​ కేంద్ర ప్రభుత్వానికి పంపించారు.  2014  నుంచి 2022  టైంలో  బ్రిడ్జి  నిర్మాణానికి ఆనాటి బీఆర్​ఎస్​ సర్కార్​సహకరించలేదనే ఆరోపణలున్నాయి.  

బ్రిడ్జితో దూరం  తగ్గుతుంది...

పెద్దపల్లి, కునారం ఆర్వోబీ పూర్తయితే పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్​ జిల్లాలకు మధ్య దూరం తగ్గిపోతుంది.  పెద్దపల్లి మీదుగా కునారం రోడ్​ నుంచి జమ్మికుంట, హుజురాబాద్, వరంగల్​వరకు ప్రయాణాలు సాగుతున్నాయి.  పెద్దపల్లి నుంచి కునారం, ముత్తారం మీదుగా భూపాలపల్లి జిల్లాకు వాహనాలు నడుస్తున్నాయి. పెద్దపల్లి నుంచి ముత్తారం మీదుగా భూపాలపల్లికి ఫోర్​లైన్​రోడ్డు మంజూరైంది.  ఆ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.  

పెద్దపల్లి నుంచి కాల్వ శ్రీరాంపూర్ , హుజురాబాద్​ మీదుగా వరంగల్​ వరకు ఫోర్​లైన్​ రోడ్డుకు గ్రీన్​ సిగ్నల్​ రావడంతో పెద్దపల్లి, కునారం ఆర్వోబీకి ప్రాధాన్యం పెరిగింది.  ఇక్కడ ఉన్న రైల్వే గేట్​ దాదాపు గంట సేపు వేస్తున్నారు.  దీంతో వేలాది వాహనాలు నిలిచిపోతున్నాయి. గేట్ తీసిన తర్వాత వాహనాలు మొత్తం ఒకేసారి పెద్దపల్లి పట్టణంలోకి  ప్రవేశిస్తుండటంతో  ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది.  వెంటనే ఆర్వోబీ  నిర్మించి ప్రయాణికుల సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. 

సరైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేవు

ఆర్వోబీ నిర్మాణ పనులు మొదలు కాకముందే వాహనాల రాకపోకలకు సరైన ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలి. కానీ నామమాత్రంగా పక్కన చిన్న మార్గం ఏర్పాటు చేసి గేటు పెట్టారు.  ఈ చిన్న తోవలోనే వేలాది వాహనాలు వెళుతున్నాయి.  పెద్దపల్లి  రైల్వే స్టేషన్​కు ఈ  గేటు దగ్గరలో ఉండటంతో  స్టేషన్​లో  రైలు ఇంజన్లు సెట్టింగ్ చేస్తుంటారు.  

గేటు వేశారంటే  గంట దాకా తీయడం లేదు. దీంతో  వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతున్నాయి.  గేటుకు అవతల వైపున ఉన్న గ్రామాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే సరైన టైంకు హాస్పిటల్‌‌కు తీసుకుపోలేకపోతున్నారు. గతంలో చాలామంది గేటు వద్దనే ప్రాణాలు కోల్పోయారు.  ఇప్పటికైనా సర్కార్​ స్పందించి  రైల్వే ఓవర్ బ్రిడ్జి  పనులను వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.