- అర్ధరాత్రి టైంలో ఎక్కడబడితే అక్కడ డంపింగ్
- ఖర్చు తగ్గించుకునేందుకు ప్రైవేట్వెహికల్స్ను ఆశ్రయిస్తున్న జనం
- పేద, మధ్య తరగతి వారు రీసైక్లింగ్ ప్లాంట్లకు పంపట్లే
- టన్నుకు రూ.405 బల్దియా రేటు చాలా ఎక్కువంటున్న సిటిజన్లు
హైదరాబాద్, వెలుగు:సిటీలోని భవన నిర్మాణ వ్యర్థాల రీ సైక్లింగ్ ప్లాంట్లను జనం పెద్దగా ఉపయోగించుకోవడం లేదు. ఖర్చు తగ్గించుకునేందుకు అర్ధరాత్రి తర్వాత కన్స్ట్రక్షన్సైట్కు దూరంగా రోడ్ల వెంట, ఖాళీ స్థలాల్లో వ్యర్థాలను పారబోస్తున్నారు. జీహెచ్ఎంసీ వెహికల్లో తరలించాలంటే టన్నుకు రూ.405 కట్టాల్సి ఉంది. అంత పెట్టలేనివారు ప్రైవేట్ వెహికల్స్ ను ఆశ్రయిస్తున్నారు. టన్నుకు రూ.100 ఇచ్చి రోడ్ల వెంట డంప్ చేస్తున్నారు. నిర్మాణ వ్యర్థాలు ఎక్కడబడితే అక్కడ పారబోయకుండా ఉండాలనే ఉద్దేశంతో బల్దియా ఫతుల్లాగూడ, జీడిమెట్లలో ఏర్పాటు చేసిన ప్లాంట్లు ఉపయోగపడడం లేదు. మొన్నటివరకు ఒక్కో టన్నుకి రూ.342 తీసుకున్న బల్దియా అధికారులు ఇప్పుడు రూ.405 వసూలు చేస్తున్నారు. ఒక చిన్న ఇంటిని కూల్చి దాని స్థానంలో కొత్త ఇల్లు కట్టాలంటే నిర్మాణ వ్యర్థాలను తరలించేందుకే రూ.30 వేల వరకు ఖర్చు అవుతోందని, వ్యర్థాల తరలింపు రేటును తగ్గిస్తే బాగుటుందని జనం అంటున్నారు. లేకపోతే వ్యర్థాలతో తయారు చేస్తున్న టైల్స్ ను తక్కువ ధరకు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
డైలీ 3 వేల టన్నులు
గతంలో గ్రేటర్ వ్యాప్తంగా రోజూ మూడు వేల టన్నులకు పైగా భవన నిర్మాణ వ్యర్థాలు వచ్చేవి. వాటిని ప్రాసెస్చేసేందుకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంది. ప్రత్యేక వాహనాలు పెట్టి ఫోన్చేస్తే వచ్చి తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేసింది. జీడిమెట్ల, ఫతుల్లాగూడలో ప్రైవేట్ సంస్థ రాంకీ భాగస్వామ్యంతో డైలీ 500 టన్నుల కెపాసిటీ తో రెండు రీసైకిలింగ్ ప్లాంట్లను పెట్టింది. కెపాసిటీకి మించి వ్యర్థాలు వస్తుండడంతో రాంకీకి కూడా ఆదాయం ఎక్కువైంది. నెలకు దాదాపు రూ.7 నుంచి 8 కోట్లు వస్తున్నట్లు సమాచారం. మరో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించినప్పటికీ ఇంకా పనులు పూర్తికాలేదు.
రీ యూజ్ మెటీరియలే ఎక్కువ
గ్రేటర్ లోని వివిధ ప్రాంతాల నుంచి కలెక్ట్చేసిన భవన నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ ప్లాంట్లకు తరలిస్తారు. అక్కడ సన్న ఇసుక, దొడ్డు ఇసుక, కంకర, రాయి ఇలా ఒక్కోదాన్ని సపరేట్ చేస్తారు. అయితే నిర్మాణ వ్యర్థాల్లో 80 – 20 సైజు కంకర 30 శాతం, ముడి ఇసుక 20 శాతం, ముతక ఇసుక 20 శాతం, దొడ్డు కంకర 25 శాతం ఉత్పత్తి అవుతున్నాయి. వాటితో రాంకీ సంస్థ పార్కింగ్ టైల్స్, ఫుట్ పాత్ టైల్స్ తయారు చేస్తోంది. అయితే ఉన్న రెండు ప్లాంట్లు పేద, మధ్యతరగతి వారు వినియోగించుకోకపోవడంతో ఇది కేవలం ప్రైవేట్సంస్థ వ్యాపార కేంద్రంగా మారింది.