మహాముత్తారం, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం ఎంపీడీవో ఆఫీస్ నిర్మాణ పనులు ఏళ్లు గడుస్తున్నా పూర్తికావడం లేదు. దీంతో అది పశువుల కొట్టంలా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు అంతస్తుల్లో బిల్డింగ్ నిర్మించేందుకు రూ.కోటి సాంక్షన్ చేశారు. దీంతో బిల్డింగ్ నిర్మాణానికి 2016 అక్టోబర్ 22న అప్పటి ఎమ్మెల్యే పుట్ట మధు శంకుస్థాపన చేశారు. తర్వాత పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ స్లాబ్ వరకు వేసి ఆ తర్వాత వదిలేశారు.
ఏడేండ్లుగా గడుస్తున్నా పనులు ముందుకు కదడం లేదు. ఆఫీసర్లు కాంట్రాక్టర్‌కు ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో నిధులు వాపస్ పోయాయి. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు ఆఫీసర్లు మళ్లీ ప్రపోజల్స్ పంపినా ఫండ్స్ విడుదల కావడం లేదు. దీంతో స్థానిక రైతులు ఆ స్లాబ్ కింద తమ పశువులను కట్టేసుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేసి ఆఫీస్‌ను పూర్తి చేయాలని ప్రజల కోరుతున్నారు.