భద్రాచలం, వెలుగు: గోదావరిపై భద్రాచలం వద్ద నిర్మిస్తున్న రెండో బ్రిడ్జి పనులు చివరి దశకు చేరుకున్నాయి. అధికారుల అంచనా మేరకు వచ్చే ఆగస్టు చివరి నాటికి బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ముమ్మరంగా పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం పిల్లర్లపై గెడ్డర్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావొచ్చింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నేషనల్ హైవే ఇంజనీర్లే రంగంలోకి దిగి పనులు చేయిస్తున్నారు. 36 పిల్లర్లపై అడ్డంగా భీమ్ గెడ్డర్ల ఏర్పాటు చేస్తున్నారు. కాంట్రాక్టర్కు విధించిన పెనాల్టీ సొమ్ముతోనే నేషనల్ హైవే ఇంజనీర్లు చకచకా పనులు కానిచ్చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేస్తామని వారు చెప్తున్నారు.
ఎనిమిదేళ్ల క్రితం పనులు షురూ..
ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను అనుసంధానం చేసే భద్రాచలం గోదావరి రెండో బ్రిడ్జి నిర్మాణం పనులు 2015 ఏప్రిల్నెలలో షురూ అయ్యాయి. రూ.100కోట్ల వ్యయంతో టెండర్లు పిలిస్తే ముంబైకి చెందిన రాజ్ దీప్ సంస్థ రూ.65 కోట్లకు టెండర్లు దక్కించుకుంది. అలసత్వంతో పాటు కోవిడ్ తదితర కారణాలతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. తదనంతరం స్టీల్, సిమెంట్ఇతర సామగ్రి ధరలు పెరిగాయి. నిర్మాణ వ్యయం భారంగా మారడంతో సదరు కాంట్రాక్టర్పనులు చేయలేనని చేతులెత్తేశారు. నాలుగు సార్లు రాజ్దీప్ సంస్థకు నోటీసులు జారీ చేసిన నేషనల్హైవే ఇంజనీర్లు రూ.6.50కోట్ల పెనాల్టీ విధించి వసూలు చేశారు. అదీ కాకుండా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాల్సిన బాధ్యత కాంట్రాక్ట్ సంస్థదే కాబట్టి నాలుగో నోటీసు జారీ చేశారు. దీని కాల వ్యవధి కూడా గతేడాది డిసెంబర్తోనే ముగిసింది. ఐదోసారి గడువు పెంచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే పూర్తిగా కాంట్రాక్ట్ రద్దు కాకపోవడంతో రాజ్ దీప్ సంస్థతోనే మిగిలి ఉన్న 15 శాతం పనులు పూర్తి చేయించేందుకు నేషనల్ హైవే ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా వచ్చే నాలుగు నెలల్లో వంతెనను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఎన్ హెచ్ ఇంజనీర్లు ముందుకు వచ్చి పనులు చేయిస్తున్నారు.
నిధుల్లేకున్నా వేగంగా చేయిస్తున్నాం..
నిధుల కొరత ఉంది. అయినా బ్రిడ్జి నిర్మాణం పనులు వేగంగా చేయిస్తున్నాం. గెడ్డర్ల ఏర్పాటు పూర్తి అవుతోంది. ఇంకా 10 నుంచి 15శాతం పనులే మిగిలి ఉన్నాయి. వాటిని కూడా త్వరగా పూర్తి చేసి బ్రిడ్జిని అందుబాటులోకి తెస్తాం.–యుగంధర్, ఎన్ హెచ్
ఈఈ త్వరగా పూర్తి చేయాలె...
గోదావరిపై నిర్మిస్తున్న రెండో వంతెన పనులు జల్ది కంప్లీట్ చేయాలె. నేషనల్ హైవే ఇంజనీర్లు స్వయంగా పనులు పరిశీలించాలి. ఇప్పటికే గడువులు దగ్గర పడ్డయి. ఇంకా గడువులు తీసుకోవద్దు. ఇప్పటికే విపరీతమైన ట్రాఫిక్ పెరిగింది. నిర్మాణం ఆలస్యం కావడం దురదృష్టకరం.– పొదెం వీరయ్య, ఎమ్మెల్యే, భద్రాచలం