
మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ జిల్లాలో చేపట్టిన గ్రామపంచాయతీ బిల్డింగ్‌ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన నిధులు సరిపోవడం లేదంటూ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. మరికొన్ని గ్రామాల్లో స్థలాలు దొరకడం లేదు. దీంతో ఏళ్లు గడుస్తున్నా పంచాయతీ బిల్డింగ్‌లు మాత్రం పూర్తి కావడం లేదు.
28 గ్రామాల్లోనే పూర్తైన పనులు
మహబూబాబాద్ జిల్లాలోని 57 గ్రామ పంచాయతీలకు కొత్త బిల్డింగ్‌లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2016 – -17 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో పంచాయతీ బిల్డింగ్ నిర్మాణానికి ఈజీఎస్ కింద రూ. 13 లక్షలు కేటాయించారు. అవి సరిపోక పనులు ఆగిపోవడంతో మరో రూ. 3 లక్షల చొప్పున కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం మెటీరియల్ కాస్ట్ పెరిగిపోవడంతో ఈ నిధులు సైతం సరిపోవడం లేదంటూ పనులు ఆపేశారు. దీంతో ఇప్పటివరకు 28 గ్రామాల్లోనే పనులు పూర్తి కాగా, 13 చోట్ల వివిధ దశల్లో ఉన్నాయి. మిగతా 16 గ్రామాల్లో అసలు పనులే ప్రారంభం కాలేదు. కొన్ని గ్రామాల్లో బిల్డింగ్ నిర్మాణ పనులు పూర్తైనా బిల్లులు మాత్రం అందలేదు.
పాత బిల్డింగ్‌లతో అవస్థలు
పాత బిల్డింగ్‌లు శిథిలావస్థకు చేరడం, సౌకర్యాలు సరిగా లేకపోవడంతో ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక పంచాయతీల వద్ద తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేదు. వర్షాకాలంలో పాత బిల్డింగ్‌లు కురుస్తుండడంతో పంచాయతీకి సంబంధించిన ఫైల్స్ తడిసిపోతున్నాయని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. పంచాయతీ సమావేశాలు, గ్రామ సభల నిర్వహణకు స్థలం లేకపోవడంతో ఖాళీ ప్రదేశాలను వెతుక్కోవాల్సి వస్తోందని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్డింగ్‌ల నిర్మామాలకు మంత్రితో పాటు, ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నారు.
పెండింగ్ పనులను పూర్తి చేయాల్సిందే..
గ్రామ పంచాయతీల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి. పెండింగ్ బిల్లులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుం టాం. మెటీరియల్ కాస్ట్ పెరగడం, డిజైన్లలో మార్పులు చేయడం వల్ల కొన్ని చోట్ల పనులు ముందుకు సాగడం లేదు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం.
- సురేశ్, పంచాయతీ రాజ్ ఈఈ, మహబూబాబాద్