- 12 గ్రామాల్లో మొదలు కాని నిర్మాణాలు
- ఏడాది కింద 171 భవనాలు మంజూరు
- ఒక్కో బిల్డింగ్కు రూ.20 లక్షలు సాంక్షన్
- నత్తనడకన పనులు.. చాలాచోట్ల పునాదుల్లోనే..
- బిల్లుల భయంతో ముందుకు రాని సర్పంచులు
- స్కూళ్లు, అంగన్వాడీల్లో కొనసాగుతున్న జీపీలు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో గ్రామపంచాయతీ బిల్డింగుల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం వివిధ పథకాల కింద జిల్లా వ్యాప్తంగా 171 జీపీ బిల్డింగులను సాంక్షన్ చేసి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు ఒక్కటీ పూర్తి కాలేదు. స్థలం కేటాయింపులో ఆలస్యం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పనులు స్లోగా జరుగుతున్నాయి.
వీటిలో 12 పంచాయతీల్లో జాగల్లేక బిల్డింగుల పనులు ఇంకా మొదలు పెట్టలేదు. మిగతా చోట్ల వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ప్రతి పంచాయతీకి పక్కా బిల్డింగ్ఉండాలనే ఉద్దేశంతో ఫండ్స్ మంజూరు చేసినప్పటికీ పనులు చేయడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రతి పంచాయతీలో పక్కా భవనం ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిరుడు జిల్లాలో 171 జీపీ బిల్డింగులను సాంక్షన్ చేసింది. ఉపాధిహామీ పథకం కింద 151, ఐటీడీఏ ద్వారా ఎస్టీ సబ్ప్లాన్కింద 16, రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్(ఆర్ జీఎస్ఏ) కింద మరో 5 బిల్డింగులు మంజూరయ్యాయి. ఒక్కో బిల్డింగ్కు ప్రభుత్వం రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.34.20 కోట్లు కేటాయించింది. వీటిలో సర్పంచ్, సెక్రటరీలకు వేర్వేరు రూమ్లు, రికార్డ్ రూమ్, మీటింగ్హాల్, టాయ్లెట్లతో పాటు అన్ని సౌలత్లు ఉండేలా డిజైన్ చేసింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగాలకు నిర్మాణ బాధ్యతలను అప్పగించింది.
అధ్వానంగా జీపీ ఆఫీసులు
జిల్లాలో మొత్తం 311 గ్రామపంచాయతీలు ఉండగా, 164 జీపీలకు మాత్రమే సొంత బిల్డింగులున్నాయి. ఇందులో 20కి పైగా శిథిలావస్థకు చేరుకున్నాయి. కొత్త జీపీల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది.
చాలాచోట్ల గ్రామాల్లోని స్కూళ్లు, అంగన్వాడీ సెంటర్లు కిరాయి ఇండ్లలో నడిపిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో రేకులతో చిన్నపాటి షెడ్లు కట్టి కొన్నేండ్లుగా అందులోనే నిర్వహిస్తున్నారు. వీటిలో వాటర్సప్లై, టాయ్లెట్లు వంటి సౌలత్లు లేకపోగా.. సర్పంచ్, సెక్రటరీలకు సపరేట్ రూంలు కూడా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరుబయట చెట్ల కింద గ్రామసభలు నిర్వహిస్తూ పాట్లు పడుతున్నారు.
ముందుకు రాని సర్పంచులు
బెల్లంపల్లి మండలంలో 11 జీపీ బిల్డింగులు నిరుడు జనవరిలో మంజూరయ్యాయి. ఈజీఎస్ ద్వారా పనులు చేపట్టాల్సి ఉండగా సర్పంచులు ఎవరూ ముందుకు రాలేదు. బుచ్చయ్యపల్లి, లింగాఫూర్, చాకెపల్లి, చంద్రవెల్లి, బట్వాన్ పల్లి, అంకుశం గ్రామాల్లో ఇప్పటివరకు ఎలాంటి కదలిక లేదు. దుగినెపల్లి, కన్నాల, తాళ్లగురిజాల, లంబడితండా గ్రామాల్లో కేవలం పునాదుల తవ్వడం వరకే పనులు పరిమితమయ్యాయి. సర్పంచుల పదవీకాలం ఈ నెలతో ముగియనుంది. గ్రామాల్లో చేపట్టిన వివిధ పనులకు సంబంధించిన బిల్లులను గత ప్రభుత్వం ఇవ్వకపోవడంతో జీపీ బిల్డింగుల పనులు చేపట్టేందుకు సర్పంచులు ముందుకు రాలేదు. చెన్నూర్ మండలంలో ఏడు బిల్డింగులు మంజూరయ్యాయి. పనులు స్టార్ట్చేసినప్పటికీ ప్రోగ్రెస్ మాత్రం కనిపించడం లేదు. 8 నెలలుగా బేస్మెంట్ దశలోనే పనులు ఉన్నాయి.
త్వరలోనే పూర్తిచేస్తాం
జిల్లాలోని 171 గ్రామపంచాయతీలకు పక్కా భవనాలు మంజూరయ్యాయి. ఒక్కో బిల్డింగ్కు ప్రభుత్వం రూ.20లక్షల చొప్పున కేటాయించింది. 12 గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు లేకపోవడంతో పనులు మొదలు కాలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. మిగతా వాటిని త్వరలోనే
పూర్తి చేస్తాం.
– డీపీవో వెంకటేశ్వర్రావు, మంచిర్యాల
స్లోగా పనులు
జిల్లావ్యాప్తంగా జీపీ బిల్డింగుల నిర్మాణ పనులు స్లోగా జరుగుతున్నాయి. ఆర్జీఎస్ఏ ద్వారా మంజూరైన ఐదింటిలో నాలుగు పూర్తికాగా, ఈజీఎస్ కింద మంజూరైన వాటిలో కొన్ని చివరి దశకు చేరుకున్నాయి. ఇంకా చాలా చోట్ల పునాదులు, పిల్లర్లు, స్లాబ్దశలోనే కొనసాగుతున్నాయి. 12 గ్రామాల్లో ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడంతో ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. వీటిలో దండేపల్లి మండలంలో నెల్కివెంకటాపూర్, నర్సాపూర్, నాగసముద్రం, తాళ్లపేట, మాకులపేట, ముత్యంపేటలో పెండింగ్లో ఉన్నాయి.
అలాగే చెన్నూర్ మండలం చింతలపల్లి, జన్నారం మండలం బంగారుతండా, లింగాయపల్లి, కోటపల్లి మండలం ఎసన్వాయి, మందమర్రి మండలం ఆదిల్పేట, వేమనపల్లి మండలం ముల్కలపేటతో పాటు నెన్నెల మండలంలో స్థలాల సమస్య ఉంది. జన్నారం మండలం లింగయ్యపల్లె, బంగారుతండాకు పంచాయతీ భవనాలు మంజూరైనప్పటికీ ప్రభుత్వ స్థలాలు లేకపోవడంతో ఆ గ్రామాల్లో పనులు ప్రారంభించలేదు. స్థానిక గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్లలో పంచాయతీ ఆఫీసులు ఏర్పాటు చేసుకొని విధులు నిర్వహిస్తున్నారు.