- రెండో దశకు శంకుస్థాపన జరిగి మూడున్నరేళ్లు
- రూ.36 కోట్లతో గతంలోనే పరిపాలనా అనుమతులు
- కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ముందుకు సాగని పనులు!
ఖమ్మం, వెలుగు: ఖమ్మంలో ఐటీ హబ్ ఫేజ్ 2 నిర్మాణ పనులు ముందుకు పడడం లేదు. గత ప్రభుత్వ హయాంలో మూడున్నరేళ్ల కింద పరిపాలనా అనుమతులు మంజూరు చేసినా, అప్పుడే శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు పనులు జరగడం లేదు. హైదరాబాద్ కాకుండా ఇతర జిల్లాలకు కూడా ఐటీ రంగాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో ఐటీ హబ్ లను మొదలుపెట్టారు. ఐటీ హబ్ ఫేజ్1 లో వివిధ ప్రైవేట్ సంస్థలను ఏర్పాటు చేసి వందలాది మంది యువతీయువకులకు ఉద్యోగాలు లభించడంతో, ఫేజ్ 2పై ఆసక్తి నెలకొంది.
కంప్లీట్ అయితే మరో 1500 మందికి ఉద్యోగాలు..
ప్రస్తుతం ఉన్న ఐటీ హబ్ ను 2020 డిసెంబర్ 7న అప్పటి ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఖమ్మం ఐటీ హబ్ లో 16 కంపెనీలు వర్క్ చేస్తుండగా, మూడు షిఫ్టుల్లో కలిపి దాదాపు వెయ్యి మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్టు సమాచారం. దానికి కొనసాగింపుగా 2021 మార్చి 15న ఐటీ హబ్ ఫేజ్ 2 పనులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.36 కోట్లతో 55 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో బిల్డింగ్ నిర్మాణం కోసం పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది.
ఇందులో ఒకేసారి 550 మంది పనిచేసేలా, మూడు షిఫ్టుల్లో కనీసం 1500 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అదే ఏడాది ఏప్రిల్ 2న ఫేజ్ 2 నిర్మాణానికి అప్పటి మంత్రులు ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ తో కలిసి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఫేజ్ 2 నిర్మాణం కోసమే ప్రస్తుతం ఐటీ హబ్ ప్రాంగణాన్ని ఆనుకొని ఉన్న రైతు బజార్ ను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. సమీపంలోనే ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను కొత్తగా నిర్మించి, అక్కడికి కూరగాయల వ్యాపారులను తరలించారు. ఆ తర్వాత పిల్లర్లు వేయగా, అక్కడితోనే పనులకు బ్రేక్ పడింది. దాదాపు మూడేళ్లు దాటుతున్నా పనులు ముందుకు సాగడం లేదు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. అధికారులు పట్టించుకోవట్లే!
రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్టర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ఆధ్వర్యంలో ఐటీ హబ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు. మూడేళ్ల కింద టెండర్లు పూర్తి చేసి, పనులను అప్పగించినా ఇంత వరకు పిల్లర్ల దశను దాటలేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి తోడు, అధికారులు కూడా పట్టించుకోకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది.
ఏడాదిలో నిర్మాణాన్ని పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు టార్గెట్ పెట్టినా, ఆ గడువు దాటి రెండేళ్లు గడుస్తున్నా సంబంధిత అధికారులు పర్యవేక్షించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసుకుంటున్న వారికి స్థానికంగానే ఉద్యోగాలు లభించే మంచి అవకాశం కోల్పోతున్నారన్న అభిప్రాయాలున్నాయి. దీనిపై ఖమ్మం నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ చూపిస్తే విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.