- నిధులు లేక ముందుకు కదలట్లే
- గత సర్కారు నిర్వాకంతో జాప్యం
జనగామ, వెలుగు : జనగామ ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్ నిర్మాణ పనులు ఆగి పోయాయి. జిల్లా కేంద్రంలోని దయానిలయం సమీపంలో నాలుగేండ్ల కింద మొదలైన పనులు ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. గత సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంగా జనగామ వృద్ధి చెందుతుండడంతో అన్ని రకాల కూరగాయలు, మాంస విక్రయాలు ఒకే చోట అందుబాటులోకి తేవాలనే లక్ష్యం నేటికీ నెరవేరడం లేదు.
స్లోగా పనులు
సిద్ధిపేట మోడల్ మార్కెట్ తరహాలో జనగామలో కూడా మార్కెట్ ఏర్పాటు చేయాలని గత పాలకులు నాలుగేండ్ల క్రితం శంకు స్థాపన చేశారు. అయినా నేటికీ పూర్తి కావడం లేదు. జనగామ టౌన్ దినదినం అభివృద్ధి చెందుతుండడంతో జనాభా సుమారు లక్ష ను దాటినట్లు అంచనాలు ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగా మోడల్ మార్కెట్ ఉంటుందని గత పాలకులు చెప్పుకొచ్చారు. కానీ ఆచరణలో మాత్రం భిన్నంగా ఉంది.
పనులు పెండింగ్
బిల్డింగ్ నిర్మాణం యేడాది క్రితం పూర్తైనప్పటికీ లోపల చేపట్టాల్సిన వెజ్ 43, నాన్ వెజ్ 60 స్టాల్స్ పనుల పూర్తి పై పట్టింపు లేకుండా పోయింది. ఇదిలా ఉంటే తొలుత ఈ మార్కెట్ నిర్మాణానికి రూ రెండు కోట్లు మంజూరు అయ్యాయి. కానీ పలుమార్లు దీని డిజైన్ లను అప్పటి ఆఫీసర్లు. ప్రజా ప్రతినిధులు మార్పులు చేశారు. దీంతో సదరు నిధులు సరిపోవని అప్పట్లోనే మున్సిపల్ అధికారులు అదనంగా మరో రెండున్నర కోట్లకు ప్రతిపాదనలు పంపించి మంజూరు చేయించారు. అంచనాలు డబుల్ అయినప్పటికీ పనులు మాత్రం పూర్తికావడం లేదు. మాటలకు చేతలకు పొంతన లేకుండా వ్యవహరించిన గత సర్కారు తీరే ఇందుకు కారణంగా మారింది.
ఎక్కడ పడితే అక్కడ
జనగామ టౌన్లో కూరగాయాలు, మాంసం ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు. రోడ్లు, గల్లీల్లో పరదాలు పరిచి వ్యాపారాలు చేస్తున్నారు. మాంసం విక్రయాల డబ్బాలు దాదాపుగా డ్రైనేజీల పైనే ఉంటున్నాయి. ఈ పరిస్థితి నుంచి మార్పు తేవాలని చేపడుతున్న మోడల్ మార్కెట్ నేటికీ అందుబాటులోకి రావడం లేదు. రోడ్ల పై అమ్మకాలతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. బస్టాండ్ ఏరియా, సిరాజ్ ఫ్రూట్స్ సమీపం, రైల్వే స్టేషన్ పరిసరాలు, జనగామ చౌరస్తా నుంచి సిద్ధిపేట రోడ్డు, ఇలా పలు చోట్ల రోడ్ల పై పరదాలు పరచి కూరగాయలు అమ్ముతున్నారు. చిన్న రోడ్లు ఉన్న చోట దుకాణాల ముందు అమ్మకాలతో ట్రాఫిక్ నరకం కనిపిస్తోంది. ఇప్పటికైనా పనులు పూర్తి చేసి మార్కెట్ ను ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు.
పనుల పూర్తికి చర్యలు
మోడల్ మార్కెట్ పనులు త్వరలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. రూ నాలుగున్నర కోట్లతో జరుగుతున్న ఈ పనుల్లో కోటిన్నర వరకు నిధులు విడుదల కాగా చెల్లింపులు చేశాం. వెజ్, నాన్ వెజ్ అమ్మకాలు ఒకే చోట ఉండేలా మార్కెట్ అందుబాటులోకి తెస్తాం.
– పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్, జనగామ