- నిధుల కొరతతో ముందుకు సాగని లిప్ట్ పథకం
- ఆగిన పంప్‌హౌస్, పైప్‌లైన్ నిర్మాణాలు
హాలియా, వెలుగు: నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలంలో 24,886 ఎకరాల బీడు భూములకు సాగు నీరందించేందుకు రూ.692 కోట్లతో చేపట్టిన నెల్లికల్లు లిఫ్ట్ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. పంప్‌హౌస్, పైప్‌లైన్ నిర్మాణ పనుల్లో మరింత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. 2021లో జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ నెల్లికల్లు లిఫ్ట్ పథకాన్ని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం కేసీఆర్ స్వయంగా ఇక్కడికొచ్చి లిఫ్ట్ నిర్మాణానికి నాగార్జున సాగర్ వద్ద పునాది రాయి వేశారు. ఆ తర్వాత పనులు ప్రారంభమయ్యాయి.
వరద నీటితో పనుల్లో ఆలస్యం...
గతేడాది కృష్ణా నదికి భారీగా వరద రావడంతో లిఫ్టు పనులకు ఆటంకం కలిగింది. నెల్లికల్లు లిఫ్ట్ నిర్మాణ కెపాసిటీని పెంచడంతో మరికొంత ఆలస్యం జరిగింది. 2021 ఫిబ్రవరి నెలలో సీఎం కేసీఆర్ నెల్లికల్లు లిఫ్ట్ శంకుస్థాపన సందర్భంగా రూ.72.16 కోట్ల వ్యయంతో 4,175 ఎకరాలకు భూమికి సాగు నీరు ఇచ్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
అనంతరం లిఫ్ట్ సామర్థ్యం, నిర్మాణ వ్యయం పెంచితే కృష్ణపట్టె ప్రాంతంతో పాటు తిరుమలగిరి (సాగర్) మండలం మొత్తం పూర్తిస్థాయిలో సాగులోకి వచ్చే అవకాశం ఉందని తెలంగాణ ప్రాంత విశ్రాంత ఇంజనీర్ల బృందం నియోజకవర్గంలో పర్యటించి సీఎం కేసీఆర్‌కు నివేదిక అందించారు. అప్పటి సీఎం కేసీఆర్ ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పడంతో తిరిగి అంచనాలు తయారు చేశారు.
దీంతో నెల్లికల్లు లిఫ్ట్ నిర్మాణ వ్యయాన్ని రూ.72.16 కోట్ల నుంచి రూ.692 కోట్లకు పెంచారు. ఆయకట్టు సాగు విస్తీర్ణాన్ని సైతం 4,175 ఎకరాల నుంచి 24,886 ఎకరాలకు పెంచుతూ ప్రతిపాదనలు తయారు చేశారు. లిఫ్ట్ రీడిజైన్ వల్ల, కృష్ణా నది వరద నీటి కారణంగా నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఏడాదిన్నర లోపే పూర్తి చేయకుంటే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి 2021 ఉప ఎన్నికల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో ప్రకటించారు. కానీ బీఆర్‌ఎస్ అధికారంలో ఉండి ఇటీవల జరిగిన ఎన్నికల వరకు లిప్ట్ పనులను పూర్తి చేయలేకపోయింది.
కృష్టపట్టె ప్రాంత రైతుల కల..
నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని కృష్ణ పట్టె గిరిజన ప్రాంతంలోని తిరుమలగిరి (సాగర్) మండలంలో ఉన్న వేలాది ఎకరాల బీడు భూములను సాగులోకి రావాలంటే కృష్ణా నదిపై లిప్ట్ పథకం ఏర్పాటు చేయాలని 30 ఏండ్లుగా గిరిజన ప్రాంత రైతులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూశారు. 2021 సంవత్సరంలో నెల్లికల్లు లిఫ్ట్ నిర్మాణానికి ప్రతిపాదనలు బీఆర్‌ఎస్ ప్రభుత్వం సిద్ధం చేసింది. పంప్ హౌస్ నిర్మాణం పూర్తి చేసి రెండు మోటార్లను బిగించాల్సి ఉంది. పంపు నుంచి గ్రామాల్లోని భూములకు పైపులైను వేయాల్సి ఉంది. అనంతరం పొలాలకు పంట కాలువలను నిర్మించాల్సి ఉంది.
కానీ నిధుల కొరత కారణంగా పంప్‌హౌస్ నిర్మాణ పనులు, పైప్ లైన్ ఏర్పాటు లాంటి పనులు నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో నే తిరిగి లిఫ్ట్ నిర్మాణ పనులను పునరుద్ధరించింది. లిఫ్ట్ పైపు లైను ఏర్పాటుకు అధికారులు సర్వే చేస్తున్నారు. నెల్లికల్లు, ఎర్ర చెరువు తండా వరకు పైప్ లైన్ నిర్మాణానికి అధికారులు ల్యాండ్ సర్వే చేస్తున్నారు. కృష్ణా నది ఒడ్డున ఉన్న పంప్ హౌస్ నుంచి సమీప నెల్లికలు ఎర్ర చెరువు తండా వరకు సుమారు 8 కిలోమీటర్ల వరకు పైప్ లైన్ వేసి అక్కడి నుంచి రైతుల పొలాలకు నేరుగా నీటిని తరలించేందుకు పంట కాలువలను ఏర్పాటు చేయాల్సి ఉంది.
నెల్లికల్ లిఫ్టు పనుల్లో వేగం పెంచండి
లిఫ్టు పంప్ హౌస్ తో పాటు పైప్ లైన్ ఏర్పాటు పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత శనివారం ఇరిగేషన్ అధికారులతో నాగార్జున సాగర్‌లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. నిధుల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సకాలంలో పథకం పూర్తయ్యేలా చూస్తానన్నారు.
ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి