- కలెక్టరేట్ పనులు కంప్లీట్ చేస్తలే...
- స్లోగా సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ పనులు
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట కలెక్టరేట్ బిల్డింగ్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ కలెక్టరేట్ శంకుస్థాపన తర్వాత మొదలైన చాలా కలెక్టరేట్ల పనులు పూర్తై ప్రారంభోత్సవం సైతం జరిగింది. కానీ సూర్యాపేట బిల్డింగ్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కలెక్టరేట్ నడుస్తున్న బిల్డింగ్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేది కావడం, ప్రతి నెలా భారీ మొత్తంలో రెంట్ వస్తుండడంతో కావాలనే కొత్త బిల్డింగ్ పనులు లేట్ చేస్తున్నారని ప్రతిపక్ష లీడర్లు ఆరోపిస్తున్నారు.
రెండేళ్లలోనే పూర్తి చేయాల్సి ఉన్నా...సూర్యాపేట జిల్లా ఏర్పడిన తర్వాత చివ్వెంల మండలం కుడకుడ వద్ద ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణం కోసం 2017 అక్టోబర్ 12న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.48 కోట్ల అంచనాతో 32 డిపార్ట్‌మెంట్ల కోసం జీ ప్లస్ 2తో కలెక్టరేట్ నిర్మిస్తున్నారు. వీటి పక్కనే కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ల క్యాంప్ ఆఫీస్‌లు, జిల్లా ఆఫీసర్ల కోసం మరో 8 క్వార్టర్స్ నిర్మిస్తున్నారు. అగ్రిమెంట్ ప్రకారం రెండేళ్లలోనే బిల్డింగ్ పూర్తి కావాల్సిన ఉంది. కానీ శంకుస్థాపన జరిగి ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు 70 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. ఇంకా ఆఫీస్ లోపల ఫినిషింగ్, మెయిన్ ఎంట్రెన్స్, సీసీ రోడ్లు, క్యాంప్ ఆఫీస్‌లను నిర్మించాల్సి ఉంది. దసరా నాటికి పనులు పూర్తి చేసి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాలని మంత్రి జగదీశ్‌రెడ్డి భావించినా మరో ఆరు నెలల వరకు పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదు. అయితే బిల్లులు ఇన్‌టైంలో అందకపోవడం వల్లే బిల్డింగ్ ఆలస్యం అవుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు.
నెలకు రూ. 6.50 లక్షల రెంట్
సూర్యాపేట కలెక్టరేట్ ప్రస్తుతం ఓ ఎమ్మెల్యేకు సంబంధించిన బిల్డింగ్‌లో నడుస్తోంది. దీనికి నెలకు రూ. 6.50 లక్షల రెంట్ కడుతున్నారు. దీంతో ప్రతి నెల భారీ మొత్తంలో రెంట్ వస్తుండడంతో కొత్త కలెక్టరేట్ పనులు కావాలనే ఆలస్యం చేస్తున్నారని ప్రతిపక్ష లీడర్లు ఆరోపిస్తున్నారు. కలెక్టరేట్ నిర్మాణం ప్రారంభమైన తర్వాత 2019లో మొదలైన మెడికల్ కాలేజీ, 2016లో మొదలుపెట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్, 2017లో స్టార్ట్ అయిన ఎస్పీ ఆఫీస్ నిర్మాణాలు ఇప్పటికే పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. అయినా ఐదేళ్ల కింద స్టార్ట్ అయిన కలెక్టరేట్ మాత్రం ఇప్పటివరకూ రెడీ కాలేదు. ఈ బిల్డింగ్ కూడా పూర్తయ్యాక అన్నింటినీ కలిపి ఒకేసారి ప్రారంభిస్తారన్న ప్రచారం జరుగుతోంది.
పనులు చివరి దశకు చేరుకున్నాయి
సూర్యాపేట కలెక్టరేట్ నిర్మాణ పనులు కరోనా కారణంగా ఆలస్యం అయ్యాయి. ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. ప్లాస్టింగ్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తాం.
మహిపాల్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ డీఈ, సూర్యాపేట