
జనగామ, వెలుగు: జనగామ జిల్లాలో పల్లె దవాఖాన్ల బిల్డింగ్నిర్మాణ పనులు స్లోగా సాగుతున్నాయి. జిల్లాలో గతేడాది 15 బిల్డింగ్లకు నిధులు మంజూరు కాగా.. నేటికీ పూర్తి కాలేదు. తాజాగా మరో 15 బిల్డింగ్ల నిర్మాణానికి నిధులు మంజూరు కాగా పాతవి పూర్తయ్యేదెన్నడో.. కొత్తవి మొదలు పెట్టేది ఎప్పుడో అని వైద్య వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఇదీ సంగతి..
జిల్లాలో మొత్తం 104 హెల్త్ సబ్ సెంటర్లు ఉన్నాయి. ఇందులో కేవలం 20 మాత్రమే సర్కారు బిల్డింగులలో కొనసాగుతున్నాయి. మిగిలినవన్నీ అద్దె భవనాల్లో నడిపిస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సర్కారు వీటిని పల్లె దవాఖాన్లుగా మార్చుతోంది. ఇప్పటివరకు 30 సబ్ సెంటర్లను పల్లె దవాఖాన్లుగా మార్చింది. వీటికి పక్కా భవనాలను నిర్మించేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గతేడాది 15 కొత్త బిల్డింగులకు నిధులు మంజూరు కాగా అవి నేటికీ పూర్తి కాలేదు.
నిర్లక్ష్యంగా పనులు..
పల్లె దవాఖాన్ల నిర్మాణాలను టీఎస్ ఎంఐడీసీకి అప్పగిస్తే పనులు లేట్ అవుతాయని భావించి, పంచాయతీ రాజ్శాఖకు అప్పగించారు. అయినా పనుల్లో మాత్రం పురోగతి లేదు. గతేడాది దేవరుప్పుల మండలంలోని చిన్న మడూరు, జనగామ మండలంలోని పెంబర్తి, వడ్లకొండ, బచ్చన్నపేట మండలంలోని కట్కూరు, కొన్నె, స్టేషన్ ఘన్పూర్ మండలంలోని నమిలిగొండ ఎస్సీ బస్తీ, సముద్రాల, కోమటిగూడెం, పాలకుర్తి మండలంలోని విస్నూరు, వావిలాల, ముత్తారం, చిల్పూరు మండలంలోని శ్రీపతిపల్లి, కొడకండ్ల మండలంలోని ఏడునూతుల, లక్ష్మక్కపల్లిలలో దవాఖాన నిర్మాణాలకు నిధులు మంజూరు అయ్యాయి. వీటిలో కేవలం 6 బిల్డింగ్ ల నిర్మాణం పూర్తి కావస్తుండగా మిగిలిన వాటి పనులలో తీవ్ర జాప్యం జరుగుతోంది. స్టేషన్ ఘన్పూర్ ఎస్సీ బస్తీ దవాఖాన ఇంకా బేస్ మెంట్ లెవల్ లోనే ఉంది. కోమటి గూడెం , నమిలిగొండ బిల్డింగ్ లు స్లాబ్ దశలో, సముద్రాల బిల్డింగ్ పిల్లర్ల దశలో ఉన్నాయి. మిగిలిన వాటి నిర్మాణాలు కూడా ఇంచుమించు ఇటువంటి దశల్లోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, ఒక్కో బిల్డింగ్ నిర్మాణానికి తొలుత రూ.16లక్షలు మంజూరు కాగా సదరు నిధులు సరిపోవడం లేదని అధికారులు పెట్టిన ప్రపోజల్స్ తో అదనంగా మరో రూ.4లక్షలు మంజూరయ్యాయి. మొత్తంగా ఒక్కో బిల్డింగ్ కు రూ.20లక్షల నిధులు వెచ్చిస్తున్నారు. పల్లె దవాఖానలో మూడు గదులు, ఒక స్టోర్రూం ఉండేలా డిజైన్ చేయగా 1020 చదరపు ఫీట్ల విస్తీర్ణంలో నిర్మాణం చేపడుతున్నారు.
మరో 15 బిల్డింగ్లకు నిధులు..
పాత సాంక్షన్ పనులు పూర్తికాక పోయినప్పటికీ ప్రస్తుతం అదనంగా మరో 15 పల్లె దవాఖాన బిల్డింగ్ లు సాంక్షన్ అయ్యాయి. ఇవి కూడా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోనే చేపట్టాల్సి ఉంది. వీటికిత్వరలో టెండర్లు పిలువనున్నారు. పాతవి పూర్తికాకపోవడంతో పల్లెల్లో పేదలకు వైద్యం సేవలు అందడం లేదు. వీటిని త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పల్లె దవాఖాన్లకు సంబంధించిన నియామకాలు కూడా కొనసాగుతున్నాయి.
ఆఫీసర్లను ఆదేశించాం..
జిల్లాలో గతేడాది 15 పల్లె దవాఖాన బిల్డింగ్లకు నిధులు మంజూరయ్యాయి. తాజాగా మళ్లీ మరో 15 బిల్డింగ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. గతేడాది మంజూరైన బిల్డింగ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. పనులను త్వరగా పూర్తి చేసి ఇవ్వాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు చెప్పాం.
– ఏ. మహేందర్, డీఎంహెచ్ఓ, జనగామ