ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల .. నిర్మాణ పనులు స్పీడప్​

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల  .. నిర్మాణ పనులు స్పీడప్​
  • ఒక్కో స్కూల్ కు రూ.200 కోట్ల చొప్పున 7 స్కూళ్లకు రూ.1400 కోట్ల నిధులు మంజూరు
  • తాజాగా ఉమ్మడి జిల్లాలో మరో మూడు స్కూళ్లు మంజూరు
  • నల్గొండ జిల్లాలో 4, సూర్యాపేటలో 3 స్కూళ్లు 

నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పనులు స్పీడప్ కానున్నాయి. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 28 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పనులకు సీఎం, మంత్రులు శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలో నల్గొండ, మునుగోడు నియోజకవర్గాలు, సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్, కోదాడ  నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు చేశారు. 

హుజూర్ నగర్, కోదాడ  నియోజకవర్గానికి గడ్డిపల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రోడ్డు, భవనలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నల్గొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఒకే రోజు శంకుస్థాపనలు చేశారు. తాజాగా నాగార్జునసాగర్​, నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సూర్యాపేట, నల్గొండ జిల్లాలోని మొత్తం ఏడు స్కూళ్లకు రూ.200 కోట్ల చొప్పున రూ.1400 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీంతో త్వరలో పనులు ప్రారంభంకానున్నాయి. 
 
సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో 7 స్కూళ్లు.. 

సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరయ్యాయి. కోదాడ నియోజకవర్గానికి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ చిలుకూరు మండలం సీతారామపురం గ్రామ రెవెన్యూ పరిధి గ్రామ శివారులోని 1151 సర్వే నంబర్ లో గల 22 ఎకరాల ప్రభుత్వ భూమిలో నిర్మించనున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందిన రెసిడెన్షియల్ స్కూల్ ను గడ్డిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 57లో 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించానున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని 98 సర్వే నంబర్​లో 20 ఎకరాల భూమిని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం కేటాయించారు. 

నల్గొండ నియోజకవర్గంలో గంధంవారిగూడెం సమీపంలో స్కూల్​నిర్మాణం కోసం 25 ఎకరాలను భూమిని కేటాయించారు. మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి మొదటగా మునుగోడు మండలంలోని కల్వకుంట్ల శివారులోని సర్వే నంబర్ 51లో 22 ఎకరాల భూమిని గుర్తించారు. అయితే పెద్ద స్థలం లేకపోవడం, మండల కేంద్రంలో స్కూల్ ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయాలను చూస్తున్నారు. ప్రస్తుతం మునుగోడులోని సర్వే నంబర్ 78లో భూమి కోసం సర్వే నిర్వహిస్తున్నారు. త్వరలోనే సర్వే పూర్తి చేసి స్కూల్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇక నకిరేకల్ మండలం కడపర్తి రెవెన్యూ పరిధి గ్రామ శివారులోని 423 నుంచి 427 సర్వే నంబర్లలో 20 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దవూర మండలం చలకుర్తి గ్రామంలో 20 ఎకరాల్లో ఎన్ఎస్పీ ల్యాండ్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్​ను నిర్మించనున్నారు.   

సకల సౌకర్యాలతో స్కూళ్ల నిర్మాణాలు..

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లతో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో స్కూల్ ను 20 నుంచి 25 ఎకరాల్లో నిర్మించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే డిజైన్ లో స్కూళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో స్కూల్ లో 2,560 మంది విద్యార్థులు చేరడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ ఇలా అన్ని వర్గాలకు చెందిన పేద విద్యార్థులు ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదువుకోవచ్చు. ప్రతి స్కూల్ లో 120 మంది టీచర్లు పనిచేస్తారు. ఈ స్కూళ్లకు ప్రత్యేకంగా అడ్మినిస్ట్రేషన్ భవనాన్ని నిర్మిస్తారు. ఒక్కో లైబ్రరీలో 5 వేల పుస్తకాలు, 60 కంప్యూటర్లు, క్లాసు రూముల్లో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. 

900 మంది ఒకేసారి కూర్చుని భోజనం చేసేలా డైనింగ్ హాల్, స్టూడెంట్స్ తోపాటు టీచర్లకు రెసిడెన్షియల్ క్యాంపస్, ప్రతి డార్మటరీలో 10 బెడ్ లు, రెండు బాత్ రూమ్ లు నిర్మించేలా ప్లాన్ చేశారు. క్యాంపస్ లో గ్రీనరీని డెవలప్ చేయడంతోపాటు సోలార్ ఎనర్జీ, వర్షపు నీటి సంరక్షణ, కల్చరల్ యాక్టివిటీస్ కోసం ఆడిటోరియం, ఇండోర్, ఔట్ డోర్ స్టేడియంతోపాటు ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.